Videos

తమిళనాట కరోనా శిక్ష బాగుంది

TamiNadu Police Throw People Violating LockDown To Ambulance With Fake COVID19 Patient

కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్నా.. పలువురు ఏమాత్రం పట్టించుకోకుండా యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వారిని అదుపు చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. వారిపై ఎంత కఠినంగా వ్యవహరించినప్పటికీ మార్పు రాకపోవడంతో పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ నిబంధనలు ఎంత కఠినతరం చేసినా ఉల్లంఘనలకు పాల్పడే వారి సంఖ్య మాత్రం తగ్గడంలేదు. తాజాగా తమిళనాడులోని తిరుపూర్‌లో ఏ పనీ లేకుండా అనవసరంగా రోడ్లపైకి వచ్చిన యువకులను స్థానిక పోలీసులు వినూత్నంగా భయపెట్టారు. ఓ వ్యక్తికి కరోనా పేషెంట్‌ మాదిరిగా దుస్తులు వేసి అంబులెన్స్‌లో పడుకోబెట్టారు. నిబంధనలు ఉల్లంఘించి రహదారిపైకి వచ్చిన యువకులను బలవంతంగా ఆ అంబులెన్స్‌లోకి ఎక్కించారు. దీంతో లోపలి వ్యక్తిని కరోనా బాధితుడిగా భావించి భయపడిన సదరు యువకులు అంబులెన్స్‌ నుంచి బయటపడేందుకు పడిన తంటాలు పలువురికి నవ్వు తెప్పిస్తున్నాయి. ఆకతాయిలను కొట్టకుండా ఇలా పోలీసులు తీసుకున్న నిర్ణయంపై పలువురి నుంచి ప్రశంసలు వస్తుంటే, ‘భయపడి జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరు?’ మరికొందరు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఇందుకు ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.