Politics

తెదేపా పాలిట్‌బ్యూరో నిర్ణయాలు ఇవే

తెదేపా పాలిట్‌బ్యూరో నిర్ణయాలు ఇవే - TDP Polit Bureau Meeting Today Details & Resolutions

సంస్థాగతంగా పార్టీ బలోపేతం. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం గుంటూరు ఎన్టీఆర్ భవన్ లో పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చర్చించిన అంశాలు

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
సంతాపాలు

దివంగత టిడిపి నేతలకు సంతాపం:

తెలుగుదేశం పార్టీ నాయకులు దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు, మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్, సీనియర్ నేత పసుపులేటి బ్రహ్మయ్య మృతికి పొలిట్ బ్యూరో సంతాపం తెలియజేసింది. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

-తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ శ్రీ కోడెల శివ ప్రసాదరావును మానసిక క్షోభకు గురి చేసి ఆత్మత్యాగం చేసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం కారణమైంది. అసెంబ్లీ ఫర్నిచర్ విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తూ, నిందారోపణలు వేశారు.

పల్నాడులో ఎన్నో సంఘటనలను ధైర్యంగా ఎదుర్కొన్న కోడెల తన ఆత్మస్థైర్యం కోల్పోయేలా అక్రమ కేసులతో వేధించారు.

దశాబ్దాలుగా ప్రజా సమస్యలపై చిత్తశుద్దితో పనిచేసిన నాయకుడిని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక తప్పుడు కేసులు పెట్టి వేధించారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ ఎన్.శివప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటు అన్నారు. పార్లమెంటులో తనదైన శైలిలో నిరసన తెలియజేసి రాష్ట్ర సమస్యలను దేశమంతా చర్చించేలా దోహదపడ్డారు.

ఎంపీగా ప్రజలకు ఎనలేని సేవలు అందించారన్నారు.

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య మరణం పార్టీకి తీరని లోటుగా పేర్కొన్నారు. పార్టీ పటిష్టత కోసం బ్రహ్మయ్య చేసిన కృషి మరువలేమని అన్నారు.

పడవ ప్రమాద మృతులకు సంతాపం:
౼౼౼౼౼౼౼౼౼౼౼౽౽
గోదావరిలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. 33రోజులైనా, పడవను ఇంకా బయటకు తీయకపోవడం ప్రభుత్వ వైఫల్యమే.. మృతదేహాలు దొరకక, బతికిఉన్నారో, చనిపోయారో తెలియక ఇంకా అనేక కుటుంబాల మానసిక క్షోభ అంతాఇంతా కాదు.

వైసిపి ప్రభుత్వం కిమ్మిన్నాస్తిగా వ్యవహరించడం శోచనీయం.
తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసి కార్మికులకు సంతాపం:

ఇద్దరు ఆర్టీసి కార్మికులు తెలంగాణలో ఆత్మహత్య చేసుకోవడం పట్ల టిడిపి పోలిట్ బ్యూరో సంతాపం వ్యక్తం చేసింది.

ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు. ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.

ఖండనలు:
౼౼౼౼౼౼
టిడిపి నేతలపై అక్రమ కేసులకు ఖండన: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని పొలిట్ బ్యూరో ఖండించింది.

అచ్చెన్నాయుడుపై ఒకే అంశంపై 2స్టేషన్లలో కేసులు పెట్టడం, కరణం బలరామ్ పై, అయ్యన్నపాత్రుడిపై, సోమిరెడ్డిపై, ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు 14మందిపై అక్రమ కేసులు బనాయించడాన్ని ఖండించారు.

సోషల్ మీడియా కార్యకర్తలపై, టిడిపి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధించడాన్ని గర్హించారు.

ఒక కేసుపై అరెస్టు చేసి బెయిల్ వచ్చే లోగా, మరో తప్పుడు కేసు నమోదు చేసి, మళ్లీ అరెస్టులు చేస్తూ, పదేపదే రిమాండ్లకు పంపి తెలుగుదేశం పార్టీ నాయకులను వేధించడం రాజకీయ కక్ష సాధింపునకు పరాకాష్ట.

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఒక కేసులో బెయిల్ వచ్చిన రోజునే మరో కేసు పెట్టి, అరెస్టులు చేయడాన్ని ఖండించారు.

వర్ల రామయ్యకు నోటీసులు ఇస్తామని హెచ్చరించడం వైసిపి నిరంకుశత్వానికి పరాకాష్ట. ప్రజాస్వామ్యంలో హత్యా రాజకీయాలకు చోటులేదు.

పులివెందులలో ఒక పార్టీ ప్రధాన నాయకుడు ఇంట్లోనే ఎన్నికల ముందు చంపబడ్డారు.

7నెలలైనా ఎవరు చంపారో,ఎందుకు చంపారో తేల్చకపోవడం ఏమిటని ప్రశ్నిస్తే నోటీసులిస్తామని బెదిరిస్తారా..?

