DailyDose

22న దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె-వాణిజ్యం-10/20

Indian Bank Employees Call For Nationwide Strike On 22nd

* బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా ఈనెల 22న దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఆల్‌ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌(ఏఐబీఈఏ), బ్యాంకు ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(బీఈఎఫ్‌ఐ) సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు వారు ఇండియన్‌ బ్యాంకు అసోసియేషన్‌(ఐబీఏ)కు నోటీసు అందజేశారు. విలీనం ద్వారా అనేక మంది ఉద్యోగాలు, పదోన్నతులు కోల్పోయే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎగవేతదారుల నుంచి రుణాలు వసూలు చేస్తే బ్యాంకింగ్‌ కష్టాలు తీరతాయని.. దానికి విలీనం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సంస్కరణల పేరిట సామాన్య వినియోగదారులపై అధిక సర్వీస్‌ ఛార్జీలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నోటీసులో మొత్తం ఆరు అంశాలను పేర్కొంటూ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.

* ఆర్టీసీ సమ్మె కారణంగా మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగిందని మెట్రో రైలు ఎండీ ఎన్వీస్‌ రెడ్డి తెలిపారు. సాధారణ రోజుల్లో 3 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తుండగా.. సమ్మె కారణంగా మరో 50 వేల మంది అదనంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం మియాపూర్‌ మెట్రో స్టేషన్‌లో రద్దీని ఆయన పరిశీలించారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌ మెట్రో నిర్మాణం జరిగిందని, అందుకే ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 16వ రోజుకు చేరిన విషయం తెలిసిందే.

* నమోదిత కంపెనీల నుంచి ఆడిటర్లు రాజీనామా చేసి వైదొలడాన్ని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డు (సెబీ) మరింత కఠినతరం చేసింది. ఆడిటర్లు ఏ త్రైమాసికంలో రాజీనామా చేస్తున్నారో ఆ త్రైమాసికానికి సంబంధించి పూర్తి ఆడిట్‌ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ ఏడాదిలో చివరి త్రైమాసికం తప్ప మిగిలిన వాటికి సదరు ఆడిటర్‌ సంతకం చేసినట్లైతే వారే వార్షిక నివేదికను కూడా ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆడిటర్‌ రాజీనామాకు కారణాలను సమగ్రంగా వెల్లడించాలి.

* ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం చివరినాటికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 27 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు తమ నికర లాభం రూ.6,345 కోట్లకు చేరిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు శనివారం ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికం ముగింపు నాటికి నికర లాభం రూ.5,005 కోట్లుగా ఉంది. డిపాజిట్లపై బ్యాంకు చెల్లించిన వడ్డీలు పోనూ రుణాలపై అర్జించిన నికర వడ్డీలు 15 శాతం పెరిగి రూ.13,515 కోట్లకు చేరాయని వెల్లడించింది. గతేడాది ఈ సమయానికి నికరంగా అర్జించిన వడ్డీలు రూ.11,763 కోట్లుగా పేర్కొంది.