Food

పెద్దలకు రాగులు పెట్టండి

Raagulu For Elderly People WIll Solve Their Health Issues

వయోవృద్ధులు ప్రస్తుతం రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రాగులతో వండిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలని ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివాకర్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ కాలంలో వయోవృద్ధులు ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై నీతిఆయోగ్‌ సభ్యుడు వినోద్‌ పాల్‌, సీఈవో అమితాబ్‌కాంత్‌ నిర్వహించిన వెబినార్‌ చర్చలో ఆమె ఈ మేరకు పేర్కొన్నారు. ‘గింజలు, మొక్కజొన్న, రాగులు ఎక్కువగా తినాలి. ముఖ్యంగా రాగుల్లో ఇనుము, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యలకు చక్కటి పరిష్కారం. దీనికితోడు అన్ని ప్రాంతాల్లో దొరికే అరటి, మామిడి లాంటి తాజాపండ్లను తినొచ్చు. ఇవి మంచి యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ప్యాకెట్‌ ఆహారం తీసుకోవద్దు. రాత్రిపూట పప్పుతో చేసిన కిచిడీలో కాస్త నెయ్యి కలుపుకొని తింటే బాగా నిద్ర పడుతుంది. కేవలం బియ్యంతో కూడిన అన్నమే వండకుండా అందులో ఏదో ఒక పప్పు వేసి వండితే మంచి పోషకాలు వస్తాయి. అలాగే వయోవృద్ధులు ఈ సమయంలో తమకు తెలిసిన పోషకాహార విలువలతో కూడిన వంటల గురించి రాసిపెడితే వచ్చే తరాలకు విలువైన సంపద అందించిన వారవుతారు. ఇక పిల్లలకు చాక్లెట్లు లాంటి ప్యాకెట్‌ ఆహారం ఇవ్వొద్దు. వేసవిలోనూ చవన్‌ప్రాష్‌ను పాలతో కలిపి వాడుకోవచ్చు. దీన్ని పగటిపూట కంటే రాత్రిపూట ఉపయోగించడం మంచిది’ అని ఆమె వివరించారు.