DailyDose

ఏపీలో ఒకేరోజు 5041 కరోనా కేసులు-తాజావార్తలు

Breaking News - AP One Day Cases Tally To 5041

* ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో క‌రోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తొలిసారి నేడు ఒక్క‌రోజే రికార్డు స్థాయిలో 5,041 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 31, 148 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా 5,041 కేసులు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కోవిడ్-19 కార‌ణంగా 56 మంది చ‌నిపోయారు. వ్యాధి నుంచి కోలుకుని తాజాగా 1,106 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 49,650 గా ఉండ‌గా వీటిలో 26,118 యాక్టీవ్ కేసులు. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు ఏపీలో మొత్తం 642 మంది మ‌ర‌ణించారు.

* రాష్ట్రంలోని రెండు కీలకమైన ఇంజినీరింగ్‌ విభాగాల ముఖ్యులతో సీఎం కేసీఆర్‌ సోమ, మంగళ వారాల్లో సమీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం నీటిపారుదలశాఖ పునర్వ్యవస్థీకరణ ముసాయిదాపై సీఎం సమగ్రంగా చర్చించి తుదినిర్ణయం తీసుకోనున్నారు. మంగళవారం మధ్యాహ్నం సచివాలయం భవన నిర్మాణంపై సమీక్షిస్తారు. ఈ సమావేశంలో తమిళనాడు ఆర్కిటెక్టులు ఆస్కార్‌, పొన్ని పాల్గొననున్నారు. సచివాలయ బాహ్యరూపం, సౌకర్యాలు తదితర అంశాలపై సమీక్షిస్తారు. అనంతరం వాటిని మంత్రివర్గంలో చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాత టెండర్లు పిలిచి భవన సముదాయ నిర్మాణాలను ప్రారంభించనుంది.

* కరోనా కష్టకాలంలోనూ భారతదేశంలో పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో పెరిగి తులం బంగారం (10 గ్రాములు) రూ 50,000 లకు చేరువ అయ్యాయి. అయినా సరే వినియోగదారులు కొంటూనే ఉన్నారు. భారతీయులకు, బంగారానికి విడదీయలేని సంబంధం ఉంటుంది కాబట్టి కొనుగోళ్లు అధిక స్థాయిలో సంతృప్తికరంగానే జరుగుతున్నాయి. పెండ్లిళ్ల సీజన్లో అమ్మకాలు సహజంగానే మరింతగా పుంజుకుంటాయి. అయితే, ప్రస్తుతం ఇండియా లో బంగారం ధరలు ఇంతలా పెరగటానికి మాత్రం కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ప్రపంచంలోనే బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంటుంది.

* ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాలు విస్మరించడం వల్లే అంతర్జాతీయ సంస్థల్లో అసమానతలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ఆరోపించారు. ప్రస్తుతం కరోనా వైరస్‌ వల్ల ఏర్పడిన పరిస్థితులు ఇదే విషయాన్ని తేటతెల్లం చేసినట్లు ఆయన‌ అభిప్రాయపడ్డారు. వీటిని అధిగమించి మరింత సమాన, సుస్థిర ప్రపంచాన్ని నెలకొల్పడానికి తాజా పరిస్థితులు మరో అవకాశం కల్పించాయని ప్రపంచదేశాలకు సూచించారు.

* కొవిడ్‌-19 కట్టడి, చైనాతో సరిహద్దు వివాదం వంటి అంశాల్లో భాజపా అనుసరిస్తున్న విధానాలపై చేస్తున్న విమర్శల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రోజురోజుకీ పదును పెంచుతున్నారు. తాజాగా.. ‘భాజపా అబద్ధాల్ని వ్యవస్థీకృతం చేసిందం’టూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పొరుగుదేశాలతో వివాదాల విషయంలో మోదీ సర్కార్‌ తీసుకుంటున్న పిరికి చర్యలతో భవిష్యత్తులో భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆరోపించారు.

