Kids

మతిమరుపు-తెలుగు చిన్నారుల కథ

Amnesia-Telugu Kids News And Special Moral Stories Dec 2019

రామాపురంలో నలుగురు గొర్రెల కాపరులు ఉండేవాళ్లు. వాళ్లు నలుగురూ మంచి స్నేహితులు. చదువుకోలేదు గాని, చాలా ఆత్మాభిమానం కలవాళ్ళు- ‘మేం బాగా తెలివైనవాళ్లం’ అనుకుంటూ ఉంటారెప్పుడూ. అయితే వాళ్లకు ఒక్కటే సమస్య- మతిమరుపు! ఏ చిన్న విషయాన్నైనా వెంటనే మర్చిపోయేవాళ్లు.తమ మతిమరుపును పోగొట్టుకోవటం గురించి వాళ్ళు చాలా తీవ్రంగా ఆలోచించారు. మర్చిపోయింది తిరిగి గుర్తుకొచ్చేంతవరకూ దాన్ని గురించే ఆలోచించాలనేది వాళ్ల సిద్ధాంతం.ఒక సంవత్సరం రామాపురంలో చక్కని వర్షాలు పడి, పంటలు అద్భుతంగా పండాయి. ఊరి పెద్దలంతా ఇంటికి నూరు రూపాయలచొప్పున వసూలు చేసి, అమ్మవారికి జాతర చేద్దామనుకున్నారు. జాతర ఘనంగా జరిగింది. అందరికీ వనభోజనాలు పెట్టించారు. పప్పు, అన్నం, పాయసం- వంటకాలన్నీ మహా రుచికరంగా తయారయ్యాయి. మన గొర్రెల కాపరులు నలుగురూ హీరోలలాగా తయారై, “వన భోజనాలు అద్భుతంగా ఉన్నాయట, మేము కూడా తిని వద్దామని బయలుదేరాము” అని చెప్పుకుంటూ వెళ్లారు.వంటల్లోకెల్లా పాయసం చాలా బాగున్నది. అయితే వీళ్లెవ్వరూ పాయసాన్ని అంతకు ముందెన్నడూ తిని ఉండలేదు. పక్కనే కూర్చున్న ఒక పెద్దాయన్ని “దీని పేరేంటి? ఏమంటారు, దీన్ని?” అని అడిగారు. ఆ ప్రాంతంలో వాళ్ళు పాయసాన్ని “ఖీరు” అంటారు. పల్లెటూరు పెద్దాయనకు నోరు సరిగ్గా తిరక్క, “కీరు” అని చెప్పాడు. “కీరు చాలా బాగుంది. కీరు చాలా బాగుంది. దీని పేరు ఇక మనం మర్చిపోకూడదు” అనుకుంటూ నలుగురూ ఇంటికెళ్లి, బట్టలు మార్చుకొని, గొర్రెలు మేపేందుకు బయలుదేరి పోయారు.ఊరికి చివరగా ఒక వాగు ఉన్నది. వీళ్లు గొర్రెలు మేపాలంటే ఆ వాగును దాటుకొని వెళ్లాలి. నలుగురూ వాగును దాటుతుండగా వాళ్ళలో ఒకడికి తాము అంతకు ముందు తిన్న వంటకం గుర్తుకు వచ్చింది. “అదేంటిరా, మనం తిన్నది? తియ్యగా ఉన్నది; మనందరికీ నచ్చింది, ఏంటది?” అని తోటివారిని అడిగాడు వాడు. ఇక అందరూ ఎంత తన్నుకులాడినా, వాళ్లలో ఎవ్వరికీ దాని పేరు మాత్రం గుర్తుకు రాలేదు. నలుగురూ నాలుగువిధాల జుట్టు పీక్కుని ఆలోచిస్తున్నారు; అయినా పేరు స్పష్టం కాలేదు.వాళ్లలో ఒకడికి అనిపించింది- “మనం ఈ వాగు నీళ్ళలోనే కదా, పేరును మర్చిపోయింది? కనుక, ఇప్పుడు ఈ నీళ్ళన్నిటినీ తోడి బయటికి పోస్తూ , ఇక్కడే ఉంటే, కొంచెం సేపటికి మనకు ఆ వంటకం పేరు గుర్తుకొస్తుంది” అని. ఇక నలుగురు మూర్ఖులూ వంకలోని నీళ్లను ఎత్తి బయట పోయటం మొదలుపెట్టారు. వీళ్ల పని మూలంగా ఆ ప్రాంతమంతా చిత్తడి చిత్తడిగా తయారైంది.ఇక సాయంత్రం కావస్తుందనగా, అ దారిన ఒక ముసలాయన నడచి పోతూ, వీళ్లు చేస్తున్న పనిని చూసి, “ఏమిరా, ఏం చేస్తున్నారు?” అని అడిగాడు వీళ్లని. “ఏదో పోయిందిలే, తాతా! వెతుకుతున్నాం” అన్నాడొక గొర్రెల కాపరి, తెలివిగా. “నేనూ వెతికి పెట్టేవాడిని, కానీ ఇక్కడంతా ‘కీదరు కీదరు’ గా ఉంది గదా, జారి పడతానేమోనని భయంగా ఉంది” అన్నాడు తాత.’కీదరు” అన్నమాట వినగానే గొర్రెలవాళ్లకు “కీరు” గుర్తుకొచ్చింది వెంటనే. నలుగురూ సంతోషంగా అరిచారు “దొరికిపోయింది!” అని. “ఏంటి దొరికింది?” అని తాత అడిగాడు. “కీరు! కీరు!!” అన్నారు నలుగురూ. “వీళ్లేదో వెర్రివాళ్ళలాగున్నారు. లేకపోతే ‘కీరేంటి, వీళ్లకది నీళ్లలో దొరకటమేంటి?’ ” అనుకొని, తాత వీలైనంత త్వరగా వాళ్లని వదిలిపెట్టి పోయాడు.”వాగులోంచి నీళ్లను తోడిపోస్తే పేరు గుర్తొస్తుందనుకున్నాం కదా, మనం? అట్లాగే జరిగింది చూడండి!” అని గొర్రెలవాళ్ళు అమాయకంగా సంతోషపడ్డారు. “అందుకనే, ఏదైనా గుర్తుకు రాకపోతే వదిలిపెట్టకుండా ఆలోచించాలిరా!” అని చెప్పుకుంటూ నలుగురూ గొర్రెల్ని తోలుకొని ఇంటిదారి పట్టారు.