DailyDose

మరో మూడు రోజులు వర్షాలు-తాజావార్తలు

మరో మూడు రోజులు వర్షాలు-తాజావార్తలు

* ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. మరో 48 గంటల పాటు వాయువ్య దిశగా అల్పపీడనం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయువ్య దిశ అనంతరం ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ అంచనా. ఈ నేపథ్యంలో మరో 3 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో విస్తారంగా వర్షం, ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.

* దేశంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గుతున్నట్టు కనబడుతోంది. గత మూడు నెలల కాలం తర్వాత తొలిసారి మంగళవారం 50వేల కన్నా తక్కువ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 10,32,795 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 46,790 కేసులు వచ్చినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. అయితే, దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న యాక్టివ్‌ కేసుల్లో 67శాతం కేవలం ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లో టాప్‌-5 జిల్లాలతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇలా దేశ వ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల్లో ఈ వైరస్‌ ఉద్ధృతి అధికంగా ఉన్నట్టు పేర్కొంది.

* తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ఆర్టీసీ బస్సులు నడపలేకపోవడం పూర్తిగా ఏపీ ప్రభుత్వ వైఫల్యమేనని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ బస్సుల విషయంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దసరాకు సొంతూళ్లకు రాలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల స్వగ్రామాలకు రావాలనుకునే వారికి నిరాశే మిగిలిందన్నారు. వైద్యానికి హైదరాబాద్‌ వెళ్లాల్సిన పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రైల్వే సేవలు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదని.. ఇలాంటి సమయంలో ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే సంక్రాంతి నాటికీ ఈ సమస్య పరిష్కారం కాదని నాదెండ్ల మనోహన్‌ వ్యాఖ్యానించారు.

* ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ) కూటమిలోని సభ్య దేశాలకు భారత్‌ నుంచి వలసలు భారీగా పెరిగినట్లు ‘ఇంటర్నేషనల్‌ మైగ్రేషన్‌ ఔట్‌లుక్‌ 2020’ వెల్లడించింది. ఓఈసీడీకి వలస వెళ్తున్న జాబితాలో చైనా ముందుండగా.. భారత్‌ రెండో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆయా దేశాల పౌరసత్వం తీసుకోవడంలోనూ భారతీయుల సంఖ్య గణనీయంగానే ఉన్నట్లు పేర్కొంది.

* గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 69,095 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,503 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా.. 28 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,89,553కు చేరింది. తాజాగా ప్రాణాలు కోల్పోయినవారితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 6,481 మంది బాధితులు కొవిడ్‌కు బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 5,144 మంది కోలుకోవడంతో రాష్ట్రంలో పూర్తిగా కోలుకున్నవారి సంఖ్య 7,49,676కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 33,396 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వివరించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 71,96,628 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో పేర్కొంది.

* విధి నిర్వహణలో అమరులైన పోలీసులే నిజమైన హీరోలని నటుడు సాయికుమార్‌ అన్నారు. షూటింగ్‌ నిమిత్తం తిరుపతి వెళ్లిన ఆయన సతీసమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న సాయికుమార్‌ దంపతులకు తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను మీడియాతో సాయికుమార్‌ పంచుకున్నారు.

* ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఈ ఘటన జరిగిందంటూ పృథ్వీరాజ్‌ టీం ఆయన ఫేస్‌బుక్‌ ఖాతాలో వెల్లడించింది. ‘బంజారాహిల్స్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి వద్ద వినాయకుడి గుడి వైపు పృథ్వీరాజ్‌ వెళ్తుండగా ఓ కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారు ధ్వంసమైంది. చుట్టుపక్కల జనాలు గుమిగూడారు’ అంటూ ధ్వంసమైన కారు ఫొటోను షేర్‌ చేసింది. అయితే నటుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* బిర్యానీ రూ.10లకే విక్రయిస్తే అరెస్టు చేయటం ఏమిటని అనుకుంటున్నారా.. అయితే ఇది చదవండి. తమిళనాడులోని అరుప్పుకొట్టైలో జహీర్‌ అనే వ్యక్తి ఆదివారం ఓ హోటల్‌ను ప్రారంభించాడు. కస్టమర్లు హోటల్‌కు అలవాటు పడేందుకు తొలి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకూ కేవలం రూ.10లకే బిర్యానీని విక్రయిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో జనం బారులుతీరారు. ఫలితంగా తోపులాట ప్రారంభమైంది. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ముఖ్యంగా కొవిడ్ నిబంధనలను గాలికొదిలేశారు. భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా నిలబడటం.. చాలా మంది మాస్కులు ధరించకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.పోలీసులు అక్కడకు చేరుకునేలోపు యజమాని తయారు చేయించిన 2500 బిర్యానీ పొట్లాల్లో దాదాపు సగం వరకూ విక్రయించారు. వారు హోటల్‌ యజమాని జహీర్‌ను అరెస్టు చేశారు. మిగిలిన బిర్యానీ పొట్లాలను యాచకులకు పంపిణీ చేశారు. హోటల్‌ యజమానిపై 188, 269, 278 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదని హెచ్చరించి బెయిల్‌పై విడుదల చేశారు.

