Agriculture

దాళ్వా కోతలు పెరిగాయి

దాళ్వా కోతలు పెరిగాయి

ఈసారి రబీలో రికార్డు స్థాయిలో వరి సాగు కావడంతో కోతలు ముమ్మరమయ్యాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలు లేకుంటే ఈపాటికే ధాన్యలక్ష్మి సిరులొలికించేది. కూలీల కొరత లేదు, యంత్రాలూ సిద్ధంగా ఉండటంతో కోతలు జోరందుకున్నాయి. కొన్నిచోట్ల రబీ ధాన్యం కొనుగోలులో మిల్లర్లు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు అందటంతో తక్షణమే సమస్యను పరిష్కరించాలని పౌరసరఫరాలు, మార్కెటింగ్‌ శాఖలను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు.
***ఖరీఫ్‌ ధాన్యం సేకరణ ఇలా…
ఖరీఫ్‌లో 48.10 లక్షల టన్నుల ధాన్యాన్ని 4,57,823 మంది రైతుల నుంచి సేకరించారు. దీని విలువ రూ.8755 కోట్లు ఉంటుంది. 11 జిల్లాల్లో 1702 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.
*****రబీలో ఎలా జరుగుతోందంటే…
ఇప్పటివరకు 1,295 ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. కర్నూలు, అనంతపురంలో తెరవాల్సి ఉంది. 1.63 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. వీటి విలువ రూ.299.28 కోట్లు ఉంటుంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల ప్రకారమే ధాన్యం సేకరణ జరుగుతోంది.
*****వరి సాగు ఇలా…
ఖరీఫ్‌లో 15,18,984 హెక్టార్లలో వరి సాగు లక్ష్యం కాగా 14,67,069 హెక్టార్లు సాగు అయింది. రబీలో సాగు విస్తీర్ణ లక్ష్యం 6,98,398 హెక్టార్లు కాగా అంతకుమించి రికార్డు స్థాయిలో 8,06,803 హెక్టార్లలో సాగయింది. రబీలో 60,14,189 టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు.
ఖరీఫ్‌లో హెక్టార్‌కు దిగుబడి 5,248 కిలోలు కాగా రబీలో హెక్టార్‌కు రికార్డు స్థాయిలో 7,095 కిలోలు ఉండవచ్చని భావిస్తున్నారు. తెలంగాణలో రబీలో హెక్టార్‌కు 5,928 కిలోలు దిగుబడి ఉంది. లాక్‌డౌన్‌తో రబీ కోతలకు ఎలాంటి ఇబ్బందులు లేవని వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేసి వరి కోత యంత్రాలను అవసరాలకు తగ్గట్టుగా పంపిస్తున్నారు. రాష్ట్రంలో 2,985 కంబైన్డ్‌ హార్వెస్టర్లు, 1,746 వరి రీపర్లు అందుబాటులో ఉన్నాయి. యంత్రాల అద్దె గంటకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు ఉంది. ఇంతకు మించి ఎక్కడైనా అదనంగా వసూలు చేస్తే సమీపంలోని వ్యవసాయాధికారికి లేదా 1902కి రైతులు ఫిర్యాదు చేయవచ్చు.
****రైతులకు వ్యవసాయ కమిషనర్‌ సూచనలు ఇవీ…
లాక్‌డౌన్‌ వల్ల కూలీలు వెళ్లలేని ప్రాంతాలకు సైతం హార్వెస్టర్లను తరలిస్తున్నందున రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.
ఇతర జిల్లాల నుంచి కూడా హార్వెస్టర్లను తెప్పించి పాస్‌లు ఇచ్చాం. యంత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాల్‌ రూ.1815, ఏ గ్రేడ్‌ రకం రూ.1835కి కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశాం. ఈ ధర కన్నా ఎవరూ తక్కువకు అమ్ముకోవద్దు. వరి కోతలు, ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటించండి. మాస్క్‌లు ధరించండి.
**3 కిలోల అదనంపై సీఎంకు ఫిర్యాదు…
ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు క్వింటాల్‌కు అదనంగా మూడు కిలోలు తీసుకుంటున్నట్లు కృష్ణా జిల్లా తిరువూరు రైతులు రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రక్షణ నిధి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. సాధారణంగా 17 శాతం తేమను బట్టి ధాన్యాన్ని తీసుకోవాల్సి ఉండగా 21 శాతం తేమ ఉందంటూ తరుగు తీసుకుంటున్నారని, గోనె సంచులు రైతులే తెచ్చుకోవాలంటూ మిల్లర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఫలితంగా ఒక్కో రైతు సుమారు రూ.55 వరకు నష్టపోతుండటంతో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను సీఎం ఆదేశించారు.