Kids

కొంగను బెదరకొట్టిన చేపలు-తెలుగు చిన్నారుల కథలు

Telugu Kids Moral Stories-How fish scared the crane

ఒక అడవిలో పెద్ద చెరువు ఉండేది. దానిలో చాలా చేపలు ఎంతో కాలంగా నివాసం ఉండేవి. ఆ చెరువు దట్టమైన అడవి లోపల ఉండటం వల్ల శత్రువుల భయం లేకుండా బతికేవి. ఒకరోజు ఆ అడవి మీదగా ఎగురుతున్న ఒక కొంగకి ఆ చెరువు కనిపించింది. ‘ఇంత పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానా?’ అని ఆశ్చర్యపోతూ చెరువు గట్టుపై వాలింది. చెరువులో చాలా చేపలు కనిపించాయి. ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బందీ లేదనుకొని, కొంత దూరంలో నివాసం ఏర్పరుచుకుంది. రోజూ మూడుపూటలా హాయిగా చేపలను తింటూ కాలం గడపసాగింది. ఈలోగా చేపలు కంగారు పడటం ప్రారంభించాయి. రోజూ తమలో కొన్ని కొంగకి బలైపోవడం చేపలకు భయం కలిగించింది. ఇలా అయితే కొన్ని రోజులకి తామెవ్వరమూ మిగలమని తెలుసుకొని, కొంగ బారి నుంచి రక్షించుకొనే ఉపాయం ఆలోచించసాగాయి. ఒక చేపపిల్ల ‘నాకొక ఉపాయం తట్టింది, కాని, దానికి మీ అందరి సహకారం కావాలి’ అని చెప్పింది. ‘ఏమిటది?’ అని మిగతా చేపలు అడిగాయి. చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది.మరుసటి రోజు ఉదయాన్నే చేపల్ని తినడానికి కొంగ చెరువు వద్దకు వచ్చింది. కానీ చెరువులో చేపలన్నీ తేలుతూ కనిపించడం చూసి ఆశ్చర్యపోయింది. ‘చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చినట్టున్నాయి, ఏమై ఉంటుందో’నని ఆలోచించసాగింది. ఇంతలో ఒక చేప నీరసంగా పడుతూ, లేస్తూ కనిపించింది. కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకోవడానికి ముందుకు వచ్చింది. కానీ ఆ చేప కొంగతో ‘నీకు బతకాలని ఉంటే నా మాట విను’ అన్నది. కొంగ ఆగి ‘ఏమిటో చెప్పు?’ అని ఆత్రుతతో అడిగింది. ‘నిన్న రాత్రి ఒక పాము చెరువు దగ్గరకు వచ్చి నీళ్ళు తాగబోయింది. ఈలోగా ఒక పెద్దచేప దాన్ని కొరికింది. కోపంతో పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది. చెరువులోని నీళ్ళన్నీ విషమయం అయిపోయాయి. అందుకే చేపలన్నీ చచ్చి తేలుతున్నాయి, నేను కూడా ఇంకో క్షణంలో చావబోతున్నాను. నన్ను తింటే నువ్వు కూడా చనిపోతావు జాగ్రత్త!’ అంటూ గిలగిలా కొట్టుకోసాగింది చేప. దాంతో భయపడ్డ కొంగ మరొక చెరువును వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. చేపపిల్ల పాచిక పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి.