Devotional

అరసవెల్లి సూర్యనారాయణుడి అరకిలో బంగారం మాయం

Half KG Gold Missing From Arasavelli Temple

ప్రసిద్ధ సూర్యనారాయణ స్వామి ఆభరణాలకు కాళ్లొచ్చాయా? లెక్కల మాయాజాలం నడుమ చేతివాటం చూపారా? బంగారం…వెండి ఆభరణాలను నిర్భయంగా పక్కదారిపట్టించేశారా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి!! అరసవల్లి ఆదిత్యాలయంలో గత ఆదివారం విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల అనంతరం.. ఈ విషయం బయటపడినట్లు సమాచారం!! అధికారులు మరింత పక్కా సమాచారం కోసం శోధిస్తున్నారు!!
****అరసవల్లి సూర్యనారాయణ స్వామి మూలవిరాట్టుకు బంగారు ఆభరణాలు అలంకరిస్తే కనులారా చూడాలనేది భక్తుల ఆశ. అది దాదాపు పదేళ్లుగా తీరని కలగానే మిగిలింది. పలు కారణాలు చెబుతూ స్వామికి స్వర్ణశోభను అధికారులు దూరం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో మరో కలకలం బయపడింది. స్వామికి భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తుంటారు. వాటిల్లో బంగారం, వెండి ఆభరణాలూ ఉంటాయి. వీటి వివరాలు ఆలయంలోని పుస్తకాల్లో నమోదు చేస్తారు. ఆ తరువాత బ్యాంకుల్లో జమ చేస్తారు. ఇలా బ్యాంకుల లెక్కల వివరాలుండే దస్త్రాల్లో ఏదో మాయ జరిగిందని…ఆభరణాల లెక్కల్లో తేడాలున్నట్లు విజిలెన్స్ అధికారుల ప్రాథమికంగా పసిగట్టారు. 2010 నుంచి ఇప్పటి వరకూ స్వామికి విరాళాలుగా ఇచ్చిన ఆభరణాల వివరాలూ పక్కాగా లేవని సూచాయగా గుర్తించారు. బ్యాంకుల్లో భద్రపరిచిన ఆభరణాల వివరాలూ పూర్తిగా లేవనే ఆరోపణలు వస్తున్నాయి.
**దాతలకు రశీదులు ఇస్తున్నారా? లేదా?…
దాతలకు ఇస్తున్నవి అసలు రశీదులేనా? అనే అనుమానాలూ ఉన్నాయి. వాస్తవ రశీదులే ఇస్తే బ్యాంకుల్లో భద్రపరిచిన ఆభరణాల వివరాల్లో వాటిని ఎందుకు పూర్తిగా పొందుపరచలేదనే సందేహాలూ వెంటాడుతున్నాయి. గతంలో పనిచేసిన ఓ అధికారి ఆలయానికి చెందిన లెక్కలు… ఆభరణాలు, భూముల వివరాలకు సంబంధించిన దస్త్రాలు, హుండీ లెక్కింపుల సమాచారం పూర్తిగా చెప్పకపోవడమూ గమనార్హమే. సదరు అధికారి స్వస్థలంలోనూ నిఘా అధికారులు తమదైన శైలిలో పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది.
**రూ.కోట్ల విలువైన ఆభరణాలున్నా…
ఆదిత్యుడు ఏడాదికి ఓసారి భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. మిగిలిన రోజుల్లో సాధారణ అలంకరణతో, వెండి ఆభరణాలలో దర్శనం ఇస్తారు. రూ.కోట్లు విలువ చేసే ఆభరణాలున్నప్పటికీ వాటిని స్వామి వారికి అలంకరించటం లేదు. బ్యాంక్ లాకర్లలోనే భద్రపరిచారు. తగిన భద్రత కల్పించటం కష్టమంటూ బ్యాంక్ నుంచి బయటకు తీయకుండా తాత్సారం చేస్తూ వస్తున్నారు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఏటా స్వామివారికి బంగారు ఆభరణాలు అలంకరిస్తామంటూ చెప్పుకొస్తున్న అధికారుల మాటలు మాటలుగానే మిగిలిపోతున్నాయి. ఆచరణకు నోచుకోవడంలేదు. మరో వైపు బంగారం, వెండి లెక్కల గోల్మాల్ మాత్రం కలకలం రేపుతోంది.
***ఆ దస్త్రాల్లో లెక్కలు తేలితే…
అరసవల్లిలో గతంలో పని చేసిన ఓ అధికారి అయిదు కిలోల వెండి, అరకేజీ బంగారాన్ని పక్కదారి పట్టించారనే ఆరోపణలు ర్చనీయాంశమవుతున్నాయి. ఈ విషయాన్ని పసిగట్టిన విజిలెన్స్ అధికారులు ఈ దిశగా ఆరా తీస్తున్నారు. అందుకే ఆలయ దాతల లెక్కల దస్త్రాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
**ఆదిత్యునికి ప్రస్తుతం ఉన్న అభరణాలు(సుమారు)
బంగారం : 13.476 కిలొలు
వెండి : 448.406 కిలోలు.