Kids

తెలివైన జాలరి-తెలుగు చిన్నారుల కథ

A clever smart fisherman-Telugu kids interesting moral funny stories

జాలరివాడి తెలివి!

బంగాళాఖాతపు ఒడ్డున ఒక పల్లె ఉండేది. ఆ పల్లెలో జాలరివాడొకడు నివసిస్తుండేవాడు. రోజూ పడవ కట్టుకొని సముద్రంలోకెళ్లి, చేపలు పట్టుకొని తెచ్చి, వాటిని అమ్మి , ఆ వచ్చిన డబ్బుతో అతను జీవనం సాగించేవాడు.
ఒకరోజున ఆ జాలరివాడు సముద్రంలోకి వల విసిరాడు. కొంత సేపటికి మామూలుగానే వల బరువెక్కింది. ఎంత లాగినా బయటికి రాలేదు. “ఏంటబ్బా! ఆశ్చర్యం, ఎంత పీకినా రావట్లేదు? ఓహో! చాలా పెద్ద చేపలేమైనా పడ్డాయేమో!” అనుకొని, అతను సంతోషపడి, చాలా శ్రమతో వలను పైకి లాగాడు. తీరా చూస్తే వలనిండా గులకరాళ్ళు! “అయ్యో! నా శ్రమంతా వృధా అయ్యిందే! వీటిని ఏం చేసుకునేది?” అని అతను ఆ రాళ్లను పక్కకు విసిరేశాడు.

ఆ తరువాత ఇంకోసారి వలను విసిరాడు. ఈసారి కూడా వల బరువెక్కింది. “అయ్యో! మళ్ళీ గులకరాళ్ళే పడ్డట్లున్నాయే! వీటి బరువుకు నా వల తెగిపోతే నేనేం చేసేది?” అని బాధపడి, అతను మళ్ళీ బలంగా వలను బయటికి లాగాడు. అయితే ఈసారి వలలో ధగధగా మెరుస్తూ బంగారం, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు పడి ఉన్నాయి! వాటితోబాటు ఓ నల్లటి సీసా కూడా పైకి వచ్చింది వలలో.
“ఆహా! ఈ బంగారు రాశితో‌ మేం జీవితమంతా హాయిగా గడపచ్చు” అనుకున్నాడు జాలరివాడు. ఆ సంపదతో తను ఏమేం చేస్తాడో ఆలోచించుకుంటూ అతను సీసాను చేతిలోకి తీసుకొని, అనుకోకుండా దాని మూతను తెరిచి చూశాడు. సీసా మూత తెరవగానే దానిలోంచి తెల్లగా పొగ మొదలైంది. చూస్తుండగానే ఆ పొగ దట్టమైంది. మరుక్షణం ఆ పొగలో ఒక భూతం ఏర్పడింది!

జాలరివాడు భయంతో వణికిపోయాడు. భూతం అరిచింది- “నేను నిన్ను తినేస్తా!” అని. “నేనేం తప్పు చేశాను? నన్ను ఎందుకు తినేస్తావు నువ్వు?” అని అడిగాడు జాలరివాడు, చావు ఎలాగూ తప్పదనుకుంటూ.
“ఆ సీసాలో నాకు ఇన్నాళ్లుగా ఊపిరి ఆడలేదు. దీనికంతా కారణం నువ్వే!” అన్నది భూతం- జాలరివాడికి తన కోరపళ్ళు చూపిస్తూ.
“నేనెందుకు కారణం? నిజానికి నేనేకదా, దీన్ని విడిపించింది?” అనుకున్నాడు జాలరివాడు. కానీ ఆ మాట భూతంతో అనీ ప్రయోజనం ఉండదని వాడికి తెలుసు. అందుకని వాడు ఆశ్చర్యాన్ని నటిస్తూ- “ఏంటీ! ఇంత పెద్ద భూతానివి, నువ్వు – ఈ చిన్న సీసాలో- పట్టావా? అది ఎలా సాధ్యం?” అన్నాడు భూతంతో.
“నేను ఎంత పెద్దగా అన్నా అవ్వగలను, ఎంత చిన్నగా అన్నా అవ్వగలను. నీ కళ్లముందే నేను ఈ సీసాలోంచి బయటికి రాలేదూ?” అన్నది భూతం కోపంగా.

“నేను నమ్మను. ఇంత పెద్దగా ఉన్న నువ్వు, చీమంత ఎట్లా అవుతావు?” అన్నాడు జాలరివాడు తెలివిగా. “ఇదిగో, ఇట్లా అవుతాను!” అని, భూతం, పంతంకొద్దీ, చీమంత అయిపోయింది. సిద్ధంగా ఉన్న జాలరివాడు ఏమాత్రం ఆలస్యం చేయలేదు- ఆ చీమంత భూతాన్ని పట్టుకొని, సీసాలో వేసి, క్షణంలో మళ్ళీ‌మూత బిగించేశాడు! ఆపైన సీసాను లోతైన సముద్రంలోకి విసిరేశాడు.
ఆ తర్వాత జాలరివాడు తనకు దొరికిన రత్నమాణిక్యాలను మూటగట్టి ఇంటికి తీసుకుపోయి, ఆ సంపదతో జీవితాంతమూ సుఖంగా కాలం గడిపాడు.