Movies

సాహితీ సంచలనం…ఆరుద్ర

Remembering Legendary Veteran Writer Arudra-సాహితీ సంచలనం...ఆరుద్ర

ఆరుద్ర 13వ ఏట రాసిన తొలి కవిత “నాకలలో..”1939లో “చిత్రగుప్త” వారపత్రిక ద్వారా వెలుగుచూసింది.ఆ తర్వాత రెండవ ప్రపంచ యుద్ధకాలంలో విశాఖపట్నం పై బాంబుల దాడిని నిరసిస్తూ “లోహవిహంగాలు” కవిత వ్రాసారు.1948లో రజాకార్ల సంబంధించిన వార్తా కధనానికి స్పందించి “తెలంగాణా” పేరుతో ఓ కావ్యాన్ని వ్రాసారు. శ్రీశ్రీ టిప్పణి రాస్తూ దానికి “త్వమేవాహం” అనే పేరు సార్ధకంగా ఉంటుందని సూచించారు. 1960లో “త్వమేవాహం” ను పరిచయం చేస్తూ కాటూరి వేంకటేశ్వరరావు దాని పేరును “సినీవాలి” గా పొరబడ్డం వలన ఆరుద్ర ఏకంగా “సినీవాలి” కావ్యాన్ని రాసారు. సినీవాలి అంటే అమావాస్యనాటి అరుదైన చంద్రరేఖ అని అర్ధం. (ఇంతవరకు నేను సినీవాలి అంటే సినిమాలపై వాలిపోయి లాంటిదేమో ననుకున్నాను. బుద్ది.. బుద్ది!). ఆరుద్ర ఇతర రచనలలో “గాయాలు – గేయాలు”, “కూనలమ్మ పదాలు”, “వేమన్న వేదం”, “ఇంటింటి పద్యాలు”, “పైలా పచ్చీసు”, “అరబ్బీ మురబ్బాలు” “కె.రా.లక్ష్మి త్రిశతి” మొదలైనవి ప్రసిద్ధాలు.”వెన్నెల – వేసవి”, “దక్షిణ వేదం”.. ఆయన అనువాద కావ్యాలు. “సాలభంజిక, “రాదారి బంగళా”, “శ్రీకృష్ణ దేవరాయ”, “కాటమరాయ” మొదలైనవి ఆయన నాటకాలు.”నేచెప్పానుగా”, “ఊరు ఊరుకుంది”, డిటెక్టివ్ కధలు (ఏడు సంపూటాలు), “పలకల వెండి గ్లాసు” డిటెక్టివ్ నవల తో పాటు మరో ఏడు అపరాధ పరిశోధక నవలలు, “రాముడికి సీత ఏమౌతుంది?”, “గుడిలో సెక్స్” సంచలనాత్మక పరిశోధన వ్యాసాలు … ఇవన్నీ ఆరుద్ర కలాన్ని హలంగా మార్చి చేసిన సాహిత్య సేద్య పంటలే!

ఇవన్నీ ఒక ఎత్తు… తెలుగు సాహిత్య చరిత్రను “సమగ్రాంధ్ర సాహిత్యం” పేరుతో రెండు దశలుగా రచించటం మరోఎత్తు. ముందుగా 12 భాగాలుగా వ్రాయగా ఎమెస్కో వారు ప్రచురించారు. ఆతరువాత ‘కుంఫిణీ యుగం’ నుంచి ‘ఆధునిక యుగం’ వరకు మరో ఐదు సంపుటాలను రచించి, మొదటి 12 భాగాలను 8కి కుదించి వాటికి ఈ ఐదు కలిపి మొత్తం 13 భాగాలను ప్రజాశక్తి ప్రచురణలద్వారా తెలుగు జాతికి అందాయి. ఈ “సమగ్రాంధ్ర సాహిత్యం” ఆరుద్ర తెలుగు జాతికిచ్చిన మహత్తర కానుక. ఆరుద్ర నాట్యశాస్త్రం పై పరిశోధనా వ్యాసాలు, చదరంగం పై ప్రామాణిక గ్రంధం వ్రాసారు.

ఆరుద్ర అందుకున్న పురస్కారాలు:: 1974 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి ‘ఉత్తమ విమర్శక’, 1985 లో తెలుగు విశ్వ విద్యాలయం వారి ‘ ఉత్తమ పరిశోధక’, 1987లో వీరు వ్రాసిన “గురజాడ గురు పీఠం” గ్రంధానికీ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, 1985లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేటును ఆపై ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు “కళా ప్రపూర్ణ” తో సత్కరించారు. వీరు వ్రాసిన సినీమినీ కబుర్లకు నంది అవార్డు, పెళ్ళిపుస్తకం లోని “శ్రీరస్తు శుభమస్తు” పాటకు ” మనస్విని ఆత్రేయ” వారి తొలి పురస్కారం లభించాయి.