ముఖ్యమంత్రి సొంతజిల్లా,సొంత నియోజకవర్గంలో,సొంత బాబాయి హత్యకు గురైతే ఇంతవరకు దర్యాప్తులో పురోగతి లేకపోతే ఏమనాలి,ఎలా చూడాలి.?

అధికారులను పదేపదే మార్చి, కావాల్సినవాళ్లను నియమించుకుని, ప్రశ్నించిన వాళ్లను బెదిరిస్తే ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు..?

హత్యను గుండెపోటుగా చిత్రించి సాక్ష్యాలను తారుమారు చేయాలని చూసినవాళ్లు, గుండెపోటుగా ప్రసారం చేసిన వాళ్లకు, కథనాలు రాసిన వాళ్లకు, కేసు పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినవాళ్లకు, ఇవ్వని నోటీసులు వర్ల రామయ్యకు ఇస్తామనడం ఏమిటి..?

యురేనియం తవ్వకాలకు ఖండన:
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
కర్నూలు, కడపలో యురేనియం తవ్వకాలను టిడిపి పోలిట్ బ్యూరో ఖండించింది.

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజాందోళనలకు మద్దతుగా నిలబడ్డందుకే భూమా అఖిల ప్రియ కుటుంబంపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది.

కడపలో యురేనియం తవ్వకాలతో అక్కడి ప్రజల కష్టాలు వర్ణనాతీతం.

ఇప్పుడు కర్నూలు జిల్లాలో తవ్వకాలపై ప్రజల్లో భయాందోళనలు వున్నాయి. ఆళ్లగడ్డలో తవ్వకాలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలతో కలిసి అఖిల ప్రియ పోరాడుతున్నారు.

ఆమెపై కక్ష సాధింపులో భాగంగానే భర్త భార్గవరామ్ పై అక్రమ కేసులు బనాయించారు. ప్రజల కోసం పోరాడుతున్న అఖిల ప్రియ భర్తపై అక్రమ కేసులు పెట్టి వేధించడాన్ని ఖండిస్తున్నాం.

ప్రతిపక్షంలో ఉండగ యురేనియం తవ్వకాలపై అప్పటి సీఎం చంద్రబాబును విమర్శిస్తూ ఆర్టికల్స్ రాసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రికాగానే సొంతజిల్లాలోని తుమ్మలపల్లిలో యురేనియం తవ్వకాలను ప్రారంభించారు.

ఇప్పుడు కొడుకు జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లాలో యురేనియం తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు.

ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా వైసిపి ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం, పోరాడే టిడిపి నేతలపై అక్రమ కేసులు పెట్టడం గర్హనీయం

. ప్రజాభీష్టానికి అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరించాలి. కర్నూలు లో యురేనియం తవ్వకాలను ఆపేసి, ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి.

మీడియాపై ఆంక్షలు అప్రజాస్వామికం:
2007ఫిబ్రవరి 23న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన జీవో 938ప్రామాణికంగా ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు విధించడాన్ని ఖండిస్తున్నాం.

అసెంబ్లీలో ఆ రోజున రాజశేఖర రెడ్డి చేసిన ప్రసంగాన్ని చదివి వినిపించారు. ‘‘ గవర్నమెంట్ జీవోలు డిఫరెంట్ లెవెల్స్ లో ఇష్యూ అవుతాయి.

కొన్ని సెక్రటరీ లెవెల్లో ఇష్యూ అవుతాయి, కొన్ని, ఛీఫ్ సెక్రటరీ లెవెల్లో, చాలా ఆర్డర్లు ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అని ఇస్తారు. కానీ ఇస్యూ చేసేది అసిస్టెంట్ సెక్రటరీయే ఉంటాడు.

ఆ విధంగా ఈ పర్టిక్యులర్ జీవో(938) కొంత ఇబ్బందికరంగా ఉందని నా దృష్టికి వచ్చింది నిన్న సాయంత్రం సుమారుగా 8గం లేదా 9గం లకు.. వచ్చిన వెన్వెంటనే ఈ జీవోను విత్ డ్రా చేయడమో, క్యాన్సిల్ చేయడమో చేశాము. వుయ్ ఆర్ గెట్టింగ్ ఇట్ ఎంక్వైర్డ్.. ఏ విధంగా ఈ జీవో ఇస్యూ అయ్యింది, ఎందుకు ఇస్యూ అయ్యింది, వాటీజ్ ద బ్యాక్ గ్రవుండ్, మంచేమిటి, చెడ్డేమిటి అనే అంశం ఆ జీవోలో మొట్టమొదటే ఏదో నా దగ్గర సమ్ మీడియా రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు వచ్చింది.

