Fashion

చొక్కా గుండీలకు ఒక చరిత్ర ఉంది

The history of buttons-Telugu fashion news

‘ఒక్కసారి నేను లేకుండా మీరు వేసుకున్న షర్టునో, స్యూట్‌నో, ఫ్రాక్‌నో ఊహించుకోండి..! కష్టంగా ఉంది కదూ..! నేను మీ జీవితంలో మీతో అంతగా భాగమైపోయాను మరి. మీరు వేసుకునే షర్టు, కోటు మీ ఒంటికి అత్తుకుని ఉండాలన్నా… మీరు హుందాగా కనపడాలన్నా నేను ఉంటేనే అది సాధ్యం.’ అని పోజు కొడుతోంది బటన్‌. చక్రం, సూదిలా మన జీవితాల్నే మార్చేసిన ఇన్వెన్షన్‌ గుండీ అంటారు చరిత్రకారులు. మరి, దాని గురించి అదే మనకెన్నో సంగతులు చెబుతానని ముందుకొచ్చింది.నేను చూసేందుకు ఎంతో చిన్నగా ఉన్నా… నా వల్ల మీరు ఎంతో సౌకర్యవంతంగా ఉంటారు. మీరు వేసుకున్న షర్టుకి నన్ను కుట్టడం ఎంతో తేలిక. నన్ను గుండీ, బొత్తా, బటన్‌ అని ఒక్కో చోట ఒక్కోలాగ ప్రేమగా పిలుస్తారు తెలుసా..! నా చరిత్ర ఈ నాటిది కాదు. అత్యవసరం నుంచి ఆభరణంగానూ తయారయ్యాను. ఎన్నో విధాలుగా మారి ఎన్నో దెబ్బల్ని తట్టుకుని నేటికీ నిలబడే ఉన్నాను.
**ఎప్పుడో పుట్టాను
ఐదువేల ఏళ్ల క్రితం అంటే… సింధూ నాగరికత కాలం నాటి నా పూర్వీకుల్ని తవ్వకాల్లో వెలికితీశారు ఆ మధ్య. అంతకుముందు నుంచే నా ఉనికి ఉందని ఒప్పుకుంటారు. నా తయారీనే మనిషి.. అంటే మీరు మరింత ముందడుగు వేయడానికో కారణంగాను చెబుతారు. అంతేకదా మరి. బట్టలు, ఆహారం, వస్తువులు ఇలా ప్రతిదాన్ని కట్టి పట్టి ఉంచడానికి వీలు కల్పించలేదా! ప్రారంభంలో నన్ను సముద్రంలో దొరికే గవ్వలతో రకరకాల ఆకారాలతో చెక్కి తయారు చేసేవారు కూడానట. అంతేకాదు, నన్ను ఎందరో మెడకూ, చేతులకూ, కాళ్లకూ, నుదుటిపైనా అలంకరణగా, ఆభరణంగానూ వాడేవారు. తర్వాత కొన్ని వందల ఏళ్లు నన్ను ఆభరణంగా వాడినా… తర్వాత నా సైజుని ఫిక్స్‌ చేసి అనుకూలంగా మార్చడానికి జర్మనీకి చెందిన ఎందరో మేధావులు ఎంతగానో శ్రమపడ్డారు. ఆ తర్వాత నన్ను 1515-1547 ఒకటో ఫ్రెంచి రాజు సామాజిక హోదాకు, సంపదకు చిహ్నంగా నిలబెట్టారు. ఆ సమయంలో కొన్ని వేల బంగారు బటన్లను తయారు చేసి, వాటిపై చిహ్నాలను ముద్రించి నన్ను అందంగా కోటుకు పొదిగారు. అలా నాకు ఓ ప్రత్యేక స్థానాన్ని కలిగించారు.
