ScienceAndTech

ఈ పెయింట్‌తో ఏసీలు అక్కర్లేదు

రాష్ట్రంలో ఎండ‌లు మండిపోతున్నాయి. క‌రోనా కార‌ణంగా జ‌న‌మంతా ఇండ్ల‌కే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ వేడి ఉక్క‌పోత భ‌రించ‌లేక‌పోతున్నారు. కాస్త స్థితిమంతులైతే ఇంట్లో ఏసీలు పెట్టుకుంటున్నారు. మామూలు జ‌నం కూల‌ర్ల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. కానీ ఈ శీత‌ల యంత్రాలేవీ అవ‌స‌రం లేకుండానే ఇల్లు చ‌ల్ల‌గా ఏసీ వేసిన‌ట్లుగా ఉంటే ఎలా ఉంటుంది? అదెలా సాధ్య‌మ‌నుకుంటున్నారా? సాధ్య‌మేనంటున్నారు అమెరికాకు చెందిన కొంద‌రు మెటీరియ‌ల్ సైంటిస్టులు. వారు తాజాగా త‌యారుచేసిన మ‌ల్టీలేయ‌ర్ పెయింట్ ఇండ్ల‌కు వేస్తే చాలు ఏసీలు బిగించుకున్న‌ట్లే అంటున్నారు. ఈ పోర‌స్ పెయింట్స్‌లో ఉండే బాహ్య‌పొర పెయింట్ సూర్య‌కాంతిని శోషించుకుంటుంది. లోప‌లి పొర‌లో ఉన్న పెయింట్ సూర్య‌కిర‌ణాల‌లోని అతినీల‌లోహిత కిర‌ణాల‌ను వికిర‌ణం చెందిస్తుంది. దాంతో భ‌వనం ఉప‌రిత‌లం వేడి 15.6 డిగ్రీ సెంటీగ్రేడ్‌క‌న్నా మించ‌కుండా చూస్తుంది. దాంతో ఇంట్లో చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని ఈ పెయింట్ రూప‌క‌ల్ప‌న‌లో పాలుపంచుకున్న న్యూయార్క్‌లోని కొలంబియా యూనివ‌ర్సిటీకి చెందిన యిజున్ చెన్ తెలిపారు. ఈ పెయింట్ పూర్తిగా ప‌ర్యావ‌ర‌ణహిత‌మైన‌ద‌ని ఆయ‌న తెలిపారు. ఈ పెయింట్ న‌లుపు, నీలం, ఎరుపు, ప‌సుపు రంగుల్లో ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఈ పెయింట్ వాడ‌కం పెరిగితే ఏసీలు, కూల‌ర్ల వాడ‌కం త‌గ్గి విద్యుత్ వినియోగం కూడా త‌గ్గుతుంద‌ని ఆ రకంగా ప‌ర్యావ‌ర‌ణానికి మేలు జ‌రుగుతుంద‌ని యిజున్ చెన్ పేర్కొన్నారు. భ‌వ‌నాల‌తోపాటు ఈ పెయింట్ వాహ‌నాలు, డాటా సెంట‌ర్లను చ‌ల్లగా ఉంచేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ఆయ‌న చెపుతున్నారు. ఈ పెయింట్ 500 మైక్రోమీట‌ర్ మందం ఉంటుంద‌ట‌. ఈ పెయింట్ వాణిజ్య‌ప‌రంగా అందుబాటులోకి వ‌స్తే ఏసీలు, కూల‌ర్లు కొనేవారే ఉండ‌రేమో!