NRI-NRT

H1B లాటరీలకు స్వస్తి. ఇక అంతా జీతాలపైనే.

అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విధానాల్లో సంస్కరణల బాట పట్టిన ట్రంప్‌ సర్కారు మరో కీలక ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ఆశ్రయించే హెచ్‌-1బి వీసాల మంజూరులో ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసే యోచనలో తాము ఉన్నట్లు తెలిపింది. దాని స్థానంలో వేతన స్థాయి ఆధారిత వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. దానిపై 30 రోజుల్లోగా స్పందనలు తెలియజేయవచ్చునని పేర్కొంది. మరో వారం రోజుల్లోపే అధ్యక్ష ఎన్నికలు జరగనున్న కీలక తరుణంలో ట్రంప్‌ సర్కారు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. విదేశీ వృత్తి నిపుణులు అమెరికాలోకి ప్రవేశించేందుకు హెచ్‌-1బి వీసా వీలు కల్పిస్తుంది. భారత్‌ సహా పలు దేశాల నుంచి లక్షల మంది ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. వారిలో ఏటా 65 వేల మందికి కంప్యూటరైజ్డ్‌ లాటరీ విధానంలో వీసాలు జారీ చేస్తుంటారు. అయితే- ఈ విధానం ద్వారా కంపెనీలు తక్కువ వేతనాలకే విదేశీయులను రప్పించుకుంటున్నాయని, ఫలితంగా అమెరికా పౌరులు ఉపాధి కోల్పోతున్నారని ట్రంప్‌ సర్కారు చాన్నాళ్లుగా గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో లాటరీ విధానానికి స్వస్తి పలకాలని తాజాగా ప్రతిపాదించింది. ఇకపై వేతన ప్రాతిపదికన వీసాలు జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. అత్యధిక వేతనాలున్న నిపుణులకే వీసాలు దక్కేందుకు నూతన విధానం దోహదపడుతుందని పేర్కొంది. తద్వారా అమెరికన్ల ఉద్యోగాలకు రక్షణ దక్కుతుందని, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని అభిప్రాయపడింది. విదేశీ నిపుణులకు వీసాల జారీపై ఆది నుంచీ కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌ ప్రభుత్వం.. ఈ ఏడాది డిసెంబరు 31 వరకు కొత్తగా హెచ్‌-1బి, ఎల్‌-1 వీసాలను మంజూరు చేయకుండా తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే.