Health

అయిదు గంటల కన్నా ఎక్కువ ఫోను వాడితే త్వరగా పోతారు

అయిదు గంటల కన్నా ఎక్కువ ఫోను వాడితే త్వరగా పోతారు - Using smartphones for more than 5years will bring death faster

ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోనే. టైం చూసుకోవాలన్నా.. లెక్కలు చేసుకోవాలన్నా.. సినిమాలు, సీరియళ్లు చూడాలన్నా ప్రతిదానికి మనం ఫోనే వాడుతాం. పొద్దున లేచింది మొదలు రాత్రి పొద్దుపోయేంతవరకు మొబైల్‌లోనే మునిగి తేలుతున్నాం. అయితే గంటల తరబడి ఫోన్‌ చూస్తూ ఉండిపోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. మొబైల్‌ వల్ల శారీరక వ్యాయామం తగ్గుతోందని ఫలితంగా ఊబకాయం రావొచ్చని తాజా పరిశోధనలు చెబుతున్నాయి.

వెనెజువెలాలోని సైమన్‌ బొలివర్‌ యూనివర్శిటీలో గల హెల్త్‌ సైన్సెస్‌ ఫ్యాకల్టీ విభాగానికి చెందిన విద్యార్థులతో ఇటీవల పరిశోధకులు ఓ అధ్యయనం చేపట్టారు. 5 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సేపు మొబైల్‌ ఉపయోగించేవారిలో ఊబకాయం వచ్చే అవకాశాలు 43శాతం ఎక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనంలో తేలింది. ఇక మొబైల్‌ ఎక్కువగా వాడటం వల్ల మన జీవనశైలిలోనూ మార్పు వస్తుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు తెలిపారు.

‘మొబైల్‌ టెక్నాలజీ నేటి తరాన్ని చాలా ఆకట్టుకుంటోందన్నది నిజమే. దీని వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అయితే మరోవైపు కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్‌లో గంటల తరబడి గడపడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. దీని వల్ల ఊబకాయం, షుగరు, గుండె సంబంధిత వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ల బాడిన పడే ప్రమాదం ఉంది’ అని రీసర్చ్‌ హెడ్‌ మిరారీ మాంటిల్లా మారన్‌ తెలిపారు.

మొత్తం 1060 మంది విద్యార్థులతో ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో 700 మంది యువతులు, 360 మంది యువకులున్నారు. వీరంతా సగటున 20ఏళ్లవారే. ఐదు గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్‌లో గడిపిన యువకుల్లో 36శాతం మంది బరువు పెరగగా.. 42.6శాతం మంది ఊబకాయం బారిన పడ్డట్లు అధ్యయనంలో తేలింది. ఇక యువతుల్లో 63.9శాతం మంది బరువు పెరగగా.. 57.4శాతం మంది ఊబకాయానికి గురైనట్లు వెల్లడైంది. ఏదైనా మితంగా ఉంటే అమృతం.. అమితమైతే విషం అవుతుందని అంటే ఇదే మరి. అందుకే టెక్‌ ప్రియులు కాస్త జాగ్రత్తగా ఉండాలి సుమా..!