Editorials

తపాలా శాఖ ఉత్తరాల పోటీ

Indian Postal Service Starts Letter Writing Competition

భావి తరాలను దృష్టిలో ఉంచుకొని, భారతీయ తపాల సంస్థ ఉత్తరాలపై నేటి తరానికి అవగాహన కల్పించడానికి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించింది. దీంట్లో భాగంగానే మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో ఉత్తరాల పోటీలను నిర్వహిస్తున్నది. తపాలా శాఖ నిర్వహిస్తున్న ఉత్తరాల పోటీల్లో జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించిన వారికి రూ.50 వేలు, ద్వితీయ బహుమతికి రూ.25 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి రూ.10 వేలు బహుమతులుగా అందజేయనున్నారు. రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతికి 25 వేల రూపాయలు, ద్వితీయ బహుమతికి 10 వేల రూపాయలు, తృతీయ బహుమతికి 5వేల రూపాయలు అందజేయనున్నారు. ఉత్తరాల పోటీల్లో విజేతల వివరాలను రాష్ట్ర స్థాయిలో వచ్చే జనవరి 31న, జాతీయ స్థాయిలో మార్చి 31న విడుదల చేయనున్నారు.

*** పోటీకి అర్హతలు..
ఈ పోటీలను రెండు విభాగాల్లో నిర్వహిస్తున్నారు. 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఒక విభాగంలో, 18 సంవత్సరాలు వయస్సు దాటిన వారికి మరో విభాగంగా విభజించారు. ఉత్తరం రాసేవారు స్వదస్తూరితో ఉత్తరం రాయడంతో పాటు, తప్పకుండా తమ వయస్సు వివరాలను పొందుపర్చాలి. ఉత్తరాల పోటీల్లో పాల్గొన్న వారి వయస్సు నిర్ధారణ ఆధారంగా విభజించి ఉత్తరాలను పరిశీలిస్తారు. ఉత్తరంపై శిర్షీకను రాసేటప్పుడు ఇన్‌ల్యాండ్ లెటర్‌పై 500 పదాలకు మించకుండా, ఏ4 సైజ్ పేపర్ అయితే వెయ్యి పదాలకు మించకుండా ఉత్తరం రాసి ఎన్వలప్ కవర్‌లో పోస్ట్ చేసి పూర్తి వివరాలకు జిల్లా కేంద్రంలోని తపాలా కార్యాలయాలను సంప్రదించాలి.

*** ఈ నెల 30 వరకు గడువు..
తపాలా శాఖ నిర్వహిస్తున్న ఉత్తరాల పోటీల్లో పాల్గొనే వారు ఉత్తరాలను పోస్టులో పంపడానికి ఈ నెల 30 వరకు గడువు విధించారు. ఈ పోటీలో పాల్గొనే వారు జాతిపిత గాంధీజీ గురించి ఉత్తరాలు రాయాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పోటీల్లో పాల్గొనేవారు ఆయా ప్రాతీయ భాషల్లో ఉత్తరాలను రాయవచ్చు. దీంతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో సైతం ఉత్తరాలు రాయవచ్చు. రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచిన వారిని జాతీయ స్థాయికి పంపిస్తారు.

*** పోస్టు చేయాల్సిన చిరునామా…
చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్,
తెలంగాణ సర్కిల్, అబిడ్స్, హైదరాబాద్