Health

నిద్ర పట్టట్లేదా?

నిద్ర పట్టట్లేదా?

నిద్ర సుఖమెరుగదు అని అంటారు. కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్లయిందోనని వాపోయేవారు నేడు అనేక మంది. విపరీతమైన ఆలోచనలు, ఆందోళనల మధ్య జీవితాలను గడిపే ఎంతో మందికి కంటి నిండా నిద్ర కరవవుతుంది. అందుకే నేటి ఆధునిక కాలంలో కమ్మటి నిద్ర కరువైంది. కాని చిన్న పిల్లలు అలా కాదు. వారి లేత మనసుల్లో ఎలాంటి ఆందోళనలు, అలజడులు ఉండవు. కావల్సిన పెన్నిధి పక్కన ఉంటే కమ్మటి నిద్ర పోతారు. అలా నిద్రపోయే పిల్లలు ఎదుగుదల కూడా బాగుంటుందని వైద్య నిపుణులు సైతం నిర్థారిస్తున్నారు. చిన్నారుల జీవితంలో ఎక్కువ భాగం నిద్రకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాని పిల్లలు నేడు సెల్‌ఫోన్లలో గేమ్స్, టీవీలకు అతుక్కుపోతున్నారు. భయానకమైన సినిమాలకు మనమే అలవాటు చేస్తున్నాం. పెద్దలు తమ పనుల్లో మునిగిపోయి పిల్లల చేతికి స్మార్ట్ఫోన్లు ఇచ్చి గేమ్స్ చూసుకోమని ప్రోత్సహిస్తున్నాం. లేదంటే టీవీ ఆన్‌చేసి దాని ముందు కూర్చోబెట్టి సినిమాలు చూడమంటాం. మనతో పాటు కూర్చోబెట్టుకుని సీరియల్స్‌కు అలవాటు చేస్తున్నాం.ఇటీవల జరిగిన ఓ సర్వేలో ఆసక్తికరమైన, హాస్యాస్పదమైన అంశం వచ్చింది. సాయంత్రం ఆరుదాటిన తరువాత ఏదైనా పని మీద తలుపు తట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చిందంటా. దీనికి కారణం ఆ సమయంలో టీవీల్లో సీరియల్స్ విపరీతంగా వస్తుండటమే. తల్లులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఎవరైనా వస్తే ముఖం చిరాకుగా పెట్టి ఏదో సమాధానం ఇచ్చి తలుపు దడాలున ముఖం మీదే వేస్తున్నారంటే దృశ్య మాధ్యమాల పట్ల పోకడ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏదో సామెత చెప్పినట్లు తల్లి పీత ఒంకరి టింకరిగా నడుస్తూ పిల్ల పీతను సరిగ్గా నడవమని గదమాయించినట్లుగా ఉన్నది నేటి పరిస్థితి. నట్టింట్లో శత్రువును పెట్టుకుని పిల్లలను బెదిరించటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు మరి.
**సుఖ నిద్ర పిల్లలకు ఎంతో అవసరం
చిన్న పిల్లలకు నిద్ర అతి ముఖ్యమైంది. సుఖ నిద్ర వారిని ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. కమ్మటి నిద్రపోయే ఆ అమాయకమైన పిల్లల ముఖాలు ఎంత అందంగా ఉంటాయో మనందరికీ తెలిసిందే. సుఖనిద్ర వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మేధాశక్తిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లల నిద్రకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి.
**సమయానుసారంగా పడుకోవటం..లేవటం
క్రమబద్దమైన నిద్ర వారికి అలవాటుగా మారి మంచి నిద్రకు దోహదం చేస్తుంది. అలాగే ఖచ్చితమైన నిద్ర వేళలు పాటించటం. అలా పడుకోవటం వల్ల పిల్లలు చలాకీగా ఉండేందుకు పనికి వస్తుంది. ఇది వారి రోజూవారీ నిద్ర వేళలను క్రమబద్ధీకరించటమే కాకుండా పిల్లల్ని మరింత శక్తివంతులుగా చేస్తుంది. సమయానుసారంగా పడుకోవటం, లేవడం చిన్న పిల్లలకే కాదు పెద్దవారికి కూడా *ఎంతైనా అవసరం.
*సుఖవంతమైన నిద్రకు పాజిటివ్ బెడ్ టైం రోటీన్ ఎంతగానో దోహదం చేస్తుంది. ఇది పిల్లల మానసిక ఆరోగ్యం పెంచేందుకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఆడుకునే ముందు స్నానం చేయడం, పల్లుతోముకోవటం, నైట్‌డ్రెస్ వేసుకోవటం మంచిది. ఇలా చేయటం వల్ల పిల్లలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉంటారు. అలాగే పిల్లలు నిద్ర పోయేముందు చక్కటి కథలు చెప్పండి. కథలు చెప్పే తల్లులే నేడు కరువయ్యారు. ఫలితంగా వారిలో మానసిక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. వారికి మానవ బంధాల పట్ల ఆ పసి మనసులో గౌరవభావం పెరుగుతుంది.
*ఆహ్లాదకరమైన వాతావరణం
పరిపూర్ణమైన నిద్రకు పడక గదికి చాలా సన్నిహితమైన అనుబంధం ఉంది. పరిశుభ్రమైన పడక గది ఆరోగ్యకరమైన నిద్రతో పాటు అన్ని రకాల అనారోగ్యాలను కూడా దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా వివిధ ఎలక్ట్రానిక్ పరికరాలను, టీవీలను పడక గదిలో ప్లేస్ లేకుండా చేయటం వల్ల మగత నిద్రను దూరం చేయవచ్చు.
*కేప్సిన్, ఇతర జంక్ పదార్థాలకుదూరంగా ఉంచటం
పడుకునే ముందు జంక్ పదార్థాలను తినటం కాని లేదా కాఫీ తాగడం వల్ల నిద్ర రావటం పోయి సరిగ్గా నిద్ర పోకపోవటం జరగవచ్చు. జంక్ ఆహార పదార్థాలను కార్వింగ్‌ను, షుగర్ లెవెల్స్‌ను పెంచుతాయి. ఇది నిద్రాభంగానికి దారి తీయటమే కాదు, నిద్రకు దూరం కూడా చేస్తుంది. అలాగే రాత్రిపూట డిన్నర్‌లో వోల్‌గ్రెయిన్స్‌తో కూడినవి తీసుకోవటం మంచిది. ఇంకా, పడుకోవటానికి రెండు, మూడు గంటల ముందే తినేయడం మరి మంచిది.