NRI-NRT

కరోనాకు ఇంకా మందు లేదు-నివారణ ఒక్కటే మార్గం

AAPI President Yarra Suresh Reddy On Indian Origin Doctor Deaths In USA

అమెరికాలో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తోంది. ఈ నేపధ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయుల ప్రస్తుత పరిస్థితులపై అమెరికాలోని భారతీయుల వైద్యుల సంఘం (AAPI) అధ్యక్షుడు డా. యర్రా సురేష్ రెడ్డి TNILIVEకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో పలు విషయాలు వెల్లడించారు. చికాగోలో ప్రముఖ రేడియాలజిస్ట్ గా సేవలందిస్తున్న డా. సురేష్ రెడ్డి వరంగల్ కు చెందినవారు. లక్ష మంది సభ్యులుగా ఉన్న భారతీయ వైద్యుల సంఘానికి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. అమెరి కాలోని కరోనా విజృంభణ, భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలు , వాటి పరిష్కార మార్గాల గురించి ఆయన మాటల్లోనే…

అమెరికాలో ఉన్న ప్రతి ఏడుగురు వైద్యుల్లో ఒకరు భారతీయుడు …. ప్రతి ఏడుగురు భారతీయ వైద్యుల్లో ఒకరు తెలుగు వారు . ప్రస్తుతం కరోనా నివారణ లో అమెరికాలో ఉన్న మన వైద్యులు ఆ వ్యాధి పై పెద్ద యుద్ధాన్నే చేస్తున్నారు. రాత్రింబవళ్ళు ఆసుపత్రుల్లోనే గడుపుతూ కరోనా భాదితులకు సేవలందిస్తున్నారు. ఈ పోరాటం లో చాలా మంది వైద్యులకు కరోనా వ్యాధి సోకింది. ప్రియా కన్నా అనే భారతీయ వైద్యురాలు మృతి చెందారు. మరొక నలుగురు వైద్యుల పరిస్థితీ ఆందోళనకరంగా ఉంది. దాదాపు 70 మంది వైద్యులు కరోనా బారిన పడి కోలుకుంటున్నారు.

*** నలుగురు భారతీయ వైద్యులు మృతి
ఇప్పటివరకు కొరోనా సోకి నలుగురు భారతీయ సంతతి వైద్యులు మరణించినట్లు తమకు సమాచారం ఉందని సురేష్‌రెడ్డి తెలిపారు. కరోనాకు మందు ఇంకా రాలేదని, నివారణ ఒక్కటే మార్గమని ఆయన సూచించారు.

*** “క్లోరోక్విన్” కొంతవరకు పని చేస్తుంది
మలేరియా వైరస్ కు, కరోనా వైరస్ కు దగ్గర సంబంధం ఉన్నట్లు ఇటీవల అమెరికాలో జరిగిన వివిధ పరిశొధనలలో వెల్లడయ్యింది. దీనితో అధ్యక్షుడు ట్రంప్ భారత్ నుండి క్లోరోక్విన్ మాత్రలను పెద్ద ఎత్తున అమెరికాకు రప్పించారు. కరోనా వ్యాధి ప్రారంభ దశలో ఈ మాత్రలు కొంతవరకు పని చేస్తున్నాయి. అమెరికాలో కరోనా భాధితులకు మిగిలిన మందులతో పాటు వీటిని కూడా అందిస్తున్నారు.

*** ప్లాస్మా చికిత్సలో పురోగతి
అమెరికాలో కరోనా వ్యాధి నివారణకు రాత్రింబవళ్ళు వైద్యులు, శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో విస్తృతమైన ప్రయోగాలు చేస్తున్నారు. వీటి ఫలితాలు కొద్ది రోజుల్లోనే ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం కరోనా భాధితులకు ప్లాస్మా చికిత్స బాగా పనిచేస్తోంది. కరోనా వ్యాధి సోకి కోలుకున్న వ్యక్తుల నుండి రక్తాన్ని సేకరించి దానిలో ఉన్న ప్లాస్మాను కరోనా సోకిన వ్యక్తులకు అందించినప్పుడు వారు త్వరగా కోలుకుంటున్నారు. దీనితో ప్లాస్మా చికిత్స పై వైద్యులందరం దృష్టి పెట్టాం. కరోనా సోకి కోలుకున్న వారిని గుర్తించి ప్లాస్మాను సేకరించే కార్యక్రమాన్ని దాదాపు ప్రతి ఆసుపత్రి లో చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

