Politics

బంగారు తెలంగాణా వారికి నచ్చట్లేదు

BJP and other oppositions not liking a developed telangana - slams KTR

క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలే తెరాస బలమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఇప్పటి వరకు 50 లక్షల మంది తెరాస సభ్యత్వం తీసుకున్నారని వెల్లడించారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నిర్వహించిన నియోజవర్గ తెరాస విస్త్రృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రాష్ట్రం బాగుపడుతుంటే కొందరికి నచ్చడం లేదని మండిపడ్డారు. తెలంగాణ పచ్చగా ఉండటం కాంగ్రెస్‌, భాజపా నాయకులకు నచ్చడం లేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో వేసిన ఎత్తుగడలు తెలంగాణలో వేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ‘తెలంగాణలో అమలు చేస్తున్న ఒక్క పథకమైనా భాజపా పాలితప్రాంతాల్లో ఉందా’?అని కేటీఆర్‌ ప్రశ్నించారు. భాజపా నేతలు ఆరోపణలు చేయడం కాదు.. ఆధారాలు చూపెట్టాలని సవాల్‌ విసిరారు. ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్యశ్రీ మంచి పథకమని కేటీఆర్‌ అన్నారు. మన రాష్ట్రంలోని పథకాలనే కేంద్రం కాపీ కొడుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏడాదికి రూ.12 వేల కోట్లు పింఛన్లుగా ఇస్తుంటే అందులో కేంద్రం ఇచ్చేది కేవలం రూ.200 కోట్లు మాత్రమే అని వివరించారు. మతాల చిచ్చుపెట్టి, ఆ సెగతో కాపుకోవాలని భాజపా చూస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్‌ రాజు,నవీన్‌, పార్టీ ఇతర నాయకులు పాల్గొన్నారు.