DailyDose

ఫిబ్రవరి 1న ఉదయం 5గంటలకు నిర్భయకు ఆత్మశాంతి-తాజావార్తలు

Nirbhaya Culprits Gets Death Warrant For Feb 1st At 5AM

* ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీతకు కొత్త తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు దోషులను ఉరితీయాలని ఆదేశిస్తూ దిల్లీ కోర్టు తాజాగా మరోసారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ కేసు దోషుల్లో ఒకడైన ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష దరఖాస్తును రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేడు తిరస్కరించారు. దీంతో తాజా డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని కోరుతూ తిహాడ్‌ జైలు అధికారులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ముఖేశ్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించారని, అందువల్ల దోషుల ఉరితీతకు కొత్త తేదీ, సమయం చెబుతూ డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని తిహాడ్‌ అధికారుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ న్యాయస్థానాన్ని కోరారు.

* రాజధాని గ్రామాల్లో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్టు 30 అమలు చేయడంపై అమరావతి రైతులు, మహిళలు, న్యాయవాదులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. దీనిపై అడ్వకేట్‌ జనరల్‌ దాదాపు గంట పాటు వాదనలు వినిపించారు. 2014 నుంచి అమరావతిలో 144 సెక్షన్‌ ఉందని ఆయన కోర్టుకు తెలిపారు. 144 సెక్షన్‌ను రాజధానిలో పొడిగించినట్టు వివరించారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయనే ఉద్దేశంతోనే రైతులను అడ్డుకున్నట్టు ఏజీ తెలిపారు. రాజధానిలో పోలీసులు భారీ స్థాయిలో కవాతు ఎందుకు నిర్వహించారు? మందడంలో మహిళను పోలీసులు బూటు కాలుతో ఎందుకు తన్నారో చెప్పాలని నిలదీశారు.

* నిర్భయ దోషులకు శిక్ష అమలుపై కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేస్తామని.. డెత్‌వారెంట్‌ ప్రకారం శిక్ష అమలువుతుందని వెల్లడించారు. న్యాయవ్యవస్థలో ఉన్న అనేక లొసుగుల ఆధారంగా నేరస్థులు అనేక కారణాలతో శిక్షలు అమలుకాకుండా ఆలస్యం అయ్యేలా చేస్తున్నారు. మరోవైపు ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లో రానున్న రోజుల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని కిషన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు.

* భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని ప్రకటించిన ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరో కీలక ప్రకటన చేసింది. రానున్న ఐదేళ్లలో భారత్‌లో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించింది. అమెజాన్‌ సొంతలాభం కోసం తప్ప భారత్‌ కోసం పనిచేయడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ కంపెనీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. అమెజాన్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్‌ బెజోస్‌ మూడు రోజుల పర్యటనకు వచ్చిన సందర్భంగా భారత్‌లో రూ.7వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు.

* పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించగా.. తాజాగా పంజాబ్‌ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది. సీఏఏను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అధికార కాంగ్రెస్‌ తీసుకొచ్చిన తీర్మానానికి పంజాబ్‌ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర మంత్రి బ్రహ్మ మోహింద్రా ఈ తీర్మానాన్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. ‘సీఏఏ వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్‌లోనూ నిరసనలు చోటుచేసుకున్నాయి. అందుకే ఈ చట్ట సవరణను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని తీర్మానం సందర్భంగా మోహింద్రా పేర్కొన్నారు.

* జనసేన-భాజపా పొత్తుతో అంతిమంగా రాష్ట్రానికి మేలు జరగాలని ప్రజలు ఆశిస్తున్నారని తెదేపా సీనియర్‌ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయగలిగే స్థాయిలో భాజపా ఉందన్నారు. హైకోర్టు మార్పు ప్రకటనను కేంద్రం ఎందుకు ఖండించలేదని పయ్యావుల ప్రశ్నించారు. అమరావతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం వైఖరి అలాగే ఉందన్నారు.భాజపా తలచుకుంటే రాజధాని అమరావతి సమస్య వారికి అతి చిన్నదని, ఈ విషయంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. భాజపా పెద్దన్న పాత్ర ఎటువైపో స్పష్టం కావాల్సిన అవసరముందని పయ్యావుల డిమాండ్‌ చేశారు.

