Devotional

కిటికీ కృష్ణుడు గురించి తెలుసా?

కిటికీ కృష్ణుడు గురించి తెలుసా?

గర్భగుడి ఎదురుగా నిల్చుని ఇష్టదైవాన్ని మనసారా పూజిస్తే అదో ఆనందం. కానీ ఉడిపిలోని కృష్ణమఠంలో మాత్రం స్వామిని తొమ్మిది రంధ్రాలున్న కిటికీ లోంచి దర్శించుకోవాల్సి ఉంటుంది. బాల కృష్ణుడిగా కొలువై భక్తుల పూజలు అందుకుంటున్న ఆ స్వామిని అలా చూడటానికి కారణం ఉంది మరి.
**చేతిలో వెన్న చిలికే కర్రతో చిన్ని కృష్ణుడి అవతారంలో కనిపిస్తూ… కోరిన కోర్కెలు తీరుస్తూ… పూజలు అందుకుంటున్నాడు కర్ణాటకలోని ఉడిపిలో కొలువైన బాలకృష్ణుడు. ఈ ఆలయంలో స్వామి పశ్చిమముఖాన దర్శనమివ్వడం విశేషం. స్వామిని చూసేందుకు గుడి పశ్చిమంవైపు తొమ్మిది రంధ్రాలున్న కిటికీ ఉంటుంది. భక్తులు మొదట ఇక్కడున్న చంద్రమౌళేశ్వర తరువాత అనంతేశ్వర ఆలయాల్లోని శివుడిని పూజించాకే శ్రీకృష్ణుడిని దర్శించుకుంటారు. ఈ కృష్ణమఠాన్ని మధ్వ మత వ్యవస్థాపకుడు 13 వ శతాబ్దంలో కట్టించాడని పురాణాలు చెబుతున్నాయి.
***రాయి రూపంలో దొరికి…
ఓసారి దేవకి తాను యశోదలా కృష్ణుడి బాల్యాన్ని చూడలేదని బాధపడిందట. దాంతో కృష్ణుడు బాలకృష్ణుడిగా మారిపోయి తల్లిఒడిలో పడుకోవడమే కాదు… వెన్న చిలకడం వరకూ ఎన్నో చిలిపిపనులు చేశాడట. ఇది తెలిసిన రుక్మిణి తాను కూడా బాలకృష్ణుడిని పూజించాలనుకుని అలాంటి విగ్రహం చేయించుకుందట. ప్రతిరోజూ ఆ విగ్రహానికి చందనాన్ని లేపనంలా పూసి పూజలు చేసేదట. ద్వాపర యుగం అనంతరం ఆ విగ్రహం సముద్ర ప్రవాహంలో కొట్టుకుపోయి… పూర్తిగా ఇసుకతో కప్పబడి రాయిలా మారిపోయిందట. అది జరిగిన కొన్ని వేల ఏళ్ల తరువాత ఆ రాయిని తన పడవలో పెట్టుకుని ఉడిపివైపు ప్రయాణించడం మొదలుపెట్టాడట ఓ నావికుడు. అయితే ఉడిపిని చేరుకునే క్రమంలో అలల ఉద్ధృతి పెరిగిందట. ఆ సమయంలోనే సముద్రం ఒడ్డుకు పూజ చేసేందుకు వచ్చిన మధ్వ మత వ్యవస్థాపకుడు ఆ నావికుడికి జాగ్రత్తలు చెబుతూ క్షేమంగా ఒడ్డుకు చేరేలా చేశాడట. దాంతో నావికుడు ఏదైనా కానుక ఇవ్వాలనుకుని అదే విషయాన్ని చెప్పాడట. అయితే కృష్ణభక్తుడైన మధ్వ మత వ్యవస్థాపకుడు ఆ రాయిని తీసుకున్నాడట. కొంతదూరం వెళ్లేసరికి ఆ రాయి కిందపడి.. చందనంతో కప్పబడిన కృష్ణుడి విగ్రహం బయటపడిందట. అప్పటికే కృష్ణ మందిరం కట్టాలనుకున్న ఆ భక్తుడు చివరకు ఈ విగ్రహంతోనే ఆలయం నిర్మించాడట. కొన్నాళ్లకు కనకదాసు అనే భక్తుడు స్వామిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చాడట. అయితే అతనిది అగ్రకులం కాకపోవడంతో లోపలికి అనుమతించలేదట. దాంతో ఎలాగైనా స్వామిని చూడాలనుకుని పశ్చిమంవైపు వెళ్లి గోడకు చిన్న రంధ్రం చేయడం మొదలుపెట్టాడట. అతడి భక్తికి మెచ్చిన స్వామి పశ్చిమంవైపు తిరగడంతో… అప్పటినుంచీ స్వామి విగ్రహాన్ని అలాగే ఉంచేశారని చెబుతారు. అంతేకాదు
కనకదాసు చూసిన గోడకు తొమ్మిది రంధ్రాలు పెట్టి కిటికీలా మార్చి అక్కడినుంచే స్వామిని దర్శించుకోవాలని నియమం పెట్టారు. ఆ కిటికీని కనకదాసు కిటికీ, నవగ్రహ కిటికీ అని పిలుస్తారు. ఈ ఆలయానికి ప్రత్యేక నిర్వాహకులు అంటూ ఉండరు. ఎందుకంటే… మధ్వ మత వ్యవస్థాపకుడు తాను చనిపోయేముందు తన శిష్యుల్లో ఎనిమిది మందిని పిలిచి ప్రతీఒక్కరూ రెణ్నెల్లపాటు ఆలయ బాధ్యతల్ని తీసుకోవాలని చెప్పాడట. ఇప్పుడది రెండేళ్లకు మారింది. అలా అప్పటినుంచీ ఇప్పటివరకూ ఆ వంశస్థులే ఆలయ బాధ్యతల్ని చూస్తున్నారు.
***వైభవంగా సేవలు…
ఈ ఆలయంలో స్వామి చిన్ని కృష్ణుడి అవతారంలో కనిపిస్తాడు కాబట్టి ఇక్కడ కృష్ణాష్టమిని వైభవంగా చేస్తారు. ఆ వేడుకను చూసేందుకు భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తారు. అదేవిధంగా సప్తోత్సవ, వసంతోత్సవ, కృష్ణలీలోత్సవ, లక్ష దీపోత్సవ పేరుతో రకరకాల సేవల్ని నిర్వహించడం విశేషం.
ఎలా చేరుకోవచ్చంటే…
ఈ ఆలయానికి విమానం ద్వారా వెళ్లాలనుకునేవారు మంగళూరులో దిగి… అక్కడి నుంచి ఉడిపికి క్యాబ్‌ లేదా బస్సుల్లో చేరుకోవచ్చు. రైలు మార్గం ద్వారా వెళ్లాలనుకుంటే ఉడిపి రైల్వేస్టేషనులోనే నేరుగా దిగొచ్చు. మంగళూరు నుంచి ఇక్కడకు ప్రత్యేక బస్సులు కూడా ఉన్నాయి.