Business

టెక్సాస్‌లో భారత సంతతి ఇంజినీర్ కరోనా కుంభకోణం

Texas Based Indian Origin Engineer Shashank Rai Charged With COVID19 Fraud

కరోనా మహమ్మారితో కుదేలైన చిన్న పరిశ్రమలకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన రుణాలను మోసపూరితంగా పొందాలనుకున్నాడన్న అభియోగాలతో భారత సంతతి ఇంజినీర్​పై కేసు నమోదు చేసింది అమెరికా ప్రభుత్వం.రెండు బ్యాంకుల నుంచి సుమారు 10 మిలియన్​ డాలర్లకుపైగా రుణాలు తీసుకునేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించింది. అమెరికాలోని భారత సంతతి ఇంజినీర్​ను ప్రభుత్వ సంస్థలను మోసం చేసేందుకు ప్రయత్నించాడన్న అభియోగాలపై అరెస్ట్​ చేశారు పోలీసులు. కరోనాతో కుదేలైన చిన్న పరిశ్రమలకు సాయం అందించే పథకం ద్వారా… తప్పుడు సమాచారంతో మోసపూరితంగా 10 మిలియన్​ డాలర్లకుపైగా రుణాలు పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. కరోనా వైరస్​ ఎయిడ్​, రిలీఫ్​, ఎకనామిక్​ సెక్యూరిటీ (సీఏఆర్​ఈఎస్​) చట్టం కింద చిన్న పరిశ్రమల పరిపాలన విభాగం (ఎస్​బీఏ) అనుమతి పొందిన రుణాలు పొందేందుకు శశాంక్​ రాయ్​ అనే ఇంజినీర్​ రెండు బ్యాంకులకు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. తన సంస్థలో 250 మంది సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు అప్పు ఇవ్వాలని కోరాడని.. నిజానికి అతను చెప్పిన సంస్థ, ఉద్యోగులు ఎవరూ లేరని తేలినట్లు వెల్లడించారు. కోర్టుకు సమర్పించిన పత్రాల ప్రకారం.. మొదటి బ్యాంకుకు సమర్పించిన దరఖాస్తులో తన సంస్థలోని 250 మంది ఉద్యోగులకు నెలకు సగటున 4 మిలియన్​ డాలర్లు చెల్లించాలని, అందుకు 10 మిలియన్​ డాలర్ల రుణం మంజూరు చేయాలని కోరాడు. రెండో బ్యాంకు దరఖాస్తులో సుమారు 3 మిలియన్​ డాలర్లు రుణం కావాలని అభ్యర్థించాడు. అందుకు తన సంస్థలోని 250 మందికి నెలకు సగటున 1.2 మిలియన్​ డాలర్లు వేతనాలు చెల్లించాలని చూపించాడు. రాయ్​పై.. మోసం, బ్యాంకు మోసం, ఆర్థిక సంస్థకు, ఎస్​బీఏకు తప్పుడు సమాచారం ఇవ్వటం వంటి అభియోగాలు మోపారు పోలీసులు.