Sports

క్రీడలకు భవిష్యత్తు ఎక్కడుంది?

క్రీడలకు భవిష్యత్తు ఎక్కడుంది? - Ganguly Worried About IPL And Entire Sports Industry

ఐపీఎల్-13వ సీజన్‌పై సోమవారం స్పష్టతనిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అన్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణపై శనివారం ఓ మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితులను తాము గమనిస్తున్నానీ.. ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. అయినా, ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్నప్పుడు క్రీడల భవిష్యత్‌ ఏముంటుందని ప్రశ్నించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్‌ నిర్వహించడం కష్టతరమని స్పష్టం చేశారు. ‘కరోనా వైరస్‌ నేపథ్యంలో ఏం జరుగుతుందో అంతా గమనిస్తున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం ఏం చెప్పలేం. అయినా, ఇప్పుడు చెప్పడానికి ఏముంది? విమానాశ్రయాలు మూతపడ్డాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు, కార్యాలయాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లలేరు. ఈ పరిస్థితి మే మధ్య వరకూ ఉంటుందనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారు. ఐపీఎల్‌ను పక్కన పెట్టండి. కాస్త ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే.. ప్రపంచంలో ఎక్కడా ఏ క్రీడలు నిర్వహించడానికి కూడా అవకాశం లేదు’ అని గంగూలీ ఘాటుగా వ్యాఖ్యానించారు. చివరగా ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణపై స్పందిస్తూ.. బీసీసీఐ అధికారులతో చర్చించి సోమవారం అప్‌డేట్‌ ఇస్తానని చెప్పారు. వాస్తవంగా మాట్లాడాలంటే.. ప్రపంచవ్యాప్తంగా జనజీవనం స్తంభించాక క్రీడలకు భవిష్యత్‌ ఎక్కడుందని ప్రశ్నించారు.