DailyDose

ఏపీలో కొత్తగా 85కేసులు-TNI బులెటిన్

TNILIVE Corona Bulletin - 85 New Cases In Andhra

* దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 7,466 కేసులు, 175 మరణాలు సంభవించాయి. ఫలితంగా కరోనా మరణాల్లో చైనాను భారత్ అధిగమించింది. చైనాలో ఇప్పటి వరకు 4,634 మంది కరోనాతో మరణించారు. భారత్‌లో ఏకంగా 4,706 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.ఇక, కేసుల విషయంలోనూ భారత్ 9వ స్థానానికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. 1.82 లక్షల కేసులతో జర్మనీ 8వ స్థానంలో వుండగా, 1.60 లక్షల కేసులతో టర్కీ పదో స్థానంలో ఉంది. కేసులు, మరణాల విషయంలో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, అనూహ్యంగా బ్రెజిల్ రెండో స్థానానికి చేరుకుంది. ఆ తర్వాత వరుసగా రష్యా, స్పెయిన్, యూకే, ఇటలీ, ఫ్రాన్స్‌లు టాప్-10లో ఉన్నాయి.

* రాష్ట్రంలోని దేవాలయాలు, మందిరాలు, మసీదులు, గురుద్వారాల దర్శనాలను ప్రారంభించనున్నట్లు పశ్చిమ బంగ ప్రభుత్వం ప్రకటించింది. అయితే లోపలకు ఒకేసారి పది మందికి మాత్రం ప్రవేశం ఉంటుంది. ప్రార్థన మందిరాల ప్రాంగణాల్లో ఎలాంటి సభలు నిర్వహించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నెల 1 నుంచి ఈ నిర్ణయాలు అమలులోకి వస్తాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు.

* ఈ నెల 20 వరకు 279 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను నడిపినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. అందులో మూడు లక్షల మంది వలస కూలీలను గమ్య స్థానాలకు తరలించినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువ శాతం ఉత్తర్‌ ప్రదేశ్‌ (42 శాతం), బిహార్‌ (37 శాతం)కు చెందినవారని వినోద్‌ కుమార్‌ చెప్పారు.

* లాక్‌డౌన్‌ కారణంగా విదేశాల్లో చిక్కుకున్నభారతీయుల్ని సొంత ప్రాంతాలకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్‌ మిషన్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రెండో విడత నడుస్తోంది. తాజాగా ఈ మిషన్‌లో అదనపు విమానాలను జోడించారు. దిల్లీ నుంచి అక్లాండ్‌ (జూన్‌ 4న), దిల్లీ షికాగో,స్టాక్‌హోమ్‌ (జూన్‌ 5), దిల్లీ నుంచి న్యూయార్క్‌, ఫ్రాంక్‌ఫర్ట్‌, సియోల్‌ (జూన్‌ 6), ముంబయి నుంచి లండన్‌, న్యూయార్క్‌ (జూన్‌ 6) మధ్య విమాన సర్వీసులను నిర్వహించనున్నారు. వీటి టికెట్‌ బుకింగ్‌ 30వ తేదీ నుంచి మొదలవుతుందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 85 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,330కి చేరింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో 111 మందికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 345 మందికి కరోనా ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 156 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఉన్నవాళ్లలో 2,874 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2,037 మంది డిశ్చార్జి అయ్యారు. 60 మంది మరణించారు. 777 మంది చికిత్స పొందుతున్నారు.

* ఉత్తరాఖండ్‌లో ఈ రోజు ఇప్పటివరకు 102 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 602కి చేరింది. ఇందులో 505 పాజిటివ్‌ కేసులు. ఇప్పటివరకు ఐదుగురు కరోనాతో చనిపోయారు.

* ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా భేటీ అయ్యారు. దేశంలో కరోనా పరిస్థితి, లాక్‌డౌన్‌ -4 ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నట్టు సమాచారం. గురువారం రాత్రి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అమిత్‌ షా మాట్లాడి లాక్‌డౌన్‌పై అభిప్రాయలు తీసుకున్న అనంతరం జరుగుతున్న ఈ భేటీ కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.

* కర్ణాటకలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 5గంటల నుంచి ఈ రోజు మధ్యాహ్‌నం 12గంటల మధ్య ఈ కేసులు నమోదైనట్టు అధికారులు బులిటెన్‌లో వెల్లడించారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2711కి పెరిగింది. వీరిలో 869 మంది డిశ్చార్జి కాగా.. 47మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 1793 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.