**ఇలా మారాను..
అప్పటివరకూ ముద్రలతోనే ఉన్న నన్ను… మధ్య యూరప్‌లో లేసులతో కలిపి నన్ను రకరకాలుగా అందంగా బట్టలపై అలంకరించేవారు. అప్పటి వరకూ అనేక రకాలుగా ఉన్న నాకు పర్షియన్లు సన్నగా రెండు రంధ్రాల్ని ఏర్పాటుచేసి తుది రూపమిచ్చారట..! ఆ తర్వాత నన్ను 13, 14వ శతాబ్దంలో ఐరోపా, అంతటా విస్తారంగా అన్నిచోట్లకూ పంపారు. అలా పెట్టిన రంధ్రాలతో ఉన్న నన్ను మొట్టమొదటిసారి 13వ శతాబ్దంలో జర్మనీలో ఒక బట్టల షాపులో గుర్తించారు. అలా జర్మనీలో కనపడ్డ నాకు మరింత ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ఆనాటి నుంచీ నన్ను షర్టులకూ, కోటులకూ కలిపి కుట్టడం ప్రారంభమైంది. ఆ తర్వాత నన్ను కొన్ని చిన్నవిగా, కొన్ని మధ్యస్థంగా, మరికొన్ని పెద్దవిగా అందులో కొన్ని అరుదైనవిగా తయారు చేశారు. వాటిని షర్టులకూ, సూట్స్‌కూ రకరకాలుగా 17వ శతాబ్దం వరకూ హుందాగానే ఉపయోగించారు.
**ఇన్ని రకాలుగా..
18వ శతాబ్దం మధ్య కాలం నుంచీ నన్ను మహిళల దుస్తులకూ, చిన్నారుల బుజ్జి బుజ్జి గౌనులకూ వాడటం మొదలు పెట్టారు. అంతే, ఆనాటి నుంచీ నేను మరింత విస్తారంగా దేశ దేశాలు తిరిగాను. నన్ను ఫ్లాట్‌ బటన్‌గా, షంక్‌ బటన్‌గా, స్టడ్‌ బటన్స్‌గా తయారు చేయడమే కాకుండా రంధ్రాలు రెండు, మూడు, నాలుగు, ఆరు పెట్టి మరింత కొత్తగా నన్ను తీర్చిదిద్దారు. నన్ను రోజువారీ ఉపయోగం నుంచీ పార్టీవేర్‌ వరకూ రకరకాల రంగులతో, ఆకారాలతో, బొమ్మలతో ఆకర్షణీయంగా నిలిచేలా చేశారు. 19వ శతాబ్దం నాటికి ప్రపంచవ్యాప్తంగా చిన్నారుల గౌనులపై వెలిసి వారి చిరునవ్వుకు కారణంగానూ నిలిచాను. అలా నా తయారీ నేడు ప్రపంచంలోనే 60 శాతంగా పెరిగాను. మీకు తెలుసా..! నన్ను ఎక్కువగా చైనీయులు తయారుచేసి దేశ నలుమూలలకూ పంపుతున్నారని.
**నాది ప్రత్యేక స్థానం…
మొదట్లో నన్ను గవ్వలతో తయారు చేసి ఆభరణాలుగా వాడారు. తర్వాత నా పై ముద్రలు వేసి ఎందరో రాజులు నన్ను హుందాగా వాడి నాకో స్థానాన్ని కల్పించారు. నన్ను రకరకాల లోహాలతో మెరుగులు దిద్దారు. 1920 నుంచీ సింథటిక్‌ ప్లాస్టిక్‌తో, గాజుతో, చెక్కతో, కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఇన్ని రకాలుగా తయారు చేసిన నన్ను పదిలంగా చూసుకునేందుకు లండన్‌లో ‘విక్టోరియా అండ్‌ అల్బర్ట్‌’ పేరుతో ఓ మ్యూజియంను ఏర్పాటు చేసి ఓ ప్రత్యేక స్థానాన్ని అందించారు. నా చరిత్రను నలుగురికీ తెలిసేలా చేశారు. ప్రపంచంలో ప్రారంభం నుంచీ ప్రాచుర్యం పొందిన బటన్స్‌ను కలెక్ట్‌ చేసి ఆ మ్యూజియంలో ఉంచారు. నన్ను చూసేందుకు, నా గురించి తెలుసుకునేందుకు చిన్నారుల నుంచీ పెద్దల వరకూ అక్కడకు వస్తుంటారు.
