DailyDose

లాక్‌డౌన్ కారణంగా గ్యాంగ్ రేప్-తాజావార్తలు

Resting Women Gang Raped Due To LockDown-Telugu Breaking News Roundup Today

* తమిళ స్టార్‌ సూర్య సినిమాలు చిక్కుల్లోపడ్డాయి. ఆయన ఇకపై నిర్మించే సినిమాల్ని థియేటర్‌లో విడుదల చేయమని థియేటర్‌ యజమానులు స్పష్టం చేశారు. ఆయన సతీమణి, నటి జ్యోతిక నటించిన సినిమా ‘పోన్ మగల్ వందల్‌’. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్య సినిమాను నిర్మించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయడం లేదని, మే మొదటి వారంలో నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయబోతున్నామని దర్శక, నిర్మాతలు చెప్పారు. అమెజాన్‌ ప్రైమ్‌లో సినిమా అందుబాటులోకి రాబోతోంది. దీంతో తమిళనాడు థియేటర్‌ యజమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘పోన్ మగల్ వందల్‌’ సినిమాను నేరుగా ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయబోతున్నారని తెలిసి షాక్‌ అయ్యాం. ఎప్పుడైనా సరే సినిమాను ముందు థియేటర్‌లో విడుదల చేయాలి, ఆపై మిగిలిన ఫ్లాట్‌ఫాంలలో అందుబాటులోకి తీసుకురావాలి. మేం నిర్మాతల్ని కలిసి మాట్లాడం. తమ నిర్ణయాన్ని మార్చుకోమని కోరాం.. కానీ వారు మా మాట వినలేదు. అందుకే.. భవిష్యత్తులో వారి బ్యానర్‌పై తీసే ఏ సినిమాను కూడా థియేటర్‌లో ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నాం’ అని తమిళనాడు థియేటర్‌ అండ్‌ మల్టీప్లెక్స్‌ యజమానుల సంఘం ప్రధాన కార్యదర్శి పన్నీర్‌ సెల్వన్‌ మీడియాతో చెప్పారు.

* కరోనా వైరస్‌ మహమ్మారిని తట్టుకునే శారీరక శక్తి(రోగనిరోధక శక్తి) భారతీయులకు లేకున్నా వారి మానసిక శక్తే వారిని రక్షిస్తుందని చైనా వైద్య నిపుణులు అంటున్నారు. తాజాగా చైనాలోని ప్రముఖ వైద్య నిపుణుడు ఝాంగ్‌ వెన్‌హాంగ్‌ భారత్‌లో ఉన్న చైనా విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంలో ‘భారత్‌లో మాస్కుల్లేకుండా ప్రజలు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడం చూశాను. కొవిడ్‌-19ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి లేకున్నా మానసిక స్థైర్యం భారతీయులకు ఉంది’ అని విద్యార్థులతో అన్నారు.

* దేశంలో మొబైల్‌ ఫోన్లు వినియోగిస్తున్న వారిలో సుమారు 4 కోట్ల మంది చేతుల్లో వచ్చే నెలాఖరు నాటికి అవి కనిపించకపోవచ్చని పరిశ్రమ సమాఖ్య ఐసియా (ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌) అంచనా వేస్తోంది. హ్యాండ్‌సెట్లలో తలెత్తే లోపాలు, బ్రేక్‌డౌన్ల వల్ల అవి ఉపయోగపడే స్థితిలో ఉండకపోవచ్చని తెలిపింది. మొబైల్‌ ఫోన్లు, విడి భాగాల విక్రయాలపై లాక్‌డౌన్‌ ఆంక్షలు ఇలాగే కొనసాగితే ఆ పరిస్థితి తలెత్తే అవకాశం లేకపోలేదని వివరించింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో సరఫరా చెయిన్‌లో మొబైల్‌ ఫోన్ల విడిభాగాలు లేకపోవడం, కొత్త హ్యాండ్‌సెట్ల విక్రయాలపై ఆంక్షలుండటంతో ప్రస్తుతం 2.5 కోట్ల మందికి పైగా వినియోగదారుల ఫోన్లు నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొంది. ‘ప్రభుత్వం నిత్యావసర వస్తువులు, సేవల విక్రయాలకు మాత్రమే అనుమతులు ఇచ్చి 5 వారంలోకి అడుగుపెట్టాం. టెలికాం, ఇంటర్నెట్‌, బ్రాడ్‌కాస్ట్‌, ఐటీ సేవల కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చిన కేంద్రం ఆ సేవలు పొందేందుకు అవసరమైన మొబైల్‌ పరికరాల విక్రయాలకు మాత్రం అనుమతి ఇవ్వలేద’ని ఐసియా వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 85 కోట్ల మొబైల్‌ ఫోన్లు ఉన్నాయని, సరాసరిన నెలకు 2.5 కోట్ల కొత్త మొబైల్‌ ఫోన్ల విక్రయాలుంటాయని ఐసియాలో సభ్యులుగా ఉన్న యాపిల్‌, ఫాక్స్‌కాన్‌, షియోమి వంటి సంస్థలు తెలిపాయి. అత్యవసర వస్తువుల జాబితాలో మొబైల్‌ ఫోన్లను కూడా చేర్చాలంటూ ఇప్పటికే పలుమార్లు ప్రధానితో సహా ప్రభుత్వాన్ని కోరామని ఐసియా ఛైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ వెల్లడించారు. మొబైల్‌ పరికరాలతో పాటు ల్యాప్‌టాప్‌లను కూడా అత్యవసర వస్తువుల జాబితాలో చేర్చండంటూ హోం శాఖకు ఇప్పటికే ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. అయితే ఇంకా ఆ శాఖ నుంచి నిర్ణయం వెలువడాల్సి ఉంది.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నోటి దురుసుతనం అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన గురువారం చేసిన ఓ వ్యాఖ్య పెద్ద దుమారమే రేపింది. ఆయన సొంత పాలకవర్గంలోని ఉన్నతాధికారులు సైతం దీనిపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అది కేవలం వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు అని సంజాయిషీ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇక ట్రంప్‌పై గుర్రుగా ఉండే అక్కడి కొన్ని మీడియా ఛానళ్లు దీన్ని పతాక వార్తగా ప్రచురించాయి. కరోనా వైరస్‌ను చంపడానికి క్రిమినాశక రసాయనాలు (డిసిన్‌ఫెక్టెంట్‌)లను రోగుల శరీరంలోకి ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలంటూ ట్రంప్‌ ఓ ప్రమాదకర సూచన చేసిన విషయం తెలిసిందే. అతినీలలోహిత (యూవీ) కాంతిని చొప్పించాలని కూడా సలహా ఇచ్చారు. దీనిపై అమెరికా ఆరోగ్య నిపుణులు మండిపడ్డారు.

