Business

రైల్వే టికెట్ ధరలు పెరగవచ్చు

Indian Railway Thinking To Hike Ticket Prices

ఆర్థిక మందగమనం దాదాపు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో రైల్వే శాఖ ఆదాయం కూడా గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో త్వరలో రైలు ఛార్జీలు పెరగనున్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రైల్వే బోర్డు ఛైర్మన్‌ వి.కె.యాదవ్‌ గురువారం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రయాణికులు, సరకు రవాణా ఛార్జీలను హేతుబద్ధీకరించే యోచనలో రైల్వే శాఖ ఉన్నట్లు తెలిపారు. అయితే ఛార్జీల పెంపుపై మాత్రం స్పందించడానికి నిరాకరించారు. ఆదాయం విషయంలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న రైల్వే శాఖ దాన్ని పరిష్కరించడానికి అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. అయితే ఛార్జీల పెంపు చాలా సున్నితమైన అంశమని.. దీనిపై సుదీర్ఘ చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే సరకు రవాణా ఛార్జీలు భారీగా ఉన్నాయని ఈ నేపథ్యంలో టికెట్‌ ధరల పెంపుపై ఆలోచించాలని వ్యాఖ్యానించారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం వల్ల రైల్వే శాఖ తీవ్ర ప్రతికూల ప్రభావం ఎదుర్కొంటోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రయాణికుల విభాగంలో రూ.155 కోట్లు, సరకు రవాణా విభాగంలో రూ.3,901 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన 2014లో చివరిసారిగా రైల్వే ఛార్జీలను పెంచారు. ప్రయాణికుల ఛార్జీలు 14.2శాతం, సరకు రవాణా ఛార్జీలు 6.5శాతం మేర పెరిగాయి.