DailyDose

కాంగ్రెస్‌పై అమిత్ షా ఆగ్రహం-తాజావార్తలు

Amith Shah Angry On Congress Over NRC & CAA

* దేశ రాజధాని దిల్లీలో శాసనసభ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా తెలిపారు. ఒకే దశలో దిల్లీ శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 8న పోలింగ్‌ జరుగుతుందని.. ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 22తో ముగియనుందని అరోడా చెప్పారు.

* దలాల్‌స్ట్రీట్‌ బేర్‌మంది.. సూచీలు బెంబేలెత్తిపోయాయ్‌.. మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ భయాలు మార్కెట్లను తీవ్రంగా కలవరపెట్టాయి. దీనికి తోడు దేశీయంగా అమ్మకాలు మరింత కుదిపేశాయి. ఫలితంగా సోమవారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 850 పాయింట్లకు పైగా పతనమైంది. చివరకు 788 పాయింట్లు దిగజారి 40,677 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 234 పాయింట్ల నష్టంతో 11,993 వద్ద ముగిసింది.

* రాజకీయ చైతన్యానికి విజయవాడ మారుపేరని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. మన పిల్లలు వేరే ప్రాంతాలకు వెళ్లకూడదనే అమరావతికి శ్రీకారం చుట్టామని తెలిపారు. విజయవాడలో గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ..సీఎం , మంత్రులు రోజుకు ఒకలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘‘నాపై ఉన్న కోపం అమరావతిపై చూపించకండి. అమరావతిలో ఇప్పటికే అన్ని భవనాలు ఉన్నాయి. అక్కడ మీరు పైసా ఖర్చుపెట్టాల్సిన పని లేదు’’ అని వైకాపా నేతలను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.

* రాజధాని రైతుల అరెస్టులు కొనసాగుతున్నాయి. వెలగపూడి, మందడం, మల్కాపురం గ్రామాలకు చెందిన 16 మంది రైతులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజధాని ప్రాంతంలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశంపై మాట్లాడదామని చిలకలూరిపేట పోలీసులు రైతులను పిలిపించారు. పోలీసుస్టేషన్‌కు వెళ్లిన రైతుల్లో పది మందిని అరెస్ట్‌ చేశారు.

* దేశరాజధానిలోని ప్రఖ్యాత జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు పాల్పడిన కొందరు వ్యక్తుల్ని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. ముసుగులు ధరించి కర్రలు, ఇనుప రాడ్డులతో విశ్వవిద్యాలయంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు క్యాంపస్‌లోని విద్యార్థులు, ప్రొఫెసర్లపై దాడి చేసిన ఘటన దేశంలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటిదాకా ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.

* పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సోమవారం తీవ్ర విమర్శలు చేశారు. దిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరై ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌, ఆప్‌ పార్టీలు సీఏఏ విషయంలో మైనారిటీలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా రాహుల్‌గాంధీ, ప్రియాంక ఇద్దరూ సీఏఏపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దిల్లీలో సీఏఏ పేరుతో చెలరేగుతున్న అల్లర్లకు ఆయా పార్టీలే బాధ్యత వహించాలని అన్నారు.

* అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తమ సైనిక ఉన్నతాధికారిని చంపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఇరాన్‌ గట్టి హెచ్చరికలే చేస్తోంది. ఇరాన్‌ టాప్‌ మిలిటరీ కమాండర్‌ ఖాసీం సులేమానీ అంత్యక్రియలను ప్రసారం చేస్తున్న సమయంలో ఇరాన్‌ అధికారిక టీవీ ఛానళ్లు ఓ ప్రకటన చేశాయి. అందులో ప్రతి పౌరుడు నుంచి ఒక్కో డాలర్‌ చొప్పున ట్రంప్‌ తలపై 80 మిలియన్‌ డాలర్ల రివార్డు ప్రకటించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

* సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబం ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. మోహన్‌బాబు వెంట మంచు లక్ష్మి, విష్ణు, విరోనిక ఉన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా భాజపాలో చేరాలని మోహన్ బాబును మోదీ ఆహ్వానించినట్లు సమాచారం. సాయంత్రం 6.30 గంటలకు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్ షాని మోహన్‌బాబు కలవనున్నారు.

* ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా.. రిటైల్‌ దిగ్గజం ఫ్యూచర్‌ గ్రూప్‌తో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకొంది. దీంతో ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ స్టోర్లలో లభించే వస్తువులు వినియోగదారులకు మరింత చేరువకానున్నాయని అమెజాన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన ‘ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌’లో 49శాతం వాటాల్ని కొనేందుకు ఇటీవలే అమెజాన్‌ అంగీకరించింది. ఫ్యూచర్‌ కూపన్స్‌ లిమిటెడ్‌కు ‘ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌’(ఎఫ్‌ఆర్‌ఎల్‌)లో వాటాలుండడం గమనార్హం.

