Health

తప్పుడు రక్తనిర్ధారణ పరీక్షతో మహిళ మృతి

Women From Himachal Pradesh Dies Due To False Blood Test Results

ప్రైవేటు క్లినిక్‌ వైద్యుడి పరీక్షల తప్పుడు నిర్ధరణల కారణంగా ఒక మహిళ షాక్‌కు గురై చనిపోవడం సంచలనం సృష్టించింది. ఈ విషయం హిమాచల్‌ ప్రదేశ్‌ శాసనసభలో పెద్ద వివాదంగా మారింది. బుధవారం శాసనసభలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లాల్ బ్రక్త ఈ అంశాన్ని లేవదీశారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌ స్పందిస్తూ.. ఇది చాలా సున్నితమైన అంశంమని వెంటనే దర్యాప్తు చేపట్టి రాత్రిలోగా నివేదికలు సమర్పించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అసలు వివాదానికి కారణం ఏంటంటే.. రోహ్రు ప్రాంతానికి చెందిన ఒక మహిళ అనారోగ్యంతో సమీపంలోని ప్రైవేటు క్లినిక్‌కు వెళ్లింది. ఆ క్లినిక్‌లోని వైద్యుడు ఆమెకు పరీక్షలు నిర్వహించాడు. ఆమెకు ఏమైందో చెప్పకుండానే పరీక్షల తాలూకు నివేదికలను వారికి ఇచ్చాడు. అనంతరం ఆమె భర్తతో కలసి చికిత్స నిమిత్తం షిమ్లాలోని కమలానెహ్రూ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఆమె భర్త వైద్యులకు ప్రైవేటు క్లినిక్‌లో ఇచ్చిన రిపోర్టులను చూపించాడు. ఆ వైద్యుడి రిపోర్టులను పరిశీలించిన ప్రభుత్వ వైద్యులు వాటి ప్రకారం ఆమెకు హెచ్‌ఐవీ ఉన్నట్లు తెలిపారు. ఆమెను మళ్లీ తాజాగా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఆ లోపే ఆమె తనకు హెచ్‌ఐవీ ఉండటమేంటి అని షాక్‌కు గురై వెంటనే కోమాలోకి వెళ్లిపోయింది. అనంతరం ఆమెను ఇందిరాగాంధీ మెడికల్‌ ఆస్పత్రికి తరలించగా మంగళవారం మరణించింది.
మహిళకు హెచ్‌ఐవీ సోకినట్లు తప్పుడు నివేదికల నిర్దారణలతో ఆమె మృతికి కారణమైన ఆ క్లినిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.