DailyDose

రాజధాని రైతులకు పవన్ బాసట-రాజకీయ–08/24

Pawan Kalyan To Support Amaravathi Farmers-Telugu Political News Today-08/24

* ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుంచి తరలించకూడదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రాష్ట్ర ప్రజల్ని గందరగోళానికి గురి చేసే విధంగా రాజధాని విషయంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. గత ప్రభుత్వ నిర్ణయాన్ని మరింత మెరుగ్గా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రాజధాని సమస్య ఒక ప్రాంతానిది కాదని, రాష్ట్రమంతటిదని చెప్పారు. ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధానిని మార్చుకుంటూ పోతే వ్యవస్థలపై నమ్మకం పోతుందని మండిపడ్డారు.హైదరాబాద్‌ జనసేన కార్యాలయంలో పవన్‌తో రాజధాని ప్రాంత రైతుల బృందం శనివారం కలిసింది. రాజధాని పట్ల వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఈ సందర్భంగా వారు పవన్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పవన్‌ స్పందిస్తూ.. రైతుల ఆవేదన అర్థం చేసుకున్నానని, వారికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 30, 31 తేదీల్లో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. ఇప్పటికే చేపట్టిన పనులు, నిలిచిన ప్రాజెక్టులను పరిశీలిస్తానని పవన్‌ వెల్లడించారు.
* కశ్మీర్ లో రాహుల్ పై ఆంక్షలు
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్‌లు ఇవాళ(శనివారం) శ్రీనగర్‌ను సందర్శించనున్నారు. ఈ క్రమంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రతిపక్ష పార్టీల నేతలెవరూ శ్రీనగర్ రావొద్దంటూ ప్రభుత్వం తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. శ్రీనగర్ రావడంతో సామాన్య ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని చెప్పింది. సీనియర్ నేతలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరింది. శాంతిభద్రతలకు, ప్రజల ప్రాణాలకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామంది.
* వెంకయ్యనాయుడు పర్యటన రద్దు
అత్యవసరంగా ఢిల్లీ బయల్దేరుతున్న వెంకయ్యనాయుడుకేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతితో కార్యక్రమాలు రద్దు తిరుగు ప్రయాణం అవుతున్న గవర్నర్ హరి చందన్.
* ఐపీఎస్ లు దేశాభివృద్ధికి పాటుపడాలి :అమిత్ షా
ఐపీఎస్ సాధించడంతోనే యువత ఆశయం పూర్తయినట్లు కాదు. నిజాయతీగా సేవ చేసి గౌరవం పొందాలి, దేశాభివృద్ధికి పాటుపడాలి అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. 70వ బ్యాచ్‌కు చెందిన 92 మంది ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరై ప్రసంగించారు. దరికంలో మగ్గుతున్న కోట్లాది ప్రజలకు సేవ చేసి వారిని వృద్ధిలోకి తీసుకురావాలి. భారతమాత కోసం ఇప్పటికే ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. పోస్టింగ్ ఎక్కడ ఇచ్చినా అందరితో సమన్వయం చేసుకుంటూ సత్ఫలితాలు సాధించాలి. రాజ్యాంగస్ఫూర్తి దెబ్బతినకుండా, ధైర్యంగా విధులు నిర్వహించాలి అని అమిత్ షా ఐపీఎస్‌లకు సూచించారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారు. స్వదేశీ సంస్థానాల విలీనం కోసం పటేల్ చేసిన కృషి ఎప్పటికీ మరిచిపోలేనిది. తాజాగా జమ్మూకశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దుతో పటేల్ ఆశయం పూర్తిగా నెరవేరింది. దశాబ్దాలుగా జఠిలంగా ఉన్న కశ్మీర్ సమస్యను ప్రధాని మోదీ పరిష్కరించారు అని అమిత్ షా తెలిపారు.
*ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధం: అసదుద్దీన్ ఒవైసీ
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆర్టికల్ 370ని రద్దుచేసిందని, ఇది ఏకపక్షం-రాజ్యాంగ విరుద్ధమని ఏఐఎంఐఎం నేత- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ‘ది ప్రింట్ డెమోక్రసీ వాల్’ కార్యక్రమంలో మాట్లాడుతూ, అక్కడి ప్రజలను నిర్బంధించి హక్కులను కాలరాయడం తగదన్నారు. కేంద్రప్రభుత్వం కశ్మీర్లో చేసిన మూడు పెద్ద తప్పిదాల్లో ఇది ప్రధానమన్నారు. 1953లో షేక్ అబ్దుల్లాను అరెస్టు చేయడం, 1987 ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడటం, ప్రస్తుతం ఆర్టికల్ 370ని రద్దుచేయడం గమనార్హమన్నారు.
*కర్ణాటకలో మైత్రీ కూటమికి బీటలు
