ScienceAndTech

సోషల్ మీడియాపై జగన్ సర్కార్ డేగకన్ను

AP Govt Hands Over Social Media Monitoring To CID

ఏపీలో సోషల్ మీడియాపై సీఐడీ పోలీసులు నిఘా ఉంచారు. ప్రజా ప్రతినిధులు.. ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా.. అశ్లీలంగా.. విద్వేషాలు.. కలహాలు రెచ్చగొట్టే విధంగా.. ఫేక్ న్యూస్ సృష్టిస్తున్న వారి భరతం పట్టేందుకు ప్రత్యేక టెక్నాలజీని వినియోగిస్తున్నారు. మంగళగిరి పోలీసు స్టేషన్ లో నమోదైన కేసులో.. కర్నూలు నగరానికి చెందిన ఓ ఆర్ఎంపీ డాక్టర్ ఫేక్ ఐడీల సృష్టికర్తగా గుర్తించారు. అసభ్య పదజాలం.. అశ్లీల వ్యాఖ్యలతో… ప్రజా ప్రతినిధుల మధ్య కలహాలు… విద్వేషాలు సృష్టించే విధంగా పోస్టులు చేస్తున్నట్లు తేలింది. కర్నూలు కొత్తపేటకు చెందిన ఆర్. ఎం.పి డాక్టర్ మోతీలాల్ (36)ను అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు కర్నూలు రేంజ్ సీఐడీ అడిషనల్ ఎస్పీ పీఎన్ బాబు, సీఐ డేగల ప్రభాకర్ ధృవీకరించారు. కొందరు ప్రజా ప్రతినిధులు చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ విభాగంలో ప్రత్యేక టెక్నాలజీతో నిఘా ఏర్పాటు చేశామన్నారు. వాట్సప్.. ఫేస్ బుక్.. ఇన్ స్టా గ్రామ్.. యూ ట్యూబ్ లలో చేస్తున్న పోస్టులపై సీఐడీ నిఘా ఉందని.. తెలియని తప్పుడు సమాచారాన్ని మరికొందరికి వ్యాపింప చేయడం.. ఫేక్ న్యూస్ సృష్టించడం వంటి పనులు మానుకోకపోతే శిక్షలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తెలియని వాటి జోలికి వెళ్లి తప్పుడు పనులకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని అందరూ గుర్తించాలని సీఐడీ పోలీసులు కోరారు.