DailyDose

మోడీని ఆయన భార్యతో ఆలయానికి వెళ్లమనండి-తాజావార్తలు

Kodali Nani Wants Modi And His Wife To Go Do Pujas

* హిందూ ఆలయాలపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎవరికీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని ఏపీ మంత్రి కొడాలి నాని అన్నారు. తిరుపతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. తిరుమల డిక్లరేషన్‌ అంశంలో ఇటీవల చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేబినెట్‌ నుంచి తొలగించాలంటూ రాష్ట్ర భాజపా నేతలు చేసిన డిమాండ్‌పై మంత్రి స్పందించారు. సీఎం జగన్‌ డిక్లరేషన్‌ ఇచ్చి సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకోవాలని భాజపా డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ఆ పార్టీపై మంత్రి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ‘‘పది మందిని వెంటబెట్టుకెళ్లి అమిత్‌షా, కిషన్‌రెడ్డిని తొలగించాలంటే తొలగిస్తారా? రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన భాజపా మాటలు హాస్యాస్పదం. అత్యధిక ఓట్లు వచ్చిన జగన్‌కు సలహాలు ఇచ్చే స్థాయి భాజపాకు ఉందా? ప్రధాని మోదీని తన సతీమణిని తీసుకెళ్లి రామాలయంలో పూజలు చేయమనండి. మోదీ, యూపీ సీఎం మాత్రం ఒంటరిగా ఆలయాలకు వెళ్తారు.. జగన్‌ మాత్రం కుటుంబసమేతంగా ఆలయానికి రావాలా? ఎవరి పార్టీ విధానాలు వారికి ఉంటాయి. సోము వీర్రాజు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక ఆలయాలపై దాడులు జరిగాయంటే ఆయన్ను తొలగిస్తారా? నోటా కంటే ఎక్కువ ఓట్లు ఎలా తెచ్చుకోవాలనే దానిపై భాజపా ఆలోచించుకోవాలి. అంతేకానీ మా పార్టీలో ఎవరిని ఉంచాలి.. ఎవరిని తీసేయాలనే విషయాలను జగన్‌కు భాజపా నేతలు చెప్పేదేంటి? ఎవరి పార్టీ వ్యవహారాలు వాళ్లు చూసుకుంటే మంచిది’’ అంటూ కొడాలి నాని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

* ఏపీలోని ఆలయాలపై దాడులకు సంబంధించి సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని ఏపీ సీఎం జగన్‌ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. సీఎం నివాసానికి 200 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి 300 మంది పోలీసులు మోహరించారు. భజరంగ్‌ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకురాగా.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఉద్రిక్తతల మధ్య పోలీసులు భజరంగ్‌ దళ్‌ నేతలను అరెస్టుచేసి వాహనాల్లో తరలించారు. ఈ సందర్భంగా భజరంగ్‌ దళ్‌ నేతలు మాట్లాడుతూ… హిందువుల మనోభావాలు దెబ్బతీసిన మంత్రి కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కొడాలి నానిని బర్తరఫ్‌ చేయకపోతే ఆయన మాటలను సీఎం వ్యాఖ్యలుగా భావిస్తామని స్పష్టం చేశారు.

* మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో అనిశా అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. నరసింహారెడ్డిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసిన అనిశా అధికారులు ..హైదరాబాద్‌ రేంజ్‌ డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏక కాలంలో 13 చోట్ల సోదాలు చేస్తున్నారు.

* అమెరికా ఆర్థిక వృద్ధికి భారత సంతతికి చెందిన అమెరికావాసులు తమ కృషి, వ్యాపార నైపుణ్యాలతో ఎంతో శక్తినిచ్చారని డెమోక్రాటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్న జో బైడెన్‌ అన్నారు. దేశంలో సాంస్కృతిక చైతన్యానికి దోహదం చేశారన్నారు. భారత అమెరికన్లు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

* రాజ్‌భవన్‌ మహిళల కోసం గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రాజ్‌భవన్‌ ఉద్యోగుల ఆరోగ్యం కోసం యోగా సహా పలు కార్యక్రమాలు చేపట్టిన గవర్నర్‌.. ఇప్పుడు స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా రాజ్‌భవన్‌ మహిళలకు వివిధ రకాల చేతి వృత్తుల్లో శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలకు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, జ్యూట్‌ బ్యాగుల తయారీ, కాగితంతో కళాకృతుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్‌ పాల్గొని మాట్లాడారు.

* తిరుమల డిక్లరేషన్‌ వ్యవహారంలో ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సరికాదని శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి అన్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన మంత్రి విచిత్రంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తిరుమల చరిత్ర ఏనాటిది..?నాని చరిత్ర ఏపాటిది?అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ మౌనంతో ఆయనే మాట్లాడిస్తున్నారనే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్లే అవకాశముందని పరిపూర్ణానంద చెప్పారు. మంత్రి వ్యాఖ్యలతో ప్రభుత్వానికి చాలా ప్రమాదమన్నారు. ‘‘హిందూ దేవాలయాలపై మాట్లాడేందుకు మీకు ఏం హక్కుంది? కొడాలి నానికి చట్టాలు, చరిత్ర తెలియదా?’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారులు ఎవరూ దేవాలయాల జోలికి రావొద్దని పరిపూర్ణానంద కోరారు.

* దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహా నగరాన్ని ఓ వైపు కరోనా వెంటాడుతుంటే.. మరోవైపు భారీ వర్షాలు వణికిస్తున్నాయి. మంగళవారం రాత్రంతా కురిసిన భారీ వర్షాలతో నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. రైలు, రోడ్డు మార్గాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబయి సహా పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో పలు మార్గాల్లో సబర్బన్‌ రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. నగరంలోని పలు ఆస్పత్రుల్లోకి నీరు చేరింది. అత్యవసర సర్వీసులు మినహా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు/ కార్యాలయాలు మూసివేయాలని బీఎంసీ ఆదేశించింది. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావొద్దని సూచించింది. నగరంలోని ఎస్వీ రోడ్‌ వద్ద రామమందిర్‌ సమీపంలో నీటి పైపు పగిలిపోవడంతో ఆ రహదారిని మూసివేశారు.

* రాజ్యసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం అక్టోబరు 1వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగాల్సి ఉన్నప్పటికీ ఎనిమిది రోజుల ముందుగానే ముగించారు. సభ్యుల్లో కొందరికి కరోనా వైరస్‌ సోకడంతో సభా సమావేశాల్ని కుదిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. బుధవారం రాజ్యసభలో పలు కీలక బిల్లులను ఆమోదించారు. జమ్మూకశ్మీర్‌ అధికార భాషల బిల్లుతో పాటు మూడు కార్మిక బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

* ఇంటర్మీడియట్‌ ఆర్ట్స్‌ గ్రూపుల్లో సిలబస్‌ తొలగింపు గందరగోళంగా మారింది. చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం తదితర సబ్జెక్టుల్లో కొన్ని పాఠ్యాంశాల తొలగింపుపై వివాదం నెలకొంది. స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్తలకు సంబంధించిన పాఠాల తొలగింపుపై విమర్శలు వచ్చాయి. దీంతో ఇంటర్మీడియట్‌ బోర్డు వెనక్కి తగ్గింది. పాఠాల తొలగింపు ప్రతిపాదన మాత్రమేనని.. ఇంకా పరిశీలనలోనే ఉన్నాయని తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వివరణ ఇచ్చారు.

* అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 తొలికేసు నమోదై ఎనిమిది నెలలు దాటిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు అక్కడ సంభవించిన కొవడ్‌ మరణాల సంఖ్య 2,00,005 అని అధికారులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్త కరోనా వైరస్‌ మరణాల్లో ఐదో వంతు ఇక్కడే చోటుచేసుకున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి. ఇదిలా ఉండగా, ఫాల్‌ (శిశిరరుతువు) ప్రారంభం కానున్న నేపథ్యంలో కొవిడ్‌ పరంగా అమెరికా మరింత క్లిష్ట పరిస్థితిలోకి అడుగుపెట్టనుందని.. ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంథొనీ ఫౌచీ హెచ్చరించారు.

* బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పూత్‌ అనుమానాస్పద మృతి కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌ రేపటికి వాయిదా పడింది. తాను అమాయకురాలినని, ఎన్సీబీ బృందం ఉద్దేశపూర్వకంగానే తనతోపాటు తన కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నారని రియా చక్రవర్తి తన బెయిల్‌ పిటిషన్‌లో పేర్కొన్నట్లు పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. అక్టోబర్‌ 6వ తేదీవరకూ రియా చక్రవర్తికి జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

* నకిలీ ఖాతాలు, ఫేస్‌బుక్‌ పేజీలు ఉన్న చైనాకు చెందిన నెట్‌వర్క్‌ను ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ తొలగించింది. అమెరికా సహా ఇతర దేశాల్లోని రాజకీయ కార్యకలాపాలను ఇబ్బందిపరిచేలా ఈ ఖాతాలు ఉన్నాయని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ఆగ్నేయాసియా, ఫిలిప్పీన్స్‌ దేశాల రాజకీయాలపైనే ప్రధానంగా ఈ నెట్‌వర్క్‌ దృష్టి సారించినట్లు తెలిపింది.

* తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన బుధవారం శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకీలో దర్శనమిచ్చారు. మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడిగా అలంకృతుడై భక్తులకు అభయమిచ్చారు. పండితుల వేదమంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు స్వామివారికి కర్పూర, పూర్ణకుంభ హారతులు సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆస్థానాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు వాహన సేవలో పాల్గొన్నారు. రాత్రి 7గంటల నుంచి 8.30 వరకు గరుడసేవ జరగనుంది. గరుడ సేవ సందర్భంగా స్వామివారికి సీఎం జగన్‌ సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

