Politics

మీ రద్దులు హద్దులు మీరుతున్నాయి

మీ రద్దులు హద్దులు మీరుతున్నాయి - Chandrababu Slams YS Jagan For His Cancellations

పేదలపై సీఎం జగన్‌కు ఎందుకంత కోపమని తెదేపా అధినేత చంద్రబాబు నిలదీశారు. పేదలకోసం పెట్టిన అన్న క్యాంటీన్లను మూసివేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. రూ.5కే పేదలు అన్నం తింటుంటే ఈ కక్ష సాధింపేంటని మండిపడ్డారు. గుంటూరులోని తెదేపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధే సంతృప్తి ఇచ్చిందని చెప్పారు. అంత కష్టపడితే తెదేపాకు 23 సీట్లు రావడమేంటో ఇప్పటికీ అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తెదేపా హయాంలో పేదరికమే కొలమానంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని.. ఎక్కడా వివక్ష చూపలేదని స్పష్టంచేశారు. తెదేపా కార్యకర్తలపై దాడులకు దిగితే సహించేదిలేదని చంద్రబాబు హెచ్చరించారు. 45 ఏళ్లకే పింఛను ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్‌ మాటతప్పారని చంద్రబాబు మండిపడ్డారు. తెదేపా హయాంలో ఒకటో తేదీన కచ్చితంగా ఇచ్చామన్నాని.. ఇప్పుడు పింఛను ఎప్పుడొస్తుందో తెలీని పరిస్థితి ఉందని ఆయన దుయ్యబట్టారు. గిరిజనులకు ప్రత్యేక పంచాయతీల ఏర్పాటుకు తామే నాంది పలికామని గుర్తుచేశారు. నీళ్లు కూడా లేని కరవు జిల్లా అనంతపురంలో కియా మోటార్స్‌ నెలకొల్పేలా చేస్తే వైకాపా రౌడీలు అక్కడ వీరంగం సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దుల ప్రభుత్వంలా వైకాపా సర్కారు తయారైందని ధ్వజమెత్తారు. పోలవరం, అమరావతి, బందరు పోర్టు నిర్మాణం నిలుపుదల చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్లాలని తాము భావిస్తే.. వైకాపా ప్రభుత్వం ఇప్పుడిలా చేయటం బాధేస్తోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.