* లాక్‌డౌన్‌ కారణంగా కాలినడకన సొంతూరికి వెళుతూ రాత్రి ఓ పాఠశాల ఆవరణలో విశ్రమించిన మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు ముగ్గురు నిందితులు. రాజస్థాన్‌ రాష్ట్రం సవాయ్ మాధోపూర్‌ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపుర్‌కు చెందిన ఓ 40 ఏళ్ల మహిళ లాక్‌డౌన్‌ నేపథ్యంలో నెల రోజులుగా సవాయ్ మాధోపూర్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక చేసేదేమిలేక అక్కడి నుంచి సొంతూరైన జైపుర్‌కి కాలినడకన బయలుదేరింది. గురువారం రాత్రి మాధోపూర్‌ జిల్లా బాటోడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విశ్రమించిన తనపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డట్లు ఆ మహిళ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న రిషికేశ్‌ మీన, లఖన్‌ రేగర్‌, కమల్‌ ఖర్వాల్‌లను అరెస్టు చేశారు. ఆ ముగ్గురిని కోర్టులో హాజరు పరుచనున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.

* కరోనా మహమ్మారి రాష్ట్రంలో రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మికం సహా జనం ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్న ఎలాంటి సమావేశాల నిర్వహణకు జూన్‌ 30 వరకు అనుమతించొద్దని అధికారుల్ని ఆదేశించింది. అలాగే రోడ్లపై జనం కూడా గుమిగూడొద్దని విజ్ఞప్తి చేసింది. జూన్‌ 30 వరకు ప్రతిఒక్కరూ ఈ నిబంధనల్ని పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఉత్తర్‌ప్రదేశ్‌ కార్మికుల్ని వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేస్తామని ఆదిత్యనాథ్‌ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

* పశ్చిమ్‌ బెంగాల్‌ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోందని రాష్ట్రంలో పర్యటిస్తున్న కొవిడ్‌-19 అంతర్‌ మంత్రిత్వ కేంద్ర బృందాలు అంటున్నాయి. సమాచారం అడిగినా ఇవ్వడం లేదని, లాజిస్టిక్స్‌ సహాయం చేయడం లేదని విమర్శించాయి.

* దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహించామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి అన్నారు. దీంతో పాటు నిర్వహించిన పరీక్షల్లో తేలిన పాజిటివ్‌ కేసుల రేటు కూడా రాష్ట్రంలో తక్కువగా ఉందని చెప్పారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి 10 లక్షల మందికి దేశంలో సగటున 418 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తుండగా.. రాష్ట్రంలో ఆ సంఖ్య 1,147గా ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 61,266 మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. దీని ప్రకారం పాజిటివ్‌ కేసుల నమోదు రేటు 1.66 శాతంగా ఉందని వివరించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇదే తక్కువన్నారు. ఈ విషయంలో జాతీయ సగటు 4.23 శాతంగా ఉండగా.. మహారాష్ట్రలో 7.16గా ఉందని తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 171 మంది కోలుకున్నారని, ఇవాళ ఒక్కరోజే 26 మంది డిశ్చార్జి అయ్యారని వెల్లడించారు.

* శ్రీకాకుళం జిల్లాలో తొలిసారి మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్లీ నుంచి వచ్చిన ద్వారా జిల్లాలో కరోనా కేసులు వచ్చినట్టు కలెక్టర్‌ జె. నివాస్‌ తెలిపారు. పాతపట్నం మండలానికి చెందిన ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా రావడంతో మండలంలోని 18 గ్రామాల్లో కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఆయా గ్రామాల్లో నిత్యావసరాలు, తాగునీరు, మందులు డోర్‌ డెలివరీ చేస్తామనీ, ఎవరూ బయటకు రావొద్దని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు.

* ఉపాధి కోసం దుబాయ్‌కి వెళ్లిన జగిత్యాల జిల్లాకు చెందిన వందలాది మంది యువకులు లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. పనులు లేక, వారిపై ప్రభుత్వ ప్రత్యేక పర్యవేక్షణ లేక ఇబ్బందులు పడుతున్నతీరును సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో ఇరుకు గదుల్లో దుర్భర జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పక్కపక్క గదుల్లోనే కారోనా పాజిటివ్‌ వ్యక్తులున్నా తమపై అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని భయాందోళన చెందుతున్నారు. తమను స్వదేశం తీసుకుపోవడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈ సందర్భంగా కోరారు.