* నటుడు విజయ్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ, వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ ఆయన అభిమానులు పలు నగరాల్లో గతంలో గోడపత్రికలు అతికించిన నేపథ్యంలో తాజాగా విళుపురం జిల్లాల్లోనూ ఆ తరహా ఘటన చోటుచేసుకుంది. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విజయ్‌ అభిమానుల చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నాయి. మదురై, తేని, నీలగిరి తదితర జిల్లాల్లో కొన్ని వారాల కిందట అతికించిన గోడప్రచారాలు రాజకీయ దుమారాన్ని రేపాయి. అందులో ఎంజీఆర్‌ చిత్రాలు ఉంచడం, విజయ్‌ను ఎంజీఆర్‌ వేషధారణతో చూపడం గమనార్హం. దీనిపై అన్నాడీఎంకే నేతలు సైతం భగ్గుమన్నారు. ఇకపై మరొక ఎంజీఆర్‌ పుట్టబోరని, వేషం వేసుకున్నంత మాత్రాన ఎంజీఆర్‌ కాలేరని పలువురు మంత్రులు విమర్శించారు. ఈ వ్యవహారం సర్దుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం విళుపురం జిల్లాల్లో వెలసిన పోస్టర్లు మళ్లీ కలకలం పుట్టించాయి. ఇందులో ‘ప్రజల సంక్షేమం కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, తమిళనాడులోని ఉద్యోగాలు స్థానికులకే లభించడానికి రాష్ట్రమే ఎదురు చూస్తున్న రేపటి ముఖ్యమంత్రీ.. మీ పాలన కోసం నిరీక్షిస్తున్నాం’ అని ముద్రించారు. ఈ పోస్టరులో ఎంజీఆర్‌ చిత్రం కూడా ఉంది. విళుపురంలోని పలు ముఖ్య ప్రాంతాల్లో ఈ తరహా పోస్టర్లు కనిపించాయి.

* మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్‌ను అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులు మూడో రోజు విచారిస్తున్నారు. అతని బినామీ ఆస్తులకు సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలు సేకరించిన అనిశా అధికారులు.. వాటి గురించి నగేశ్‌ను ప్రశ్నిస్తున్నారు. నగేశ్ బినామీలను కూడా అనిశా ప్రధాన కార్యాలయానికి పిలిపించి.. వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. బోయిన్ పల్లిలోని ఆంధ్రా బ్యాంకులో ఉన్న నగేశ్ లాకర్‌ను అనిశా అధికారులు ఈ రోజు తెరిచే అవకాశం ఉంది. అందులో బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నగేశ్‌తోపాటు ఆర్డీవో అరుణా రెడ్డి, తహసీల్దార్‌ సత్తార్‌తోపాటు మరో ఇద్దరిని కూడా అనిశా అధికారులు ప్రశ్నిస్తున్నారు.

* అగ్గిపెట్టె ఇవ్వలేదని కోపంతో యువతిపై ఓ బాలుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పంతోప్పు సమీపంలోని మంగమ్మాపురానికి చెందిన యువతి(22)పై కాల్పులు జరిగాయి. ఆమె బంధువైన బాలుడు(17), సోమవారం రాత్రి మద్యం మత్తులో ఆమె ఇంటికి వెళ్లాడు. సిగరెట్‌ తాగేందుకు అగ్గిపెట్టె అడిగాడు. ఆమె లేదని చెప్పడంతో ఇద్దరికీ వాగ్వాదం జరిగింది. కోపంతో ఇంటికి వెళ్లిన బాలుడు నాటుతుపాకీని తీసుకొచ్చి యువతిని కాల్చాడు. ఆమెకు ఎడమ చేయి, కుడి కాలుపై గాయాలయ్యాయి. చికిత్స కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడిపై కేసు నమోదు చేశారు.

* ఫేస్‌బుక్‌ ఇండియా ఉపాధ్యక్షుడు, ఎండీ అజిత్‌ మోహన్‌పై వచ్చే నెల 15 వరకు ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని సుప్రీంకోర్టు దిల్లీ అసెంబ్లీని ఆదేశించింది.ఈ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్ల విషయంలో ఫేస్‌బుక్‌ పాత్రపై విచారించేందుకు దిల్లీ అసెంబ్లీ శాంతి సామరస్య కమిటీ ఇటీవల ఫేస్‌బుక్‌ ఇండియా ఉపాధ్యక్షుడికి సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఈ మేరకు బుధవారం సుప్రీం ఆదేశాలిచ్చింది.

* అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 తొలికేసు నమోదై ఎనిమిది నెలలు దాటిన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటి వరకు అక్కడ సంభవించిన కొవడ్‌ మరణాల సంఖ్య 2,00,005 అని అధికారులు వెల్లడించారు. అమెరికాలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 6.8 మిలియన్లు దాటింది. దీనితో కేసులు, మరణాల సంఖ్యలో కూడా అమెరికాయే తొలిస్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్త కరోనా వైరస్‌ మరణాల్లో ఐదో వంతు ఇక్కడే చోటుచేసుకున్నట్టు గణాంకాలు చెపుతున్నాయి. ఇదిలా ఉండగా, ఫాల్‌ (శిశిరరుతువు) ప్రారంభం కానున్న నేపథ్యంలో కొవిడ్‌ పరంగా అమెరికా మరింత క్లిష్ట పరిస్థితిలోకి అడుగుపెట్టనుందని.. ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంథొనీ ఫౌచీ హెచ్చరించారు.