* కరోనా మహమ్మారిపై పోరాటంలో ప్రసార మాధ్యమాల పాత్రను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ప్రజలను చైతన్యం చేయడంలో కీలక పాత్ర పోషించాయన్నారు.ఫేస్‌బుక్‌ వేదికగా ఉపరాష్ట్రపతి తన అభిప్రాయాలను పంచుకున్నారు. కరోనాతో మరణించిన పాత్రికేయులకు ఆయన నివాళులర్పించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వాటిని చూసి ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని చెప్పారు.

* మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు చేసుకోవడం కాంగ్రెస్‌కు గర్వంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ఈనెల 24న ఇందిరాభవన్‌లో పీవీ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వీపీ వందశాతం కాంగ్రెస్‌ వాది అని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

* రాష్ట్రంలోని రెండు కీలకమైన ఇంజినీరింగ్‌ విభాగాల ముఖ్యులతో సీఎం కేసీఆర్‌ సోమ, మంగళ వారాల్లో సమీక్షలు నిర్వహించనున్నారు. సోమవారం నీటిపారుదలశాఖ పునర్వ్యవస్థీకరణ ముసాయిదాపై సీఎం సమగ్రంగా చర్చించి తుదినిర్ణయం తీసుకోనున్నారు. మంగళవారం మధ్యాహ్నం సచివాలయం భవన నిర్మాణంపై సమీక్షిస్తారు. ఈ సమావేశంలో తమిళనాడు ఆర్కిటెక్టులు ఆస్కార్‌, పొన్ని పాల్గొననున్నారు.

* దేశ రాజధాని దిల్లీని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వివిధ ఘటనల్లో ఇప్పటి వరకు ఇద్దరు మృతిచెందారు. ఓ వ్యక్తి మృతదేహం మింటో బ్రిడ్జ్‌ దగ్గర నీటిలో తెలియాడుతూ కనబడడం అందరి హృదయాల్ని కలచివేసింది. ఉదయం నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.

* అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి కాపీరైట్ నోటీస్‌ సెగ తగిలింది. తాజాగా ఎన్నికల ప్రచారంపై రూపొందించిన ఓ వీడియోను వైట్‌హౌజ్‌ ట్విటర్‌లో పోస్టు చేసింది. ఆ వీడియోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రీట్వీట్‌ చేశారు. అనంతరం ఆ వీడియోలో తమ కంపెనీకి చెందిన ఆడియో వాడినట్లు ఓ సంస్థ కాపీరైట్‌ నోటీస్‌ ఇచ్చింది. పరిశీలించిన అనంతరం సదరు వీడియోను ట్విటర్‌ తొలగించింది.

* ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ కాలంలో ఆస్ట్రేలియాలో నిర్వహించాల్సిన టీ20 ప్రపంచకప్‌పై ఐసీసీ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అని కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం ఐపీఎల్‌ లీగే. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పొట్టి ప్రపంచకప్‌ను నిర్వహించలేమని ఆతిథ్య ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు స్పష్టం చేసింది. అయితే, సోమవారం జరిగే వర్చువల్‌ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

* తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌కు కరోనా సోకింది.ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు నిత్యం ఫోన్లో అందుబాటులో ఉంటానని చెప్పారు. ప్రజలెవ్వరూ అనవసరంగా బయటకు రావొద్దని వీడియోలో కోరారు.

* ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్‌ ధాటికి బ్రిటన్‌ వణికిపోయింది. ఈ సమయంలో దేశంలో వైరస్‌ సంక్రమణ స్థాయిని తెలుసుకునేందుకు భారీసంఖ్యలో యాంటీబాడీ పరీక్షలు చేపట్టాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది. తాజాగా యూకే-ఆర్‌టీసీ జరిపిన ప్రయోగాల్లో యాంటీబాడీ పరీక్షా ఫలితాలు అత్యంత కచ్చితంగా వస్తున్నాయని తేలింది. యూకే-ఆర్‌టీసీ అభివృద్ధి చేసిన తాజా పద్ధతి ద్వారా లక్షల సంఖ్యలో ప్రజలకు ఉచితంగా యాంటీబాడీ పరీక్షలు నిర్వహించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం సిద్ధమైంది.