కర్ణాటకలో కాంగ్రెస్, జనతాదళ్ మధ్య పొత్తు చీలిక దిశగా సాగుతోంది. మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు హెచ్.డి.దేవేగౌడ ఓ మాధ్యమ సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయేందుకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కారణమని ప్రత్యక్షంగానే ఆరోపించారు. ఇదే క్రమంలో రెండు వైపులా మాటల యుద్ధం మొదలైంది. సిద్ధరామయ్య సూచనల మేరకే పలువురు అసమ్మతి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి కుమారస్వామి ప్రభుత్వ పతనానికి కారకులయ్యారన్న దేవేగౌడ ఆరోపణలపై శుక్రవారం సిద్ధు తీవ్రంగా స్పందించారు.
*కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ సాధ్యమే: ఎమ్మార్పీఎస్
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే, అది చట్టం కావడం ఖాయమని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణమాదిగ అన్నారు. ఆయన భద్రాచలంలో శుక్రవారం ‘సమితి’ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమ ముఖ్యఅతిథిగా పాల్గొని, ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు.రెండున్నర దశాబ్దాలుగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ, వచ్చే శీతాకాల సమావేశాల్లోనైనా బిల్లును ప్రవేశపెట్టాలని భాజపాను కోరారు.
*ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలి
మోదీ ఏకపక్ష నిర్ణయాల వల్ల దేశం సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రస్తుత పరిస్థితుల్లో వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులన్నీ ఏకమై ఐక్య పోరాటాలు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్కుమార్ అంజాన్ పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం పార్టీ రాష్ట్ర సమితి సమావేశంలో ముఖ్యఅతిథిÅగా పాల్గొన్నారు. మోదీ పాలనలో రైతులు రోడ్డున పడ్డారని, ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని అతుల్కుమార్ ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను హరించివేశారని, ఆర్థికంగా దేశం వెనుకబడిందని విమర్శించారు. కేవలం ఇద్దరు చేసిన నిర్ణయాలను కశ్మీర్ ప్రజలపై బలవంతంగా రుద్దారని, స్వదేశీ ఉత్పత్తుల పేరిట విదేశీ సంస్థలకు తలుపులు బార్లా తెరిచారని తెలిపారు.
*మోదీపై వ్యక్తిగత విమర్శలు తగవు
ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయకూడదని, విధానాలపైనే వ్యాఖ్యానించాలని కాంగ్రెస్ పార్టీలోని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ నేతలైన రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్, లోక్సభ సభ్యుడు శశి థరూర్, అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తొలుత గురువారం జైరాం రమేశ్ ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీని రాక్షసుడిగా భావించకూడదని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ వ్యతిరేక దృష్టితో చూడకూడదని చెప్పారు. ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ సింఘ్వి శుక్రవారం ట్వీట్ చేశారు. వ్యక్తుల వారీగా కాకుండా సమస్యల ఆధారంగా పరిపాలన తీరును నిర్ణయించాలన్నారు. థరూర్ ట్వీట్ చేస్తూ మంచి పనులను ప్రశంసించి, తప్పులను విమర్శించాలని తాను గత ఆరేళ్లుగా చెబుతూ ఉన్నానని అన్నారు.
*రాజధాని రైతులకు అండ: కన్నా
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు భాజపా అండగా నిలుస్తుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భరోసానిచ్చారు. రాజధానిని మరో ప్రాంతానికి తరలిస్తున్నారని వస్తున్న వదంతుల నేపథ్యంలో పొగాకు బోర్డు ఛైర్మన్ యడ్లపాటి రఘునాథబాబుతో కలిసి పలువురు రైతులు శుక్రవారం గుంటూరులోని కన్నా నివాసానికి వచ్చి గోడు వెళ్లబోసుకున్నారు.
*అమరావతి ముంపు ప్రాంతంలోనే ఉంది: మంత్రి బొత్స
రాజధాని అమరావతి ముంపు ప్రాంతంలోనే ఉందని..అందులో సందేహమే లేదని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తెదేపా హయాంలో రాజధాని విషయంలో రూ.వేల కోట్ల అవినీతి జరిగిందంటూ చేసిన విమర్శలను భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అప్పుడే మరిచిపోయారా? అని విమర్శించారు. 13 జిల్లాలనూ సమాన దృష్టితో అభివృద్ధి చేస్తామని చెప్పారు. అమరావతిలో భూముల ధరలు తగ్గినా విజయవాడ, విశాఖపట్నం ప్రాంతాల్లో పెరిగాయన్నారు. రాజధాని విషయంలో ఎవరి అభిప్రాయాలు వారివని వ్యాఖ్యానించారు.