DailyDose

7వ తేదీ నుండి మెట్రో పరుగులు-తాజావార్తలు

7వ తేదీ నుండి మెట్రో పరుగులు-తాజావార్తలు

* దేశంలో సెప్టెంబర్‌ 1 నుంచి అన్‌లాక్‌-4 అమలు కానుండగా.. మరిన్ని సడలింపులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు సెప్టెంబర్‌ 7 నుంచి మెట్రోరైళ్లను పునరుద్ధరించేందుకు అవకాశం కల్పించింది. దశలవారీగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ప్రక్రియను మరింత విస్తృతం చేసింది. కంటైన్‌మెంట్ జోన్‌లకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలకు హోంశాఖ అవకాశం కల్పించగా.. కంటైన్‌మెంట్‌ జోన్లలోమాత్రం సెప్టెంబర్ 30 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలతో విస్తృతమైన సంప్రదింపుల ఆధారంగా మార్గదర్శకాలు విడుదల చేసింది.

* విభజన శక్తులు దేశంలో విద్వేషాన్ని రెచ్చగొడుతూ భావ ప్రకటనా స్వేచ్చను హరిస్తున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నియంతృత్వ పోకడలతో ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో ఇంతటి విపత్కర పరిస్థితులు, సంక్షోభం నెలకొంటాయని పూర్వీకులు, నాయకులు ఎవరూ ఊహించి ఉండరని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో నూతన అసెంబ్లీ భవన శంకుస్థాపన సందర్భంగా వీడియో కాల్‌ ద్వారా సోనియా గాంధీ హిందీలో ప్రసంగించారు. ఎక్కడా అధికార పార్టీ పేరు ప్రస్తావించకుండానే… కేంద్ర సర్కారుపై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు.

* కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొత్త వైరస్‌ కావడంతో పరిశోధనల్లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తక్కువ స్థాయిలో ఏసీల వాడకం, ఇంట్లోకి గాలి, వెలుతురు వచ్చేలా సౌలభ్యం.. వైరల్‌ లోడ్‌ను తగ్గించేందుకు దోహదం చేస్తున్నాయని ఏసియా పసిఫిక్‌ జర్నల్ ఆఫ్ పబ్లిక్‌ హెల్త్‌లో ప్రచురితమైన కథనం పేర్కొంది. అవి భారత్‌ సహా ఆసియా దేశాల్లో తక్కువ సంఖ్యలో మరణాలకు కారణమవుతున్నాయని దిల్లీ, మంగళూరుకు చెందిన వైద్య నిపుణులు విశ్లేషణాత్మక వివరణ ఇచ్చారు.

* విశాఖ జిల్లా పెందుర్తిలో శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు జనసేనలో ఉన్నారని, అతను పవన్‌ అభిమాని అంటూ వస్తున్న ప్రచారాన్ని ఆ పార్టీ ఖండించింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనలో పవన్‌ పేరు తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాని పేర్కొంటూ జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. నిందితులు జనసేన పార్టీలో కనీసం సభ్యులు కూడా కాదని స్పష్టంచేశారు.

* కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన తనయుడు చరణ్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. తన తండ్రి కోలుకొని క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్న అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిన్నటితో పోలిస్తే తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై కొత్త సమాచారం ఏమీ లేదన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

ఏపీలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 10,548 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభత్వం బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా కారణంగా ఇవాళ మరో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా పాజిటివ్‌ కేసులతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 4,14,164కి చేరగా.. ఇప్పటి వరకు 3,796 మంది మరణించారు. గత 24 గంటల్లో 8,976 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం 3,12,687 మంది కరోనాను జయించి డిశ్చార్జి అయ్యారు.

* జీవితంలో వివాహం అనేది ఓ మధురమైన ఘట్టం. ఒకరికొకరు లాభనష్టాలు, సుఖ దుఃఖాల్లో తోడునీడగా కలిసి ఉంటామని హామీ ఇస్తూ కొత్త దంపతులు జీవితాన్ని పంచుకుంటారు. అలాంటి ఎంతో విశిష్టత కలిగిన పెళ్లి నాటి ప్రమాణాలను నిజం చేస్తూ ఏకంగా గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించింది ఓ జంట. ఈక్వెడార్‌ రాజధాని క్విటోకు చెందిన జూలియో, మోరా వాల్డ్రామెనా క్విటోరెస్‌ దంపతులు ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించి ఉన్న భార్యాభర్తలుగా రికార్డు సృష్టించారు.

* అధికార పక్షం భాజపా వైపు ఫేస్‌బుక్‌ ఇండియా మొగ్గు చూపుతుందన్న అంశంపై.. ఆ సంస్థ ఏ చర్యలు తీసుకుందో వివరించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ ఫేస్‌బుక్‌కు మరోసారి లేఖ రాశారు. భారతదేశంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఏం చేస్తున్నారో చెప్పాలంటూ ఆయన సంస్థ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ను ప్రశ్నించారు. అంతేకాకుండా ఫేస్‌బుక్‌ ఆధీనంలో ఉన్న మరో సోషల్‌ మీడియా యాప్‌ వాట్సాప్‌ కూడా.. భాజపా కనుసన్నల్లోనే నడుస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

* చిత్తూరులో తెదేపా నేతల గృహ నిర్భందాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. తెదేపా నేతలు ఒత్తిడి చేయడం వల్లే ప్రతాప్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారన్నారు. పార్టీ ఎస్సీ నాయకులతో ఆయన ఇవాళ టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కేసులో కీలకమైన మృతుడి కాల్‌లిస్టును బయటపెట్టాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. చౌటుపల్లిలో మరో ఎస్సీ యువకుడి ప్రాణాలు తీసి ట్రాక్టర్‌ బోల్తాపడి మరణించినట్లుగా చిత్రీకరించారని చంద్రబాబు అన్నారు. చిత్తూరులో ఎస్సీలపై దమనకాండకు మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలే కారణమని అన్నారు.

* ఉన్నతమైన సమాజానికి, భాషాసంస్కృతులే చక్కని పునాదులు వేస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని దిల్లీలో దక్షిణాఫ్రికా తెలుగు సమాఖ్య నిర్వహించిన ‘మన భాష- మన సమాజం-మన తెలుగు సంస్కృతి’ అంతర్జాల సదస్సును ఆయన ప్రారంభించారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి అయిన తెలుగు భాషా దినోత్సవం నాడు భాషా సంస్కృతి, సమాజం పరంగా మనం ఎక్కడున్నామనే అంశాన్ని సింహవలోకనం చేసుకోవడం ముదావహం అని వెంకయ్య వ్యాఖ్యానించారు.

* గుంటూరు నగరంలో ఓ మహిళ తన బిడ్డతో సహా 5 అంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మీపురంలోని కమలేశ్‌ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్న మహిళ.. తన 9 నెలల పాపను భవనం నుంచి కిందకు నెట్టేసింది. దీంతో బిడ్డ అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత ఆమె కూడా కిందకు దూకేసింది. తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. భార్యభర్తల మనస్పర్థల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.