* దేశ రాజధానిలోని జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీలో విద్యార్థులు, అధ్యాపకులపై ఆగంతుకుల దాడిని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దాడిని వ్యతిరేకిస్తూ బెంగళూరు, హైదరాబాద్‌, పుదుచ్చేరి, కోల్‌కతా, అలీఘఢ్‌ యూనివర్శిటీల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా ఈ నిరసనలు విదేశాల్లోని విశ్వవిద్యాలయాలకు పాకాయి. జేఎన్‌యూ విద్యార్థులకు అండగా ఆక్స్‌ఫర్డ్‌, కొలంబియా యూనివర్శిటీల్లో విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టి ఆందోళన చేశారు.

* రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారానికి 20వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు నుంచి 10 వేల మంది రైతులు, యువకులు, మహిళలతో మందడం వరకు ఇవాళ ఉదయం మహా పాదయాత్రను ప్రారంభించారు. తమ పాదయాత్రను ఎవ్వరూ అడ్డుకోలేరని రైతులు స్పష్టం చేశారు. మూడు రాజధానులు వద్దు.. ఒక రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు.

* దేశ రాజధాని దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ)లో విద్యార్థులపై దాడిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఏ) తీవ్రంగా ఖండించింది. ఈ తరహా హింస, అరాచకాలను ఏ మాత్రం సహించేది లేదని దుండగుల్ని హెచ్చరించింది. తాజా ఘటనపై చర్చించేందుకు జేఎన్‌యూ రిజిస్ట్రార్‌, ప్రోక్టర్‌, రెక్టర్‌ని తన కార్యాలయానికి రావాలని ఎంహెచ్‌ఏ కార్యదర్శి ఆదేశించారు.

* జవహార్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులపై దుండగులు దాడి చేయడంపై జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు అయిషీ ఘోష్‌ తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో అస్థిర పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ రోజు తన కుమార్తెను కొట్టారని, రేపు తనపై కూడా దాడి జరిగే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. దాడిపై అయిషీ తల్లి స్పందిస్తూ.. ఎన్ని దాడులు జరిగినా తన కుమార్తె మాత్రం ఆందోళన ఆపబోదని స్పష్టం చేశారు.

* అమెరికాతో తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2015లో వివిధ దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందంలోని కీలక నిబంధన నుంచి సైతం విరమించుకుంటామని ప్రకటించింది. యురేనియం శుద్ధిలో కీలక పాత్ర పోషించే సెంట్రిఫ్యూజ్‌ల సంఖ్యపై ఉన్న పరిమితిని సైతం పక్కనపెడుతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇక తమ దేశ అణు కార్యక్రమంపై ఎలాంటి పరిమితులు లేవని ఓ ప్రకటనలో వెల్లడించింది.

* ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తత ముదురుతున్న వేళ డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరిన్ని హెచ్చరికలు చేశారు. తాజాగా తమ దేశం నుంచి అమెరికా సైన్యాన్ని పంపేయాలన్న ఇరాక్‌ పార్లమెంటు నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు తప్పుబట్టారు. ‘‘ఇరాక్‌లో మేం చాలా ఖర్చు చేశాం. బిలియన్ల డాలర్లు ఖర్చు చేసి వైమానిక స్థావరాన్ని నిర్మించాం. ఆ మొత్తం తిరిగి చెల్లించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదు’’ అని విలేకరులతో ఆయన అన్నారు.

* అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతోంది. ముడిచమురు, బంగారం ధరలు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లు డీలా పడ్డాయి. అది దేశీయ మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 700 పాయింట్లు పతనమై 40,764 వద్ద, నిఫ్టీ 210 పాయింట్లు పతనమై 12,016 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 31 పాయింట్లు క్షీణించి 72.10గా కొనసాగుతోంది.

* టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా తాను ఉంటే ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ను టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేయనని భారత మాజీ సారథి, మాజీ సెలక్టర్ శ్రీకాంత్‌ కృష్ణమాచారి అన్నాడు. ‘‘శ్రీలంకపై చేసే పరుగులు లెక్కలోకి రావు. నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉంటే ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ధావన్‌ను ఎంపిక చేయను. ధావన్‌, రాహుల్‌ మధ్య పోటీ లేదు. విజేత ఒక్కడే’’ అని శ్రీకాంత్‌ తెలిపాడు.

* ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా.. రిటైల్‌ దిగ్గజం ఫ్యూచర్‌ గ్రూప్‌తో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకొంది. దీంతో ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ స్టోర్లలో లభించే వస్తువులు వినియోగదారులకు మరింత చేరువకానున్నాయని అమెజాన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. తాజా ఒప్పందంతో ఫ్యాషన్, ఫుట్‌వేర్ వంటింటి, ఇతర సాధారణ వస్తువులు అమెజాన్‌ ఆన్‌లైన్‌ ద్వారా వినియోగదారులకు అందించనున్నారు. అలాగే ఎఫ్‌ఆర్‌ఎల్‌ స్టోర్స్‌కి అమెజాన్‌ ఇండియా అధికారిక సేల్స్‌ ఛానెల్‌గా మారనుంది.