Devotional

టిటిడీలో కనిపించని నగదు లావాదేవీలు

TTD Sees High Rise Of Online Transactions And No Liquid Cash

తిరుమల, తిరుపతి దేవస్థానం వద్ద నగదు తరిగిపోతోంది. వడ్డీకాసులవాడి క్షేత్రంలో కాసుల గలగలలు తగ్గాయి. కుబేరుడి అప్పుతీర్చేందుకు తిరుమలేశుడికి భక్తులిచ్చే ధనరాశులు తగ్గిపోతున్నాయి. అలాగని శ్రీనివాసుడి సంపద తగ్గుతోందనుకుంటున్నారా.. అబ్బే అదేమీ లేదు. స్వామివారి బ్యాంకు ఖాతాలు కళకళలాడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం వచ్చే ధార్మికసంస్థగా పేరుగాంచిన తితిదేకు హుండీ కానుకలు, విరాళాలు, ఇతర సేవల రూపేణా నిత్యం సగటున రూ.7-8 కోట్ల ఆదాయం ఆర్జిస్తున్నా.. ఈమధ్య నగదు కనిపించడం లేదు. కారణం.. దేవస్థానం అందిపుచ్చుకున్న సాంకేతికత! ఇప్పుడు తితిదేలో చాలా లావాదేవీలు నగదురహితమే! ఏ కౌంటర్‌ వద్దా కరెన్సీనోట్లతో పనిలేదు. అంతా స్వైపింగ్‌.. ఫోన్‌పే.. గూగుల్‌ పే.. ఆన్‌లైన్‌లో సొమ్ము బదిలీలే!!
**తితిదే ఆర్థిక కార్యకలాపాలన్నీ నగదురహితంగా చేపడుతూ.. కరెన్సీనోటుకు స్వస్తి పలుకుతోంది. భక్తులు, వ్యాపారులతో జరిపే లావాదేవీల్లోనూ ఆన్‌లైన్‌ పద్ధతే అవలంబిస్తోంది. శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్‌ దర్శనం, ప్రత్యేకదర్శనం, వసతి గదులకు భక్తులు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించేలా అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఈ సేవలను ముందస్తుగా బుక్‌ చేసుకునేలా తితిదే వెబ్‌సైట్‌ను ఆధునికీకరించడంతో పాటు గోవింద యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో 3నెలల ముందే భక్తులు అంతర్జాలంలో సొమ్ము పంపుతున్నారు. ఆర్జితసేవల టిక్కెట్లను ప్రతినెలా మొదటి శుక్రవారం విడుదల చేస్తుంది. నాలుగు రోజుల పాటు బుకింగ్‌కు గడువిచ్చి.. తర్వాతి మంగళవారం లక్కీ డ్రా తీస్తుంది. ఎంపికైన భక్తులు వెంçనే ఆన్‌లైన్‌లో తితిదే ఖాతాకు డబ్బు బదిలీచేసి.. టిక్కెట్‌ ఖరారు చేసుకోవాలి.
**అంతటా స్వైపింగ్‌ యంత్రాలే
తితిదేకు చెందిన అన్ని కౌంటర్లలో స్వైపింగ్‌యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో 7వేల అద్దె గదులుండగా వాటిలో సుమారు మూడోవంతు గదులను ముందస్తుగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవచ్చు. మిగిలిన గదులను భక్తులకు కరెంట్‌ బుకింగ్‌ కింద అప్పటికప్పుడు ఇస్తారు.
* అద్దెగదుల కోసం పలుచోట్ల కౌంటర్లున్నాయి. 2019 జనవరి నుంచి అక్టోబరు వరకు లెక్కలు చూస్తే.. వీఐపీల సిఫార్సు లేఖలపై గదులు కేటాయించే శ్రీపద్మావతి విచారణ కేంద్రం వద్ద 97%, ఎంబీసీ వద్ద 100% నగదు రహిత లావాదేవీలు సాగినట్లు తేలింది.
* సాధారణ భక్తులకు గదులు కేటాయించే టీబీ కౌంటర్‌లో 91%, సప్తగిరి విశ్రాంతిగృహాల వద్ద 62, సూరాపురంతోట, రాంభగీచా, సీఆర్వో జనరల్‌ కౌంటర్లలో 50% చెల్లింపులు నగదురహితంగా జరిగాయి.
* తితిదే వెబ్‌సైట్‌, గోవింద యాప్‌లో ‘ఈ-హుండీ’ ఆప్షన్‌ అందుబాటులోకి వచ్చాక భక్తులు విరాళాలనూ ఆన్‌లైన్‌లోనే తితిదే ఖాతాల్లో జమచేస్తున్నారు.
