Food

షుగర్ బాదం పండు

షుగర్ బాదం పండు

టేకు, చందనం, దేవదారు, మహాగని… ఇలా కలపనిచ్చే చెట్ల పేర్లు చాలానే వింటుంటాం. వాటిల్లో ఒకటైన మహాగని పేరుకు తగ్గట్టే మహా వృక్షం. దృఢమైన కలపతోపాటు మధుమేహాన్ని నివారించే అద్భుతమైన పండ్లనీ అందిస్తోంది. అవే ఆకాశపండ్లు లేదా షుగర్‌ బాదం. ఇంతకీ ఆ పండ్లేమిటో… అవెలా మంచివో… తెలుసుకోవాలని మీకూ అనిపిస్తోందా…
**ఏ పండయినా కొమ్మకి కాశాక కిందకి వేలాడుతుంటుంది. కానీ ఆకాశమే హద్దుగా పెరిగే మహాగని చెట్లకి కాసే పండ్లు నీలాకాశాన్ని అందుకోవాలనో లేదా ఎవరికీ అందకుండా ఉండాలనో తెలీదుకానీ మొత్తమ్మీద ఆకాశాన్ని చూస్తున్నట్లుగా కొమ్మ నుంచి పైకి కాస్తాయి. అందుకే వాటిని ఆకాశపండ్లు అంటారు. ఒక్కో పండులో 71 గింజలు ఉంటాయి. బాదంలానే ఈ గింజల్ని ఒలిచి అందులోని పప్పుల్ని తింటుంటారు. ఎందుకంటే ఇవి శక్తిమంతమైన ఔషధ భాండాగారాలు. ఎన్నో రకాల వ్యాధులకు మందులా పనిచేస్తాయట. ముఖ్యంగా మధుమేహాన్ని అద్భుతంగా నివారిస్తాయని ఆధునిక పరిశోధనలూ స్పష్టం చేయడంతో దాని వాడకం రోజురోజుకీ పెరుగుతోంది. ఈ పప్పులకి యాంటీహైపర్‌ గ్లైసెమిక్‌ గుణం ఉండటంతో వీటిని డయాబెటిస్‌ను నివారించే సహజ ఔషధంగా మలేషియా ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే వీటిని తగు మోతాదులోనే తీసుకోవాలట.
**ఎలా తింటారు?
ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఈ చెట్టు పెరిగినప్పటికీ ఆకాశ పండ్ల వాడకం మాత్రం మలేషియా, దక్షిణ పసిఫిక్‌ సొలొమన్‌ దీవుల్లో ఎక్కువ. మహాగనిని ‘క్వీన్‌ ఆఫ్‌ ది ప్లాంట్స్‌’గా పిలుస్తూ గింజల్ని వేల సంవత్సరాల నుంచీ మధుమేహం, బీపీ, అలర్జీలు, హార్మోన్ల అసమతౌల్యానికి మందుగా వాడుతున్నారక్కడ. మనదేశంలోనూ ఎక్కువగా పెరిగినా కలపగానే దీన్ని వాడతారు. ఈ చెట్టు కలప దృఢంగా ఉండటంతో ఫర్నిచర్‌తోబాటు ఓడలకీ వాడతారు. గింజల్నీ బెరడునీ ఆయుర్వేదంలో గాయాలూ పుండ్లూ; మలేరియా, అనీమియా, డయేరియా, జ్వరం, అమీబిక్‌ డిసెంట్రీ నివారణలోనూ వాడుతుంటారు. ఈ పండ్ల గింజల్లోని ఔషధ విలువల గురించి ఆధునిక పరిశోధనల్లోనూ తేలడంతో అల్లోపతీ వైద్యులూ దీన్ని తినమని చెబుతున్నారు. అందుకే ఇప్పుడు గింజలు, పప్పులు, పొడి, ట్యాబ్లెట్లు, డ్రింకు… ఇలా రకరకాల రూపాల్లో ఆకాశపండుని అమ్ముతున్నారు. పొడిని గోరువెచ్చని నీళ్లు లేదా పాలల్లో కలిపి తీసుకోవచ్చు. లేదా రోజుకి ఒకటి రెండు పప్పుల్ని నేరుగానూ తినవచ్చు.
**స్వచ్ఛమైనది!
చెట్టు వేళ్లు నేలలో 150 అడుగుల లోపలకంటా వెళ్లి నీటిని పీల్చుకోవడంతో ఈ పండుని ఎంతో స్వచ్ఛమైనదిగానూ చెబుతారు. ఆకాశపండులో ప్రొటీన్లూ ఖనిజాలూ విటమిన్లూ ఎంజైమ్‌లూ ఫ్యాటీ ఆమ్లాలూ ఇతర్రతా పోషకాలు చాలానే ఉంటాయి. వీటితోబాటు అనేకానేక రోగాల్ని నిరోధించే 33 రకాల ఫ్లేవొనాయిడ్లూ 27 రకాల శాపోనిన్‌లూ ఉంటాయట.
*ఫ్లేవొనాయిడ్‌లు రక్త ప్రసరణను పెంచి, రక్తనాళాల్లో పేరుకున్న పాచిని తగ్గించడం ద్వారా చెడు కొలెస్ట్రాల్‌, హైబీపీ, గుండె సమస్యల్ని నిరోధిస్తాయట. కణజాలాల్లో మంటనీ గాయాల్నీ తగ్గిస్తాయి. ఈ పండ్లలోని శాపోనిన్‌, మధుమేహానికి మంచి మందు. డయాబెటిస్‌కి వాడే అల్లోపతీ మందుల్లోకన్నా ఈ శాపోనిన్‌కే హైపో గ్లైసెమిక్‌ గుణం ఎక్కువట. అందుకే మధుమేహానికి దీన్ని సహజ మందుగా చెబుతారు. ఈ శాపొనిన్‌ పురుషుల్లో వీర్యవృద్ధికీ తోడ్పడుతుంది. ఇక, ఆకాశ పండులోని ఆల్కలాయిడ్లు శరీరంలోని టాక్సిన్లను తొలగించి కణాలను దెబ్బ తినకుండా చూస్తాయి. గుండె సమస్యలూ తగ్గుతాయట. నెలసరి నొప్పులతో బాధపడేవాళ్లు చిటికెడు పొడిని మొదటిరోజు తింటే సరి. నోటి దుర్వాసన పోవాలంటే పరగడుపున రెండు పప్పుల్నీ, కాలేయ సమస్యలకి అర టీస్పూను పొడిని పాలల్లో కలిపి పేస్టులా చేసి తినాలనీ, కాస్త పొడిని కప్పు పాలల్లో లేదా నీళ్లలో మరిగించి తాగితే ఆల్జీమర్సూ ఆస్థమా ట్యూమర్లూ జీర్ణసమస్యలూ అన్నీ తగ్గుతాయట. దీన్నుంచి తీసిన నూనె చర్మాన్నీ మెరిపిస్తుందట. అందుకే స్వచ్ఛమైన ఆకాశపండుని అందరూ అందుకోవాలనుకోవడంలో తప్పేముందీ..!