* తెలంగాణ పురపాలక శాఖ మంత్రిగా మున్సిపల్‌ ఎన్నికలు తనకు సవాలు వంటివని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. ఈ సందర్భంగాపలు కీలక విషయాలను వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ మనసులో ఇంకా చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయన్న కేటీఆర్‌.. సందర్భానుసారంగా వాటిని అమలు చేయనున్నట్టు తెలిపారు. తాను సీఎం అవుతారంటూ వస్తున్నవన్నీ ఊహాగానాలేనని తేల్చి చెప్పారు.

* యాదాద్రి జిల్లా హాజీపూర్‌ గ్రామంలో చోచుచేసుకున్న వరుస హత్య కేసుల్లో ఈ నెల 27న తీర్పును వెలువరించనున్నట్లు పోక్సో కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు. ముగ్గురు బాలికలను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్‌ రెడ్డిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నెల 8వ తేదీ నాటికి ఒక హత్య కేసుకు సంబంధించి వాదనలు పూర్తయ్యాయి. మరో రెండు హత్యల కేసుల్లో వాదనలు వినకుండానే ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్నట్లు పోక్సో కోర్టు న్యాయమూర్తి తెలిపారు.

* అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది. డిశ్చార్జి పిటిషన్లన్నంటినీ కలిపి విచారించాలని గతంలో జగన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. సీబీఐ కేసుల విచారణ పూర్తయిన తర్వాతే ఈడీ కేసులు విచారణ జరపాలని కూడా ఆయన మరో పిటిషన్‌ దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘ వాదనల అనంతరం డిశ్చార్జి పిటిషన్లన్నింటినీ కలిపి వినేందుకు కోర్టు నిరాకరించింది. వేర్వేరుగానే వినాలని న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.

* వందల మంది బేకర్లు , షెఫ్‌లు ఒక్కటయ్యారు… ఇంకేముంది… ప్రపంచ రికార్డు సాకారమయ్యింది. కేరళ తీరప్రాంత పట్టణం త్రిసూర్‌లోని నలభీములు ప్రపంచంలోనే అతి పొడవైన కేకును తయారుచేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ కెక్కారు. 6.5 కిలోమీటర్లు పొడవు, 10 సెంటీమీటర్ల మందం ఉన్న ఈ కేక్‌ 27,000 కిలోల బరువుంది. దీని తయారీకి 12,000 కిలోల పంచదార, మైదాలను వాడారు. ఈ వెనీలా కేక్‌ను మరింత రుచికరంగా చేయటానికి దానిని చాకోలేట్‌ పూతతో అలంకరించారు. బేకర్స్‌ అసోసియేషన్‌ కేరళ (బేక్‌) సృష్టించిన ఈ రికార్డును చూడటానికి అక్కడి ప్రజలు గుమిగూడారు.

* సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషి ముఖేశ్ కుమార్‌ సింగ్‌ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తిరస్కరించారు. ముఖేశ్‌ పిటిషన్‌ను కేంద్ర హోంశాఖ నిన్న రాష్ట్రపతి భవన్‌కు పంపిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను తిరస్కరించాలని హోంశాఖ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ముఖేశ్‌ దరఖాస్తును రాష్ట్రపతి నేడు తిరస్కరించినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. తిహాడ్‌ జైలు అధికారులకు కూడా ఈ సమాచారాన్ని అందిస్తున్నట్లు తెలిపాయి.

* ముఖ్యమంత్రి జగన్‌తో హైపవర్‌ కమిటీ భేటీ అయింది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ కమిటీ సమావేశమైంది. పాలన వికేంద్రీకరణ, రాజధాని అంశాలపై హైపవర్‌ కమిటీ ముఖ్యమంత్రికి నివేదించింది. వేర్వేరు ప్రతిపాదనలపై సీఎంకు ప్రజెంటేషన్‌ ఇచ్చింది.