ఆరుద్ర ఉద్యోగ ప్రస్ధానంలో తొలి అడుగు బొంబాయిలోని “రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్” లో గుమాస్తాగిరి. ఆ తర్వాత ‘ఆనందవాణి’ పత్రికా సంపాదకుడిగా, విశాఖలో హార్బర్ గుమాస్తాగా, లైకోగ్రాఫ్ స్టూడియోలో ఫోటోగ్రాఫర్ గా వివిధ ఉద్యోగాలను వెలిగించినా ఎక్కడా ఇమడలేక పోయారు. బాల్యమిత్రుడు బుచ్చికొండ సహాయం మళ్ళీ మద్రాస్ చేరి “ఢంకా”పత్రికలో ప్రూఫ్ రీడర్ గా ఉద్యోగించారు. చాలీ చాలని జీతంతో తంటాలు పడుతూనే న్యాపతి నారాయణమూర్తి గారు ఆరంభించే పత్రికలో కొలువుకోసం తరచూ ఆయనను కలిసేవారు. పత్రిక ఆరంభం ఆలస్యమవసాగింది. ఈలోగా ఆరుద్ర ప్రతిభను గుర్తించిన న్యాపతి నారాయణమూర్తి గారు ఆరుద్రను తనకు బాగా పరిచయమున్న రాజరాజేశ్వరీ కంపెనీ వారికి పరిచయం చేసి కధావిభాగంలో ఉద్యోగం ఇప్పించారు. ‘అలా 1948లో తానెన్నడూ ఊహించని , ఆశించని సినీరంగ జీవితాన్ని ఆరంభించారు’. రాజరాజేశ్వరీ ఫిలిం కంపెనీ అధినేత దర్శక నిర్మాత కడారు నాగభూషణం. ఆయన అప్పుడు సౌదామిని అనే జానపద చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో రూపొందిస్తున్నారు. జానపద సాహిత్యాన్ని మధించిన ఆరుద్ర కధారచనలో ఎంతో తోడ్పడటమే కాకుండా ఆ తదుపరి సహాయ దర్శకునిగా మారి అవసరమైనప్పుడు సంభాషణా రచనలో సహకరిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. అలా ఆనాటి ప్రముఖ కధానాయకుడు నాగయ్య దృష్టిలో పడి “బీదలపాట్లు” చిత్రానికి కొన్ని పాటలు వ్రాసే అవకాశం పొందారు. “ఓ చిలకరాజా నీ పెళ్ళెపుడయ్యా” అన్న పాట ఆరుద్ర మొదటి సినిమా పాట. బీదలపాట్లు తర్వాత కమల్ ఘోష్ దర్శకత్వంలో వచ్చిన “పరోపకారం ” చిత్రానికి మాటలు వ్రాసారు ఆరుద్ర. సినీరంగంలో పాటల రచయితగా, అనువాద చిత్ర రచయితగా పెరు పొందిన తన మేనమామ శ్రీశ్రీ ఆరుద్ర పై అభిమానంతో రాజ్ కపూర్ “ప్రేమ లేఖలు” చిత్రానికి మాటలు పాటలు వ్రాసే అవకాశం ఇప్పించారు.అంతే! ఇంటింట మారు మ్రోగిన ప్రేమలేఖలు పాటలతో ఆరుద్ర వెనుతిరిగి చూసుకోలేదు. దాదాపు 2500పాటలు వ్రాసిన ఆరుద్ర పాటలు రాసిన చివరి చిత్రం “పెళ్ళికొడుకు” (1996). ఆపై సినిమా పాటలపై విముఖతతో పాటలు వ్రాయలేదు. కంటిచూపు మందగించటం కూడా ఆయనను లొంగదీసుకుంది. 4-6-1998న ఆరుద్ర స్వర్గస్తులైనారు.

*ఆరుద్ర వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూస్తే ఆయనను ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరు. ఒకరు మేనమామ శ్రీశ్రీ. రెండవవారు భార్య కె.రామలక్ష్మి. దురదృష్టవశాత్తు వీరిద్దరి మధ్య చిక్కుకున్నాడు ఆరుద్ర. “అబ్బీ! నీ పెళ్ళెప్పుడు? ఎందుకాలస్యం చేస్తావు” అని అడిగాడు. ఆరుద్ర అప్పటికీ ఏమి నిర్ణయించుకోలేదు. కానీ కె.రామలక్ష్మి పట్ల ఆరుద్రకు గల ఆసక్తి శ్రీశ్రీకి తెలుసు. “అందం లేనిది, చదువుకున్నది, నీతో స్విన్ బర్న్ ని సారోయిన్ ని చర్చించే తెలివి ఎక్కువ గల స్త్రీ సుఖం ఇవ్వదు అబ్బీ ! ఆలోచించి అడుగేయ్” అన్నారు. నిజంగానే రామలక్ష్మికి అప్పటి దాకా వంటావార్పు కాదుకదా ఇంటిపని ఏమిరాదు. ఇక రామలక్ష్మి దృష్టిలో శ్రీశ్రీ పై కోపంలేదు. కానీ గౌరవం లేదు. “నా సాహిత్యం చదవండి! మెచ్చుకోండి! కాని నా వ్యక్తిగత జీవితంలోనికి రాకండి అనే శ్రీశ్రీ ఆరుద్రపై ప్రభావం చూపటం ఏమిటి? ఇదీ చూచాయగా…
* ఆరుద్ర రామలక్ష్మిని వివాహం చేసుకుంటున్నానని శ్రీశ్రీ కిచెప్పారు. కాస్త బాధగానే ఆనందం వ్యక్తం చేసారు శ్రీశ్రీ. ఇటువంటి వాతావరణంలో ఆరుద్ర రామలక్ష్మిల రిజిష్టర్ పెళ్ళికి సాక్షి సంతకం చేసారు శ్రీశ్రీ. ఇది పెళ్ళిపత్రాలపై సాక్షి సంతకం పెట్టటం గాక ప్రేమ అనే భావనకు శ్రీశ్రీ సాక్షీగా నిలిచాడని ఆరుద్ర భావించారు. ఈ జంటకు ఐదుగురు కుమార్తెలు.వారు విజయ, త్రివేణి, కవిత, లలిత, వాసంతి