DailyDose

నిర్భయ దోషుల ఉరికి తలారీలు దొరికారు-తాజావార్తలు-12/12

Talaris Found For Hanging Nirbhaya Culprits-Telugu Breaking News-12/12

* మీడియాపై ఆంక్షలు, జీవో 2430 రద్దు చేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘ సభాపతి, మంత్రులు డమ్మీలుగా మారారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కించపరిస్తే ఆనందపడుతున్నారు. నిరసనలు తెలియజేయకుండా నియంత్రిస్తున్నారు’’ అని చంద్రబాబు అన్నారు.

* రైతు సమస్యలపై తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షను విరమించారు. రైతులు పవన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నాయకులు మాత్రం బాగానే ఉన్నారు.. రైతులు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభను ఎంతో హుందాగా నడపాలి.. .దూషణలతో నడుపుతున్నారు. కూల్చివేతతో మొదలుపెట్టారు.. అందరినీ కూల్చేస్తున్నారు. మీరూ ఒక రోజు కూలిపోతారు’’ అని పవన్‌ అన్నారు.

* 2012 అత్యాచార కేసులో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలంటూ నలుగురు దోషుల్లో ఒకడైన అక్షయ్‌ సింగ్‌ ఠాకూర్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ పిటిషన్‌ను ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ నెల 17న విచారణ చేపట్టనుంది. ఓపెన్‌ కోర్టులో మధ్యాహ్నం 2గంటలకు ఈ పిటిషన్‌ను విచారించనున్నారు. నిర్భయ దోషులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో రివ్యూ పిటిషన్‌ విచారణ చేయడం గమనార్హం.

* కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో తెరాస ఎంపీలు భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, ఇతర నిధులు విడుదల చేయాలని ఆమెను కోరారు. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ రాసిన లేఖను ఎంపీలు కేంద్రమంత్రికి అందజేశారు. అనంతరం తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సమాయానికి అందేలా కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తామని చెప్పారు.

* మహారాష్ట్రలో కొలువుదీరిన మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో మంత్రి పదవుల పంపకం వ్యవహారంలో స్పష్టత వచ్చింది. మంత్రివర్గ కూర్పులో కీలక శాఖల కేటాయింపులను పరిశీలిస్తే.. శివసేనకు హోంశాఖ, నగరాభివృద్ధి శాఖలు దక్కగా.. ఎన్సీపీకి ఆర్థికశాఖ, గృహనిర్మాణం, వైద్యం, సహకార మంత్రిత్వ శాఖలను కేటాయించారు. అలాగే, కాంగ్రెస్‌కు రెవెన్యూ, విద్యుత్‌, విద్య, టెక్స్‌టైల్‌, ప్రజా పనుల శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలను కేటాయించారు.

* నిర్భయ ఘటనలో దోషులకు త్వరలో ఉరిశిక్ష విధించనున్న నేపథ్యంలో తిహాడ్‌ జైలు అధికారులు తలారీల కోసం యూపీ జైళ్ల శాఖకు లేఖ రాశారు. తమకు అవసరమైనప్పుడు ఇద్దరు తలారీలను పంపించాలని అందులో పేర్కొన్నారు. దోషులెవరు?ఉరి ఎప్పుడు? వంటి సమాచారం ఏదీ అందులో లేదు. ఈ మేరకు డిసెంబర్‌ 9న తిహార్‌ జైలు నుంచి ఫ్యాక్స్‌ ద్వారా తమకు సమాచారం అందిందని యూపీ జైళ్ల శాఖ అదనపు డీజీ ఆనంద్‌ కుమార్‌ గురువారం తెలిపారు.

* ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ వెల్లడించారు. ఎయిరిండియా ప్రైవేటీకరణ గురించి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి లోక్‌సభకు రాతపూర్వక సమాధానంగా తెలియజేశారు.

* పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే ఉన్నతాధికారితో పాటు గువాహటి పోలీస్‌ కమిషనర్‌ను బదిలీ చేసింది. గువాహటి సిటీ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న దీపక్‌ కుమార్‌స్థానంలో మున్నా ప్రసాద్‌ గుప్తాను నియమించింది. అదనపు డీజీపీ (శాంతి భద్రతలు) ముకేశ్‌ అగర్వాల్‌ను సీఐడీకి పంపించింది.

* దేశాన్ని ఆర్థిక మందగమనం ఓవైపు వెంటాడుతుంటే.. మరోవైపు పారిశ్రామిక ఉత్పత్తి కూడా పడిపోతోంది. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి పారిశ్రామిక ఉత్పత్తి 3.8శాతానికి పడిపోయినట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా విద్యుత్‌, ఖనిజాలు, ఉత్పత్తి రంగాల్లో నెలకొన్న పేలవమైన ప్రదర్శనే ఇందుకు కారణం. గతేడాది ఇదే సమయానికి పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 8.4గా ఉండటం గమనార్హం.

* ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 సీజన్‌ వేలానికి రంగం సిద్ధమవుతోంది. ఏర్పాట్లన్నీ పూర్తైనట్టు సమాచారం. ఈ నెల 19 కోల్‌కతాలో వేలం జరగనుంది. మొత్తం 971 మంది ఆటగాళ్లు పేర్లను నమోదు చేసుకోగా 332 మంది వేలానికి ఎంపికయ్యారు. వీరికి సంబంధించిన జాబితాలను బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు అందజేసింది. వేలానికి ఎంపికైన వారిలో 24 మంది కొత్తవారే ఉన్నారని తెలిసింది.