*** భారతీయ వైద్యులకు శిక్షణా తరగతులు
భారతీయ వైద్య సంఘం (AAPI) ఆధ్వర్యంలో కరోనా చికిత్స చేస్తున్న వైద్యులకు వారానికి రెండు సార్లు వెబ్ నార్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం. ప్రపంచంలో ఉన్న వైద్యులందరూ ఈ వెబ్ నార్ లో పాల్గొనే విధంగా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం కరోనా వ్యాధికి చికిత్స చేయడం వైద్యులకు , ఇతర సిబ్బందికి ఒక సవాల్ వంటిది. వారిలో ఆత్మ స్తైర్యాన్ని నింపడానికి వివిధ మతాలకు చెందిన మత గురువులతో ఆధ్యాత్మిక ప్రసంగాలు ఆన్ లైన్ లో ఇప్పిస్తున్నాం. యోగా, మెడిటేషన్ లో శిక్షణ కూడా ఇప్పిస్తున్నాం. భారతీయ ఆధ్యాత్మిక గురువులు రవి శంకర్ , జగ్గి వాసుదేవ్ తదితరులతో ప్రసంగాలు ఇప్పిస్తున్నాం. అమెరికాలోని వివిధ ఆసుపత్రుల్లో పని చేస్తున్న భారతీయ వైద్యులకు అవసరమైన మాస్క్ లు , ఇతర పరికరాలను అందిస్తున్నాం. దీని కోసం లక్ష డాలర్లతో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశాం. జూనియర్ వైద్యులకు కూడా శిక్షణా తరగతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. వైద్య సలహాలు అందించడం కోసం 20 మంది వైద్యులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం. ఈ హెల్ప్ లైన్ 24 గంటలూ పనిచేస్తుంది.

*** భారత అంబసీతో సమన్వయం
అమెరికాలో ఉన్న భారత రాయబార కార్యాలయం తోనూ , రెడ్ క్రాస్ వంటి సంస్థలతోనూ కలిసి పని చేస్తున్నాం. డాక్టర్లకు అవసరమైన ఇమ్మిగ్రేషన్ సమస్యలను పరిష్కరిస్తున్నాం. కరోనా చికిత్సలో పాల్గొంటున్న భారతీయ జూనియర్ వైద్యులకు గ్రీన్ కార్డ్ లు ఇవ్వమని అమెరికా ప్రభుత్వాన్ని కోరాం. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల తల్లిదండ్రులకు , పర్యాటకులుగా వచ్చి ఇక్కడ చిక్కుకున్న వారికి, భీమా సౌకర్యం లేనివారికి, విద్యార్ధులకు అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించే ఏర్పాటు చేశాం . అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు మిగిలిన వారితో పోలిస్తే కరోనా సోకడం చాలా తక్కువ. వారిలో ఉన్న రోగ నిరోధక శక్తే ఇందుకు కారణం. దీనితో పాటు మన వారు శుభ్రత విషయంలోనూ, కరోనా నివారణ చర్యలను ఖచ్చితంగా పాటిస్తారు. 70 ఏళ్ళు పైబడిన వారు చాలా జాగ్రత్తగా ఉండమని, ఇతర సలహాలను మా సంఘం ద్వారా అందిస్తున్నాం. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఎవరైనా వైద్య సహకారం కావలసిన పక్షం లో మా హెల్ప్ లైన్ ను సంప్రదించ వచ్చునని డా. యర్రా సురేష్ రెడ్డి తెలిపారు.