Business

బ్యాంకుల్లో డబ్బులు బానే దాస్తున్నారు

Bank deposits see increase in India

గత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో పొదుపు జమలు దాదాపు రూ. 4లక్షల కోట్లు పెరిగాయట. ఈ మేరకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి గానూ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించిన గణాంకాల ద్వారా వెల్లడైంది.

2017-18 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కమర్షియల్‌ బ్యాంకుల్లో(విదేశీ బ్యాంకులు కలిపి) మొత్తం సేవింగ్స్‌ డిపాజిట్లు రూ. 36.55లక్షల కోట్లుగా ఉండగా.. మార్చి 31, 2019 నాటికి అవి రూ. 40.31లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో రూ. 39.72లక్షల కోట్లు ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లోని పొదుపు డిపాజిట్లు కాగా.. విదేశీ బ్యాంకుల్లో రూ. 58,630కోట్ల జమలు ఉన్నట్లు ఆర్‌బీఐ గణాంకాలు పేర్కొన్నాయి.

ఈ ఏడాది తొలి త్రైమాసికం నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సగటు డిపాజిట్లు 6.7శాతం పెరగగా రుణాలు 8.7శాతం ఎక్కువయ్యాయి. ఇదే కాలంలో ప్రయివేటు రంగ బ్యాంకుల్లో డిపాజిట్లు 16.3శాతం పెరగగా.. రుణాల్లో 17.5శాతం వృద్ధి నమోదైనట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.