Politics

తెలంగాణా మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్

High Court Telangana Municipal Elections

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌లో నిబంధనలు పాటించలేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది కొన్ని అంశాలను లేవనెత్తారు. తొలుత రిజర్వేషన్లు ప్రకటించి నోటిఫికేషన్‌ జారీ చేయాలని, ఆ తర్వాత షెడ్యూల్‌ ప్రకటించాలని.. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిబంధనలేమీ పాటించలేదని న్యాయస్థానానికి తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్‌ విడుదల చేయొద్దని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు చేయకుండానే జనవరి 7 నుంచి ఎన్నికల ప్రక్రియ ఆరంభమయ్యేలా షెడ్యూల్‌ విడుదల చేయడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సదరు నోటిఫికేషన్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని, సవరించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు.