NRI-NRT

హ్యూస్టన్‌లో మోడీ సభకు పకడ్బందీ ఏర్పాట్లు

Modi Houston Meeting Arrangements In Full Swing

వచ్చే నెల ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా నిర్వహించ తలపెట్టిన భారీ కార్యక్రమానికి ప్రవాసుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి 40వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరో పది వేల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. దరఖాస్తులు ప్రారంభమైన తొలి రెండు వారాల్లోనే 39వేల మంది తమ ఆసక్తిని తెలియజేసినట్లు తెలిపారు. దాదాపు ఐదు లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్న హ్యూస్టన్లో ‘హౌదీ మోదీ’ పేరిట ఈ సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ నగర మేయర్‌ సిల్వస్టర్ టర్నర్‌ మాట్లాడుతూ.. మోదీకి స్వాగతం పలకడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నారు. అలాగే టెక్సాస్‌కు చెందిన సెనేటర్‌ జాన్‌ కార్నిన్‌ సైతం మోదీ రాక పట్ల ఆసక్తి వ్యక్తం చేశారు. భారత్‌-అమెరికా మధ్య మెరుగైన వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. వాటిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అమెరికాలోని అనేక భారతీయ సంఘాలు ఈ కార్యక్రమానికి పూర్తి మద్దతు, సహకారాన్ని అందిస్తున్నాయి. ఇరు దేశాల వాణిజ్య బంధంలో హ్యూస్టన్‌ది కీలక పాత్ర. అందుకే ఈ కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించాలని నిర్ణయించారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొనడానికి వెళ్లనున్న మోదీ ప్టెంబరు 22న అక్కడి భారతీయులనుద్దేశించి ప్రసంగించనున్నారు. హ్యూస్టన్‌లోని ఎన్‌ఆర్‌జీ స్టేడియంలో ఈ సభ జరగనుంది. ‘‘భారతీయ అమెరికన్‌ సోదరులను పెద్ద ఎత్తున ఒక చోట కలిపే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం భారతీయతను ప్రతిబింబిస్తుంది. సభకు హాజరయ్యేవారికి ఇబ్బంది కలగకుండా హ్యూస్టన్‌ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి 300 బస్సులు ఏర్పాటు చేయనున్నాం’’ అని కార్యక్రమ నిర్వహక కమిటీ కన్వీనర్‌ జుగల్‌ మలానీ తెలిపారు. ప్రధాని ప్రసంగానికి ముందు భారతీయ అమెరికన్లు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితమని, అయితే హాజరవలనుకున్నవారు ముందస్తుగా తమ పేర్లు నమోదు చేయించుకొని, ప్రవేశ పాసులు పొందాల్సి ఉంటుందన్నారు.