DailyDose

కొరోనా దెబ్బకు దిగివచ్చిన బంగారం ధరలు-వాణిజ్యం

Telugu Business News Roundup Today-Gold Prices Down Due To Coronavirus

* కరోనా వైరస్‌ ఆందోళనల నేపథ్యంలో ఇటీవల భారీగా పెరిగిన పసిడి ధర బుధవారం అమాంతం దిగొచ్చింది. ఇవాళ ఒక్కరోజే రూ. 516 తగ్గడంతో రూ. 45వేల కిందకు పడిపోయింది. నేడు దేశ రాజధానిలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 44,517గా ఉంది. క్రితం సెషన్‌లో ఈ ధర రూ. 45,033గా ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం నేడు స్వల్పంగా పెరిగింది. రూ. 146 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 47,234 పలికింది. కరోనా ఆందోళనలు కాస్త తగ్గడంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలపడటంతో అంతర్జాతీయంగా ఈ లోహాల ధర తగ్గాయి. ఇది దేశీయ ధరలపైనా ప్రభావం చూపించిందని హెచ్‌డీఎఫ్సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,661 డాలర్లు, ఔన్సు వెండి ధర 17.03 డాలర్లుగా ఉంది.

* దక్షిణ కొరియాకు చెందిన కార్ల దిగ్గజం క్రెటా 2020 మోడల్‌కు భారీగా బుకింగ్స్‌ వస్తున్నాయి. ఈ కారును ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించిన తర్వాత బుకింగ్స్‌ ప్రారంభించిన మొదటి వారంలోనే దాదాపు 10,000 మార్కును దాటేసింది. మార్చి2 నుంచి దీనికి బుకింగ్స్‌ను ప్రారంభించారు. రూ.25వేలు టోకెన్‌ మొత్తం చెల్లించి వాహనాన్ని బుక్‌ చేసుకోవచ్చు. ఈ కారును మార్చి17వ తేదీని విడుదల చేయనున్నారు. కొత్త క్రెటాలో లుక్స్‌లో చాలా మార్పులు చేశారు. దీంతోపాటు ఇంటీరియర్‌లో మార్పులు చేసినట్లు సమాచారం.

* ఓ పక్క ప్రపంచం మొత్తం కరోనావైరస్‌ (కొవిడ్‌-19)తో భయభ్రాంతులకు గురవుతుంటే.. కొందరు కేటుగాళ్లు దీన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా భయాలను, గందరగోళాన్ని క్యాష్‌ చేసుకొనే పనిలోపడ్డారు. ఇందుకు ముఖ్యంగా కంప్యూటర్‌ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొన్నట్లు బెంగళూరుకు చెందిన ‘సుబెక్స్‌’ అనే సంస్థ పేర్కొంది. ఇది టెలికం కంపెనీలకు అనలటిక్స్‌ సేవలను అందజేస్తుంది. ప్రస్తుతం కరోనావైరస్‌ భయంతో చాలా కంపెనీలు ఉద్యోగులను ఇళ్ల నుంచే పనిచేయాలని ప్రోత్సహిస్తున్నాయి. ఇది హ్యాకర్లకు అనువుగా మారింది. ఉద్యోగులు ఇళ్ల దగ్గర నుంచి పనిచేస్తున్నప్పుడు ఆఫీస్‌లో ఉన్నంత సైబర్‌ సెక్యూరిటీ ఇళ్లవద్ద ఉండే నెట్‌వర్క్‌లకు ఇవ్వడం కుదరదు. దీనిని హ్యాకర్లు తమకు అనుకూలంగా మార్చుకొని వారి డివైజ్‌లు, రౌటర్లను హ్యాక్‌ చేసి మాల్వేర్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని సుబెక్స్‌ పేర్కొంది. హ్యాక్‌ చేసిన డివైజ్‌లు(కంప్యూటర్లు, రౌటర్లు) బాట్స్‌వలే పనిచేస్తాయి. ఇవి బాట్‌నెట్‌కు కనెక్ట్‌ అవ్వగలవు. ఒక్కసారి ఉద్యోగి ఆఫీస్‌ నెట్‌వర్క్‌తో కనెక్ట్‌కాగానే ఇవి వ్యవస్థపై సైబర్‌ దాడులు నిర్వహిస్తాయని సుబెక్స్‌ ఇంటర్నెట్‌ థింగ్స్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ ప్రయుక్త కె.వి వెల్లడించారు.

* సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) బకాయిల్లో ఇప్పటి వరకు రూ.25,900 కోట్లు టెలికాం సంస్థలు ప్రభుత్వానికి చెల్లించినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది. మొత్తం చెల్లింపులను పూర్తి చేయాలని టెలికాం సంస్థలకు సూచించినట్లు పేర్కొంది. ఏజీఆర్‌కు సంబంధించి 2019 అక్టోబర్‌ 24న సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు టెలికాం కంపెనీలు ఈ చెల్లింపులు చేసినట్లు కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే ఓ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారతీ ఎయిర్‌టెల్‌ రూ.18,004 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ.3,500 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్‌ రూ.4,197 కోట్లు, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ రూ.3.9 కోట్లు, రిలయన్స్‌ జియో రూ.195 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన మొత్తం కూడా చెల్లించాలని లేఖలు రాసినట్లు పేర్కొన్నారు.

* బ్యాంకు కార్యకలాపాల్లో ఆర్థిక అవకతవకలు, అధికార దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. తాజాగా ఆయన ఆస్తులపై ఈడీ దృష్టిసారించింది. దిల్లీలోని ప్రధాన ప్రాంతాలైన 40-అమృత షెర్గిల్‌ రోడ్‌, చాణిక్యపురిలోని 18-కౌటిల్య రోడ్‌, సర్దార్‌ పటేల్‌ రోడ్‌లో ఉన్న రూ.1000 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ గుర్తించింది. ఆయన భార్య బిందు కపూర్‌ పేరు మీద ఉన్న ఈ ఆస్తులను.. అరెస్టు కావడానికి ముందే రాణా కపూర్‌ అమ్మడానికి ప్రయత్నించినట్లు సమాచారం. తాజా పరిణామాల నేపథ్యంలో ఈడీ రాణా కపూర్‌ భార్య, కుమార్తెల కదలికలపై కూడా దృష్టిసారించింది. వారిని దేశం విడిచివెళ్లొద్దని ఆదేశించింది.