* ఆలయాలు తెరిచే అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఆ రాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ మధ్య జరిగిన మాటల యుద్ధం.. ఆపై అమిత్‌ షా వ్యాఖ్యలు.. ఈ పరిణామాలనుద్దేశించి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఘాటుగా స్పందించారు. ఆత్మాభిమానమే ఉంటే ఆ పదవి నుంచి వైదొలగాలంటూ గవర్నర్‌కు పరోక్ష సవాల్‌ విసిరారు. ‘‘ఆత్మాభిమానం ఉన్న ఏ ఒక్కరూ ఆ పదవిలో కొనసాగరు. లేఖలో గవర్నర్‌ ఉపయోగించిన పదజాలంపై కేంద్ర మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాంటప్పుడు ఆత్మాభిమానం ఉన్నవారు ఆ పదవిలో ఉండాలా.. లేదా.. అని ఆలోచించి నిర్ణయం తీసేసుకుంటారు’’ అని వ్యాఖ్యానించారు.

* వరద సహాయక చర్యలపై తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… రానున్న పది రోజులపాటు ప్రతి ఎమ్మెల్యే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు పర్యవేక్షించాలని సూచించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సీఎం ప్రకటించిన తక్షణ సాయం అందేలా చూడాలన్నారు.

* ఓ మహిళా మంత్రిని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమల్‌నాథ్‌ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ కించపరచాలనుకోలేదని తెలిపారు. అభ్యర్థి పేరు గుర్తు రాకపోవడంతో ‘ఐటం’ అనే పదం వాడాల్సి వచ్చిందన్నారు. ‘‘నేను ఓ మాట అన్నాను. అది ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో వాడలేదు. నాకు ఆ వ్యక్తి పేరు గుర్తుకురాలేదు. ఈ జాబితాలో (చేతిలో ఉన్న ఓ పత్రాన్ని చూపుతూ) ఐటం నెం.1, ఐటం నెం.2 అని ఉంది. అది అవమానించినట్లా?’’ అంటూ తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. ప్రచారంలో చెప్పుకునేందుకు ఏమీ లేకే భాజపా ఈ అంశంపై వివాదం చేస్తోందని ఆరోపించారు.

* ఓ మహిళా మంత్రిని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమల్‌నాథ్‌ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ కించపరచాలనుకోలేదని తెలిపారు. అభ్యర్థి పేరు గుర్తు రాకపోవడంతో ‘ఐటం’ అనే పదం వాడాల్సి వచ్చిందన్నారు. ‘‘నేను ఓ మాట అన్నాను. అది ఎవరినీ కించపరిచే ఉద్దేశంతో వాడలేదు. నాకు ఆ వ్యక్తి పేరు గుర్తుకురాలేదు. ఈ జాబితాలో (చేతిలో ఉన్న ఓ పత్రాన్ని చూపుతూ) ఐటం నెం.1, ఐటం నెం.2 అని ఉంది. అది అవమానించినట్లా?’’ అంటూ తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. ప్రచారంలో చెప్పుకునేందుకు ఏమీ లేకే భాజపా ఈ అంశంపై వివాదం చేస్తోందని ఆరోపించారు.

* పంజాబ్‌లో వ్యవసాయ బిల్లుల వ్యవహారం రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోంది. ఇటీవల కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు దీటుగా పంజాబ్‌ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్ బిల్లులను ఇవాళ సభలో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. అంతకు ముందు బిల్లులకు సంబంధించిన డ్రాఫ్ట్‌ పేపర్లను తమకు అందించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఆప్‌ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. రాత్రంతా అసెంబ్లీలోనే పడుకొని ఆందోళన చేపట్టారు.

* భారీ వర్షాలతో అల్లాడుతున్న భాగ్యనగరం కోసం తారాలోకం కదిలివచ్చింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో బాధితుల సహాయార్థం తెలుగు చలనచిత్ర సీమ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. మొదట నాగార్జున తన వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 లక్షలు విరాళం అందించబోతున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఆపై చిరంజీవి, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, విజయ్‌ దేవరకొండ, త్రివిక్రమ్‌, హరీష్‌ శంకర్‌ తదితరులు విరాళాల్ని ప్రకటించారు.

* భారీ వర్షాలకు దెబ్బతిన్న తెలంగాణకు సాయం చేసేందుకు దిల్లీ ప్రభుత్వం ముందుకొచ్చింది. వరదలతో అతలాకుతలమవుతోన్న హైదరాబాద్‌లో సహాయ చర్యల నిమిత్తం రూ.15కోట్ల అందిస్తామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు.ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం రూ.పదికోట్ల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది.

* సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. నవంబర్‌ 2వ తేదీ నుంచి పాఠశాలను పునఃప్రారంభించనున్నట్లు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల పునఃప్రారంభంపై సీఎం స్పందించారు. నవంబరు 2 నుంచి పాఠశాలల్లో రోజువిడిచి రోజు తరగతులకు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించాలని.. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు.

* కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగాయని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంగళవారం తీర్పు వెల్లడించిన ఎన్జీటీ పర్యావరణ అనుమతుల్లో అతిక్రమణలు జరిగినట్టు గుర్తించామని తెలిపింది. ప్రాజెక్టు పూర్తయినందున ఉపశమన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. తాగునీటి ప్రాజెక్టు పేరుతో సాగు అవసరాలకు కూడా రూపకల్పన చేశారన్న ఎన్జీటీ.. వాటిని పరిగణనలోకి తీసుకోవడంలో కేంద్ర పర్యావరణశాఖ విఫలమైందని పేర్కొంది. విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నా…పర్యావరణాన్ని పక్కన పెట్టలేమని, ప్రజా ప్రయోజనాలు, పర్యావరణం రెండూ కలిసి నడవాల్సిందేనని తేల్చి చెప్పింది. పర్యావరణ ప్రభావం మదింపు లేకుండానే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారన్న ఎన్జీటీ.. అనుమతులపై కమిటీ ఏర్పాటు అవసరమని సూచించింది.