మీడియా వాచ్ జరిగిందని టెక్స్ట్ లో ఉంది, నాకు గుర్తుండి గడిచిన నాలుగైదు మాసాల్లో ఎప్పుడూ జరగలేదు మీడియా వాచ్ కూడా.. కాబట్టి వుయ్ ఆర్ గెట్టింగ్ ఇట్ ఎంక్వైర్డ్ ఇన్ టూ..విచారణ చేసి మంచిచెడ్డలు చూసి పూర్వాపరాలు చూసి వాటెవర్ ఈజ్ టు బి డన్, వుయ్ విల్ డూ..ఊరికే లేని ఇష్యూను చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు..? వాటెవర్ జీవో హాజ్ కమ్ అది కొంత ఇబ్బందికరంగా ఉందని మా దృష్టికి వస్తూనే విత్ డ్రా చేయించాం..వాట్స్ ఎల్స్ ఎనీ వన్ కెన్ డూ..’’ అని ఆ రోజు రాజశేఖర రెడ్డి అసెంబ్లీ సాక్షిగా విత్ డ్రా చేసుకున్నారు.

కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం జగమొండిగా మారి అదే జీవోను ఇంకో రూపంలో ఇప్పుడు అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో మీడియా గొంతు నొక్కాలని చూడటం నిరంకుశ ధోరణికి నిదర్శనం.

ప్రశ్నించే వాళ్లను అణిచేయడం నిరంకుశత్వం, ప్రజాస్వామ్యానికే ప్రమాదం.

నాలుగున్నర నెలల్లోనే(140రోజుల్లోనే) రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేశారు: రాష్ట్రంలో ఎక్కడా పనులు జరగడం లేదు.

అభివృద్ది పనులన్నీ నిలిపేశారు. ఆర్ అండ్ బి, ఇరిగేషన్, హవుసింగ్, నరేగా అన్ని పనులు నిలిపేశారు.

జీవోలు ఇచ్చి మరీ పనులు ఆపేయడం దేశ చరిత్రలో ఎక్కడా చూడలేదు. నరేగా నిధులు రూ.2,400కోట్లు దారిమళ్లించారు.

గత ఏడాది నరేగా కింద రూ.9,400కోట్లు నరేగా పనులు చేశాం, ఈ ఏడాది రూ.11వేల కోట్ల పనులు గ్రామాల్లో చేయాల్సివుండగా మొత్తం స్కీమ్ నే నీరుగార్చారు.

నరేగా నిధులే కేంద్రం నుంచి తెచ్చుకోలేక పోతే ఇక అభివృద్ది పనులకు నిధులు ఎక్కడివి..? సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాలకు మాత్రం నరేగా నిధులు ఇచ్చి మొత్తం రాష్ట్రం అంతా నిలిపేయడాన్ని ఏమనాలి..? కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా నిలిపేసి, బినామీ 3కంపెనీలకే రూ.2వేల కోట్ల నిధులు ఇచ్చారు.

-గత ప్రభుత్వం వల్లే ఆర్ధికంగా రాష్ట్రం దెబ్బతిందని వైసిపి నేతలు పేర్కొనడం హాస్యాస్పదం.

స్వాతంత్ర్యం వచ్చాక 11% వృద్ది వచ్చింది ఒక్క ఏపిలోనే, అదీ టిడిపి హయాంలోనే. గత ఏడాదికన్నా (తొలి క్వార్టర్ లో) ఆదాయం 17% ఇప్పుడు తగ్గింది.

సీఎం జగన్ పెడ విధానాల వల్లే వృద్ది తిరోగమనంలో(రివర్స్ డెవలప్ మెంట్) ఉంది.

వచ్చే ఏడాది మరింత దిగజారనుంది.

పట్టణీకరణ స్వల్పంగా ఉన్న ఏపిలో, నగరాభివృద్దికి టిడిపి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది.

టిడిపి ప్రభుత్వ అభివృద్ది ఫలితంగానే హైదరాబాద్ నుంచి వచ్చే 60%-70% ఆదాయం వల్లే తెలంగాణ సంపన్న రాష్టం అయ్యింది. అమరావతిని బంగారు బాతులా పెంచి పోషించి అప్పగిస్తే, దానిని చంపేశారు. రూ.లక్ష కోట్ల సంపద సృష్టించి ఇస్తే మట్టిలో కలిపేశారు.

ఆదాయం పెంచి ఉపాధి కల్పించాలి, సంపద సృష్టించి సంక్షేమం చేయాలి.
అలాంటిది ఇసుక కొరత సృష్టించి, ఆదాయాలను దెబ్బతీసి,ఉపాధి పోగొట్టి, ఆర్ధికవ్యవస్థ కుప్పకూల్చారు.

అరాచకాన్ని సృష్టిస్తున్నారు. విద్యుత్ కోతలు మళ్లీ తెచ్చి, పరిశ్రమలను దెబ్బకొట్టారు, పెట్టుబడిదారులను బెదిరించి వెనక్కిపంపారు.

రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతనే ప్రశ్నార్ధకం చేశారనడానికి స్టేట్ బ్యాంకు లేఖే నిదర్శనం. అప్పు ఇస్తే ఏవిధంగా తీరుస్తారని బ్యాంకులు లేఖలు రాయడం చరిత్రలో జరిగిందా..? గత 5నెలల్లో రాష్ట్ర రాబడి పెంపుపై సీఎంగా ఒక్క భేటి జగన్మోహన్ రెడ్డి పెట్టారా..?