ScienceAndTech

భారత్ బాగా ఖర్చు పెడుతోంది

భారత్ బాగా ఖర్చు పెడుతోంది

ప్రపంచ దేశాల సైనిక వ్యయం గత పదేళ్లలో 2019లోనే భారీగా పెరిగిందని ఓ అధ్యయనం తేల్చింది. ఆయుధాల కోసం అత్యధికంగా నిధులు వెచ్చించిన మొదటి మూడు దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆసియాలోని చైనా, భారత్‌ ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సిప్రి) అనే సంస్థ ఓ నివేదికను వెలువరించింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం, కరోనా వ్యాప్తి కారణంగా మున్ముందు సైనిక వ్యయం తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేసింది. 2019లో ప్రపంచ దేశాల సైనిక వ్యయం 1,917 బిలియన్‌ డాలర్లు. 2018తో పోలిస్తే ఇది 3.6 శాతం ఎక్కువ.

మొత్తమ్మీద టాప్‌–5 దేశా(అమెరికా, చైనా, భారత్, రష్యా, సౌదీ అరేబియా)ల వ్యయం 62 శాతంగా ఉంది. సైనిక వ్యయం ఎక్కువచేస్తున్న దేశాల్లో అమెరికా టాప్‌లో ఉండగా, చైనా, భారత్‌ 2, 3 స్థానాల్లో, రష్యా నాల్గో స్థానంలో నిలిచాయి. ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో అమెరికా వాటా 38 శాతం. 2019లో అమెరికా సైనిక వ్యయం అంతకు ముందు ఏడాది కంటే 5.3 శాతం పెరిగి 732 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. 2019లో చైనా సైనిక వ్యయం 261 బిలియన్‌ డాలర్లు కాగా, 2018తో పోలిస్తే ఇది 5.1శాతం ఎక్కువ. అదే భారత్‌ విషయానికొస్తే 6.8 శాతం పెరిగి 71.1 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఆసియాలో శక్తివంతమైన జపాన్‌ 47.6 బిలియన్‌ డాలర్లు, దక్షిణకొరియా 43.9 బిలియన్‌ డాలర్లు సైనికపరంగా వెచ్చించాయని సిప్రి తెలిపింది.