Agriculture

పంజాబీల దైవం బోర్లాగ్

Norman Borlaug The Man Who Made Wheat Growing A Miracle-పంజాబీల దైవం బోర్లాగ్

ఓ అమెరికా శాస్త్రవేత్త…మన రైతులకూ సాయం చేశాడు…మంచి దిగుబడినిచ్చే విత్తులందించాడు…కరవు నుంచి గట్టున పడేశాడు…అందుకే రైతుల గుండెల్లోనిలిచిపోయాడు…ఇంతకీ ఎవరా శాస్త్రవేత్త? ఏంటా వివరాలు?
బోర్లాగ్ 1914, మార్చి 25న అమెరికాలోని అయోవాలో ఒక రైతు కుటుంబంలో పుట్టాడు.
* తన ప్రాథమిక విద్యను ఒక చిన్న ఊళ్లోని పాఠశాలలోఅభ్యసించాడు. భవిష్యత్తులో చేయబోయే వ్యవసాయ పరిశోధనలకు బీజం పడింది ఇక్కడే. తమ 160 ఎకరాల వ్యవసాయ క్షేత్రం నుంచే ఆ శిక్షణ పొందాడు.
* ఏడేళ్ల వయసు నుంచి 19 ఏళ్లు వచ్చే వరకూ చేపలు పట్టడం, వేటాడటం, మొక్కజొన్న పంట పోషణ, పశువులు-కోళ్ల పెంపకంలో నేర్చుకున్న మెలకువలు బోర్లాగ్కి తర్వాత ఎంతో ఉపయోగపడ్డాయి.
* నలుగురు పిల్లల్లో పెద్దవాడైన బోర్లాగ్ చిన్నతనం నుంచే మంచి క్రీడాకారుడు. ముఖ్యంగా కుస్తీలు పట్టడంలో. అలా ఆడుతూ పాడుతూ చదువుతో పాటు కుస్తీ పోటీల్లో పాల్గొనేవాడు. మినిసోటా యునివర్సిటీ నుంచి అటవీ శాస్త్రం (ఫారెస్టరీ)లో డిగ్రీ పొందాడు. అమెరికా అటవీశాఖలో ఉద్యోగంలో చేరాడు.
* ఆ తర్వాత అదే విశ్వవిద్యాలయం నుంచి ప్లాంట్ పాథాలజీ, జెనిటిక్స్ల్లో పీహెచ్డీ పొందాడు. ఇంటర్నేషనల్ మేజ్ అండ్ వీట్ ఇంప్రూవ్మెంట్ సెంటర్ (మెక్సికో)లో డైరక్టర్గా, ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్సెస్లో ప్రొఫెసర్గా పనిచేశాడు.
* ఈయన పరిశోధనలు చేసి రోగనిరోధక శక్తి ఉన్న, అధిక దిగుబడినిచ్చే చిన్నసైజు(డ్వార్ఫ్) గోధుమ వంగడాల్ని సృష్టించాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా గోధుమ పంటలో అధిక ఉత్పత్తికి సాయపడింది. మామూలుగా ఎరువులు వేయడం వల్ల గోధుమ మొక్కలు ఎత్తుగా, ఏపుగా పెరిగినా..వాతావరణం సరిగ్గా లేనప్పుడు పంటకు నష్టం వస్తుంది. నత్రజని ఎరువులకు స్పందించే కురచ జన్యువుల్ని జోడించడం ద్వారా గడ్డి తక్కువగా ఉండి అధిక ధాన్యాన్నిచ్చే గోధుమ జాతిని కనిపెట్టాడు.
* 1960లో భారత్, పాకిస్థాన్ దేశాలు కరవు తీవ్రతను ఎదుర్కొంటున్నప్పుడు తాను కనుగొన్న కొత్త గోధుమ జాతిని పండించమని ఆయా ప్రభుత్వాలను బోర్లాగ్ ప్రోత్సహించాడు. దాని ఫలితమే 1968లో పాకిస్థాన్, 1974లో భారతదేశం ఎక్కువ క్యాలరీల శక్తినిచ్చే గోధుమ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించడం. ఈ హరిత విప్లవ సూత్రాన్ని ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాల్లో పంటలపై ప్రయోగించారు. దీంతో కరవు తీవ్రత తగ్గింది.
* ఈయన వ్యూహం అడవుల జోలికి ఏమాత్రం పోకుండా జెనిటిక్ ఇంజినీరింగ్ సాయంతో ప్రస్తుతమున్న సాగు భూమిలోనే దిగుబడులను భారీగా పెంచడం. బోర్లాగ్ ఉత్పత్తి చేసిన అధిక దిగుబడినిచ్చే గోధుమ రకాలు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద 187 మిలియన్ల ఎకరాల భూమిలో సాగవుతున్నాయి.
* కరవు కోరల్నించి కోట్లాదిమందిని కాపాడాడు. వారి ఆకలి తీర్చాడు. అందుకే 1970లో నోబెల్శాంతి బహుమతి అందుకున్నాడు. ఆయన ఎవరో కాదు… ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. ‘ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్’గా పేరు తెచ్చుకున్న నార్మన్ ఎర్నెస్ట్ బోర్లాగ్. వ్యవసాయ పరిశోధనల్లోని సాంకేతిక విభాగాల్ని కలుపుతూ, రాజకీయ నాయకుల్ని ఒప్పించి ఆహార పంటల్లో అధిక దిగుబడి సాధించిన ఘనత ఈయనది.
నోబెల్ ప్రకటించినప్పుడు బోర్లాగ్ టెలిఫోన్కు అందుబాటులో లేడు.వార్తాహరులు వెళ్లేటప్పటికి గోధుమపొలంలో స్టూలు మీద కూర్చొని కృత్రిమ గోధుమ మొక్కలను ప్రశాంతంగా పరిశీలిస్తున్నాడట. అవిశ్రాంతంగా కృషి చేసిన ఈ వ్యవసాయ శాస్త్రజ్ఞుడు సెప్టెంబరు12, 2009లో తన 95వ ఏట మరణించాడు. పంజాబ్, హరియాణా ప్రాంతాల్లోని రైతుల ఇళ్లలో నార్మన్ బోర్లాగ్ చిత్రపటం దర్శనమిస్తుంది.