ScienceAndTech

వయస్సు గడియారంలో మానవుని ఆయుష్షు 38ఏళ్లు

Aging Clock Determines Human Age To Be Just 38Years

ఒక వ్యక్తికి రోగం రాలే. యాక్సిడెంట్ కాలే. దురవాట్లేమీ లేవు. మంచి ఫుడ్ తీసుకుంటున్నాడు. హెల్దీ లైఫ్స్టైల్ను ఫాలో అవుతున్నాడు. అతడు ఎంతకాలం బతుకుతాడు? సుమారుగా 70, 80 ఏండ్లు బతకొచ్చని ఎవరైనా అంచనా వేస్తారు. కానీ.. అతడు సహజంగా చనిపోవాల్సిన వయసు మాత్రం 38 ఏళ్లేనట! ఏంటీ? ఇదేం లెక్క? అనుకుంటున్నారా.. ఆస్ట్రేలియాలోని ‘కామన్ వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్’కు చెందిన బయాలజిస్ట్ బెంజమిన్ మేన్ లెక్క ప్రకారం ఇంతే మరి! మనుషుల ఏజింగ్ క్లాక్ను బట్టి చూస్తే.. మన అసలు ఆయుష్షు 38 ఏళ్లేనట.
**ఏజింగ్ క్లాక్ అంటే..?
ప్రతి జీవి పుట్టుక నుంచి చనిపోయే వరకు బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం వంటి దశలుంటాయి. ఈ దశలన్నీ బయాలజికల్గా ఒక పద్ధతి ప్రకారం, ఒక నిర్దిష్ట వయసు ప్రకారం కొనసాగుతుంటాయి. దీనినే సైంటిస్టులు ఏజింగ్ క్లాక్ (వయసు గడియారం) అంటారు. అలాగే ఏజింగ్ క్లాక్ పరంగా ఒక జీవి జీవితకాలం ఎన్నేళ్లకు ముగిసిపోవాల్సి ఉంటుందో, దానినే నేచురల్ లైఫ్స్పాన్ గా పేర్కొంటారు. అంటే రోగాలు, యాక్సిడెంట్ల వంటివాటితో సంబంధం లేకుండా సహజంగా చనిపోయే వయస్సే మన నేచురల్ లైఫ్అన్నమాట. ఈ థియరీ ఆధారంగా అడవుల్లో ఎలుకల మాదిరిగా ఉండే ష్రూ అనే చిన్న క్షీరదాలు మొదలుకొని సముద్రాల్లో ఉండే అతిపెద్ద గ్రీన్ ల్యాండ్ షార్క్ల వరకూ సహజ జీవితకాలాలను బెంజమిన్ మేన్ తన బృందంతో కలిసి అంచనా వేశారు.
**120 ఏళ్లు బతికినోళ్లూ ఉన్నారుగా..
మనుషులు సగటున 60 నుంచి 86 ఏళ్లు బతుకుతారని అంతర్జాతీయ సైంటిస్టులు ఇదివరకే తేల్చారు. అన్నీ అనుకూలిస్తే120 ఏళ్లు బతికినోళ్లు కూడా ఉన్నారు. మరి ఇలాంటప్పుడు మన సహజ జీవితకాలం 38 ఏళ్లే ఎలా అవుతుంది? అంటే.. మనకు దగ్గరి బంధువైన చింపాంజీ నేచురల్ లైఫ్ 37 ఏళ్లేనని బెంజమిన్ గుర్తు చేస్తున్నారు. జూలో పెట్టి, అన్ని రకాలుగా సంరక్షించే చింపాంజీలు 80 ఏళ్ల వరకూ బతుకుతున్నాయని, అంతమాత్రాన వాటి నేచురల్ లైఫ్ 80 ఏళ్లు అయినట్లు కాదని అంటున్నారు. 2 వేల ఏళ్లుగా మనుషుల ఏజింగ్ క్లాక్ ఏమాత్రం మారలేదని చారిత్రక రికార్డులు చెబుతున్నాయంటున్నారు.
**షార్క్ నేచురల్ లైఫ్ 400 ఏళ్లు
ష్రూ అనే చిన్న క్షీరదాల జీవితకాలం 2.1 ఏళ్లే. అందుకే.. అవి పుట్టిన నెలకే సంతానోత్పత్తి దశకు చేరుకుంటాయట. షార్క్ జీవితకాలం 400 ఏళ్లట. అందువల్ల వాటి జీవితంలోని దశలు నెమ్మదిగా జరుగుతాయట. వాటికి150 ఏళ్ల వరకు సంతానోత్పత్తి సామర్థ్యం ఉంటుందట. 1907 నాటికి కొత్త కొత్త మందులు, ట్రీట్ మెంట్లు అందుబాటులోకి రాకముందు మనిషి సగటు ఆయుస్సు 46 ఏళ్లేనని, ప్రస్తుతం ఆధునిక వైద్య సౌకర్యాల వల్ల ఇది బాగా పెరిగిందని రీసెర్చర్లు పేర్కొంటున్నారు.
**మిథైలేషన్ తో డీఎన్ఏపై ఎఫెక్ట్..
మన శరీరంలోని కణాల్లో డీఎన్ఏపై మిథైల్ పదార్థాలు పేరుకుపోవడాన్ని డీఎన్ఏ మిథైలేషన్ అంటారు. మనకు వయసు పెరగడానికి ఈ ప్రక్రియే కారణమని సైంటిస్టులు చెప్తున్నారు. ఇది డీఎన్ఏ కోడ్ పై ప్రభావం చూపకుండానే, దాని పనితీరును మారుస్తుందని అంటున్నారు. ఈ రకంగా చూస్తే 38 ఏళ్లకే మన ఏజింగ్ క్లాక్ చివరి దశకు చేరుకుంటోందని తమ రీసెర్చ్ లో తేలినట్లు బెంజమిన్ మేన్ బృందం వెల్లడించింది. దీనిపై మరింత రీసెర్చ్ అవసరమని, అప్పుడే దీనిని స్లో డౌన్ చేసేందుకు కొత్త మార్గాలు దొరుకుతాయని పేర్కొంటున్నారు.