NRI-NRT

తానా “నారీ- సాహిత్య భేరి” విజయవంతం

TANA Naaree-Bheree On Vijayadasami Witnesses Women Writers Across Globe

ఉత్తర అమెరికా తెలుగు సంఘం, ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ విజయదశమి సందర్భంగా అంతర్జాలంలో నిర్వహించిన “నారీ -సాహిత్య భేరీ” కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 24 మంది ప్రవాస మహిళలు పాల్గొని స్వీయ సాహిత్యంతో కూడిన పాటలను వినిపించారు.

తానా అధ్యక్షులు తాళ్ళూరి జయశేఖర్ మాట్లాడుతూ “మహిళా సాహితీవేత్తలను ప్రోత్సహించే ఉద్దేశంతో “నారీ-సాహిత్య భేరి” శీర్షికను ప్రారంభించామని, నారి లేకపోతే నర లోకమే లేదని, వనిత లేకపోతే- జనతే లేదని, కాంత లేకపోతే కలియుగమే లేదని, విశ్వ విజయ భేరి-వీర నారి అంటూ నారీ శక్తిని గౌరవించడం, అభిమానించడం మన అందరి కర్తవ్యం” అన్నారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని నింపటానికి మహిళా సాహిత్యం ఎంతగానో ఉపకరిస్తుందని, మహిళా సాహితీవేత్తలను ప్రోత్సహించడం ద్వారా నవ సమాజానికి నాంది పలికినట్లవుతుందని, రానున్న కాలంలో మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు అందిస్తామని” ప్రకటించారు.

సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ “నారీ సాహిత్య భేరి” శీర్షిక ప్రారంభించడం తానా తెలుగు సాహితీ చరిత్రలోనే ఒక మైలురాయని, ఇది ఒక శుభ పరిణామం”అన్నారు. ఈ గాన లహరి కార్యక్రమంలో “మహిళలు మేల్కొనాలి అని, హక్కుల కోసం పోరాడాలని, అమ్మను మించిన దైవం లేదని, సృష్టికి మూలం స్త్రీ అని, ప్రతి పురుషుడి విజయం వెనక స్త్రీ ఉందని, స్త్రీ శక్తిని మించిన శక్తి మరొకటి లేదని, స్త్రీ సాధించలేని విజయం అంటూ ఏదీ లేదని, స్త్రీ నడుం బిగించి ముందుకు సాగాలని, పిరికితనంతో వెనుకడుగు వేయరాదని, మహిళల పై అత్యాచారాలు జరుపుతున్న మానవ మృగాల పై తిరగబడాలని” అనేక సందేశాత్మక నేపథ్యంతో కూడిన పాటలను, గేయాలను ఆలపించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయ అతిథులు – మంగిపూడి రాధిక (సింగపూర్), డాక్టర్ బండారు సుజాత శేఖర్ (హైదరాబాద్), కవుటూరి గాయత్రి (ఖమ్మం), యామినీ కనకతార (హైదరాబాద్), డాక్టర్ సుధా ఆమంచి (నోయిడా), బుర్ర పద్మశ్రీ (హైదరాబాద్), నిభానుపూడి శ్రీ వాణి (హైదరాబాద్), తిరుపతిగారి అంబుజ (మహబూబ్ నగర్), డాక్టర్ పండ్రంగి శారద (ఒరిస్సా), అడ్డగూరి శ్రీ లక్ష్మీ (మంచిర్యాల), ఎడవల్లి శ్రీదేవి (తాడేపల్లిగూడెం),వజ్రాల ఇందిర (తిరువూరు), వాణి ప్రభాకరి (తణుకు), బాన్న రాజేశ్వరి (వైజాగ్), సీతాలత (అనకాపల్లి), కందూరు సుజాత రాణి (హైదరాబాద్), లక్ష్మీ పెండ్యాల (హైదరాబాద్), వై.కే. సంధ్య శర్మ (చిత్తూరు), అడ్డగూడి ఉమాదేవి (వరంగల్), కుమారి పి. వీ. సాయి అనూఙ్ఞ (వైజాగ్), ఇంజపురి వసంత (కరీంనగర్), బి. అంజనీ దేవి (గుంటూరు), డాక్టర్ భల్లూరి ఉమాదేవి (డల్లాస్), సుందరవల్లి తిరుమల (న్యూజెర్సీ).

తానా అంతర్జాతీయ మహిళా విభాగపు సారథి లక్ష్మీ దేవినేని ఈ కార్యక్రమం చాలా చక్కగా ఉందని, మహిళలకు తానా పెద్ద పీట వేస్తుంది అనడానికి ఇదొక మచ్చుతునక అని అన్నారు. తానా మహిళా సేవా విభాగపు నిర్వాహకురాలు శిరీష తూనుగుంట్ల వందన సమర్పించారు. తానా కార్యనిర్వాహక సభ్యుడు సుమంత్ రామిశెట్టి తదితర కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.