* అమరావతి రాజధాని గ్రామాల్లో సెక్షన్‌ 144, పోలీస్‌ యాక్టు 30 అమలుపై హైకోర్టు విచారణ చేపట్టింది. రాజధాని గ్రామాలు, విజయవాడలో నిషేధాజ్ఞలు అమలుపై మొత్తం ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. రాజధాని మహిళలు, రైతులు, న్యాయవాదులు దాఖలు చేసిన ఈ పిటిషన్లతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి ఈ వ్యవహారాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించారు. అన్ని పిటిషన్లను కలిపి న్యాయస్థానం విచారణ చేస్తోంది. మరోవైపు, రాజధానిలో ఆందోళనలు 31వ రోజూ కొనసాగుతున్నాయి.

* రాజధాని అంశంపై అమరావతి రైతుల అభిప్రాయాల నమోదులో సాంకేతికలోపం తలెత్తడంతో రైతులు కాసేపు ఇబ్బంద్ది పడ్డారు. సర్వర్‌ డౌన్‌ కారణంగా రైతుల అభిప్రాయాలు నమోదు చేయలేకపోయారు. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. సాంకేతిక లోపాన్ని సవరించింది. సీఆర్‌డీఏ ఈమెయిల్‌, వెబ్‌సైట్‌ పనిచేస్తున్నాయని.. సాంకేతిక లోపాన్ని సవరించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతులు తమ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు చేయవచ్చని చెప్పారు. అభ్యంతరాల స్వీకరణకు నేడు తుది గడువు.

* తెరాస ప్రభుత్వమే అత్యధికంగా కానిస్టేబుల్‌ ఉద్యోగాలను భర్తీ చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం పోలీస్‌ శాఖకు మరింత ప్రాధాన్యం కల్పించామన్నారు. శుక్రవారం కానిస్టేబుళ్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంబించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెరాస హయాంలో రాష్ట్రంలో నేరమయ ఘటనలు తగ్గాయన్నారు. 267 మంది కానిస్టేబుళ్ల శిక్షణ అభ్యర్థులకు 9 నెలల పాటు కొనసాగనుంది.

* కృష్ణాజిల్లా నందిగామ వద్ద జొన్నలగడ్డ వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 25మంది కూలీలతో వెళుతున్న ట్రాక్టరు బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతులు పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదల వాసులుగా గుర్తించారు.

* భారత వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా ఫ్రాన్స్‌లోని ఓ ద్వీపంలో కొనుగోలు చేసిన విలాసవంతమైన భవనం ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుందంట. 17 పడక గదులు, సినిమా థియేటర్‌, హెలిప్యాడ్‌, నైట్‌క్లబ్‌ ఉన్న ఈ సౌధానికి గత కొన్నేళ్లుగా ఎలాంటి మరమ్మతులు చేయించకపోవడంతో చాలా వరకు దెబ్బతిన్నట్లు బ్లూమ్‌బర్గ్‌ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ఫ్రెంచ్‌ ద్వీపమైన ఇలీ సెయింటీ మార్గరైట్‌లో 1.3 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ‘లీ గ్రాండ్‌ జార్డిన్‌’ భవనాన్ని మాల్యా 2008లో కొనుగోలు చేశారు.

* భారత టెన్నిస్‌ తార సానియా మీర్జా సంచలనం సృష్టించింది. మహిళల డబుల్స్‌లో తన భాగస్వామి నడియా కిచెనోక్‌ (ఉక్రెయిన్‌)తో కలిసి హోబర్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. అమ్మయ్యాక రెండేళ్లు విశ్రాంతి తీసుకున్న ఆమె పునరాగమనంలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. సెమీస్‌ పోరులో ఈ జంట 7-6 (3), 6-2 తేడాతో టమారా జిదన్‌సెక్‌ (స్లొవేకియా), మేరీ బౌజ్‌కోవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీని మట్టికరిపించింది. తుదిపోరులో చైనా ద్వయం, రెండోసీడ్‌ షువై పెంగ్‌, షువై ఝాంగ్‌తో తలపడనుంది.