**క్రాఫ్ట్స్‌కు కూడా…
నన్ను ఇప్పుడు బట్టలకు కుట్టడానికే కాకుండా క్రాఫ్ట్స్‌లను తయారు చేసేందుకు ఒక ముఖ్యమైన వస్తువుగా వాడుతున్నారు. నన్ను ఉపయోగించి సృజనను పెంచేందుకు వాడుతున్నారు. నాతో అందమైన వాల్‌ పీసెస్‌లాగా, ఫ్లవర్‌ పాట్స్‌లాగా, పిల్లల కథల్లో కుందేలు తాబేళ్లలాగా, ఆకాశంలో మెరిసే నక్షత్రాలుగా ఇలా కొమ్మకూ, రెమ్మకూ నన్నే అంటిస్తున్నారు. నన్ను ఇప్పుడు పర్యావరణహిత కొబ్బరి పెంకుతోనూ తయారు చేయడం ప్రారంభించారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 1న ఛత్తీస్‌గఢ్‌లో అంతర్జాతీయ ‘సూరజ్‌కుంద్‌ క్రాఫ్ట్‌మేళా’ నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ఉన్న హస్తకళలు, చేనేత వస్త్రాలు, సాంస్కృతిక వారసత్వపు గొప్పతనాన్ని వైవిధ్యాన్ని వారం రోజులపాటు నిర్వహించే ఈ మేళాలో నాకూ ఓ స్థానం కల్పించారు. ఈ మేళాలో కొబ్బరి పెంకును ఉపయోగించి తయారుచేసిన బటన్‌ కాఫ్ట్స్ర్‌కు ప్రాధాన్యతనిచ్చారు. కొబ్బరి పెంకుతో తయారు చేసిన ఎకో బటన్‌ ల్యాంప్స్‌, ఫొటో ఫ్రేమ్స్‌, ప్లక్కర్స్‌, బ్రాస్‌లెట్స్‌ వంటివి ఆకర్షణీయంగా ప్రదర్శనకు పెడుతుంటారు. ఇలా సాంస్కృతిక వస్తువుల్లో నన్ను భాగస్వామిని చేసి నన్ను వైవిధ్యంగా చూపుతున్నారు.
**నేను ఆత్మీయుణ్ని..
మీకు తెలుసా..! ప్రపంచ యుద్ధ సమయంలో, బ్రిటీష్‌, యు.ఎస్‌. మిలిటరీ వారు నన్ను ఆత్మీయులకు గుర్తుగా లాకెట్‌గా ఉపయోగించేవారని.
నా సైజును నిర్ణయించడానికి అమెరికా వారు ‘నేషనల్‌ బటన్‌ సొసైటీ’ని ఏర్పాటు చేశారు.నా సైజును కొలిచేందుకు ఒక పద్ధతిని ఫ్రెంచివారు తీసుకొచ్చారు. దానిని వారి భాషలో ‘లైన్‌’ అని పిలుస్తారట..! అంతేకాదు, 40 లైన్స్‌ని కలిపితే ఒక అంగుళానికి సమానమట.నా వల్ల అరుదైన భయం కూడా ఒకటి ఉందని తెలుసుకుని నేనూ భయపడ్డాను. ఆ భయాన్ని ‘కౌంఫోనోఫోబియా’ అంటారట..! 75 వేలమందిలో ఒకరికి ఉంటుంది.ఒక్క భయపెట్టే విషయాన్ని పక్కన పెడితే… నేను మీకు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్న సంగతి మీతో ఇలా పంచుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.