* ప్రముఖ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘ఇంట్లో రామయ్య- వీధిలో కృష్ణయ్య’ సినిమాతో నటుడిగా రంగ ప్రవేశం చేసిన ఆయన.. 290కి పైగా చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన నాటకాలు, కథలు, నవలలు రాసేవారు. ఆత్మగౌరవం, కళ్లు సినిమాలకు రచయితా నంది పురస్కారాలు అందుకున్నారు.

* ఏపీ ప్రభుత్వం పాఠశాలల్లో ప్రవేశపెట్టే ఆంగ్లమాధ్యమానికి తాము సహకరిస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంగ్లమాధ్యమంపై శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. తానెప్పుడూ ఆంగ్లమాధ్యమానికి వ్యతిరేకం కాదని.. తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూనే దాన్ని అమలు చేయాలని సూచించారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన వైకాపా.. ఇప్పుడు మాత్రం తామే ఆంగ్లమాధ్యమాన్ని కనుగొన్నట్లు మాట్లాడుతోందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

* ‘దిశ’ హత్య తర్వాత మద్యంపై సర్వత్రా చర్చ నడుస్తోందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. హైదరాబాద్‌ బ్రాండ్ అంటూ ట్వీట్‌ చేస్తున్న కేటీఆర్‌.. బ్రాందీ హైదరాబాద్‌గా మార్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్కు వద్ద మాజీ మంత్రి డీకే అరుణ చేపట్టిన దీక్షను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాజపా మహిళా సంకల్ప దీక్షతో ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అన్నారు. మద్యంపై ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

* భాజపా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుందనే నమ్మకం దేశ ప్రజలందరికీ ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గురువారం ఝార్ఖండ్‌లోని ధనాబాద్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కఠినమైన నిర్ణయాలు తీసుకునేందుకు కాంగ్రెస్‌ వెనకాడిందని.. కానీ, తమ ప్రభుత్వం అలా కాదని ఆయన తెలిపారు.

* ‘దిశ’ అత్యాచారం కేసుకు సంబంధించి ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నలుగురు నిందితుల మృతదేహాల అప్పగింతపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సబంధించి విచారణ చేపట్టవద్దని సుప్రీం స్టే విధించిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఉన్నత న్యాయస్థానం వెల్లడించింది. అనంతరం విచారణను శుక్రవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మరోవైపు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే అంశాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా అడ్వకేట్‌జనరల్‌ను ఆదేశించింది.

* అయోధ్య తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పిటిషన్లను మిగతా కేసుల మాదిరిగా సాధారణ విధానాన్ని అనుసరించకుండా ప్రత్యేక ఛాంబర్‌లో విచారణ చేశారు. తీర్పుపై సమీక్ష కోరుతూ దాఖలైన 18 రివ్యూ పిటిషన్లను సీజేఐ తిరస్కరించారు. రివ్యూ పిటిషన్లపై ఛాంబర్‌లో సీజేఐ జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అంతర్గత విచారణ జరిపింది.

* పౌరసత్వ సవరణ బిల్లు(క్యాబ్‌) గురించి మోదీజీ మీరు హామీ ఇస్తూ చేసిన ట్వీట్‌ను అసోం ప్రజలు చదవలేరంటూ కాంగ్రెస్‌ చురకలు వేసింది. బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రమైన అసోంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. దీనిపై మోదీ స్పందిస్తూ క్యాబ్‌పై ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ ట్విటర్‌ వేదికగా ఆయన అసోం ప్రజలకు హామీ ఇచ్చారు. దీనిపై కాంగ్రెస్‌ వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది.

* వచ్చే ఏడాది దిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిధుల సేకరించేందుకు ప్రజలకు టీ, లంచ్‌, డిన్నర్‌ పార్టీలు ఇవ్వాల్సిందిగా ఆప్‌ కన్వీనర్‌, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పార్టీ నేతలకు సూచించారు. ఆప్‌కి నిధులు సేకరించే విషయంపై జరిగిన సమావేశానికి సీఎం కేజ్రీవాల్‌ అధ్యక్షత వహించారు.

* మహారాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారి.. అనూహ్య పరిణామాలకు కారణమైన ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ ‘అధికార’ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దేవేంద్ర ఫడణవీస్‌ మూడు రోజుల ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్‌కు.. మహావికాస్‌ ఆఘాడీ సంకీర్ణ ప్రభుత్వంలోనూ అదే పదవి దక్కనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, దానిపై సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా ఆయనకు ఆర్థిక మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

* వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అమెరికా ఫెడ్‌ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో సాగాయి. ఆ సానుకూల ప్రభావంతో దేశీయ మార్కెట్లు కూడా రాణించాయి. అటు లోహ, బ్యాంకింగ్‌ రంగాల షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్లు కూడా సూచీలను ముందుకు నడిపించాయి. నేటి సెషన్‌లో 169 పాయింట్ల లాభంతో 40,582 వద్ద, నిఫ్టీ 62 పాయింట్లు లాభపడి 11,972 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 70.60గా కొనసాగుతోంది.