* తితిదే తన అధీనంలోని ట్రస్టులు, పథకాల నిర్వహణ కోసం దాతల ద్వారా సేకరించే విరాళాలను డీడీల రూపంలోనే స్వీకరిస్తుంది. సప్తగిరి మాసపత్రిక, డైరీలు, తితిదే ప్రచురణలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు.
* భక్తులు ప్రధానాలయంలోని హుండీలో వేసే నగదు, నగలు మినహా.. అంతటా నోటుకు ‘నో’ చెబుతోంది.
2. శ్రీశైలం నుంచి హిందూ ధర్మ ప్రచారయాత్ర ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా హిందూ ధర్మ ప్రచారయాత్ర చేపట్టినట్లు విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి చెప్పారు. మంగళవారం శ్రీశైలంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నాక విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి సమక్షంలో స్వాత్మానందేంద్ర సరస్వతి యాత్రను ప్రారంభించారు.
3. ఆదిదంపతులను దర్శించుకున్న పీఠాధిపతులు
హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేసిన అనంతరం శ్రీశైలం చేరుకున్న విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, స్వాత్మానందేంద్ర సరస్వతి మహాస్వాములు శ్రీశైల ఆదిదంపతులను దర్శించుకున్నారు. శ్రీశైల నియోజకవర్గ శాసనసభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి పీఠాధిపతులతో కలిసి ఆలయ ప్రధాన గోపురం వద్దకు చేరుకోగా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ డా.ఎం.పద్మ ఐఏఎస్, ఆలయ ఈవో కేఎస్ రామారావు వేదపండితులు ప్రధాన అర్చక స్వాములతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం పీఠాధిపతులకు వేదగోష్టి నిర్వహించారు. స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మ ప్రచారంతోపాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్న విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ధర్మప్రచారం చేస్తూ హోమ జప ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేసేందుకు తొలుతగా శ్రీశైల ఆదిదంపతుల ఆశీస్సులు పొంది కార్యక్రమాలు మొదలు పెడుతున్నట్లు తెలిపారు.
4. శ్రీవారి సేవలో జనసేనాని
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చిన ఆయనకు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభీక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
5. యదద్రిలో మరో అపచారం.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా అపచారాలు జరిగాయని రాయటం చాలా బాధ కలిగించింది అని యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు నల్లంథీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు పేర్కొన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వార్తలను ప్రచురించడం బాధాకరం. తప్పుడు కథనాలు రాయడం మంచిది కాదు. గర్భాలయంలో స్వామి వారి మూలవిరాట్‌కు ఎలాంటి అపచారం జరగలేదు. మూలవిరాట్‌ను చెక్కలేదు. ఏడాది క్రితమే మూలవిరాట్‌కు ఉన్న సింధూరాన్ని తొలగించాం. దీంతో స్వామి వారు దేదీప్యమానంగా కనబడుతున్నారు. 40 ఏళ్లుగా స్వామి వారికి కైంకర్యాలు చేస్తున్నాను. స్వామి వారికి ఎలాంటి కళంకం జరగలేదు. తిరుపతి, శ్రీశైలం ఆలయాల్లో కూడా స్వామి వార్ల మూలవిరాట్‌పై ఉన్న చందనాన్ని, సింధూరాన్ని అప్పుడప్పుడు శుభ్రం చేస్తారు. ఇది సర్వసాధారణమైన విషయం అని నరసింహాచార్యులు స్పష్టం చేశారు.