Health

మీ మతిమరుపుకు కారణం మీ కారు

మీ మతిమరుపుకు కారణం మీ కారు

వాయు కాలుష్యం కంటికి కనిపించదు. కానీ అందులో అత్యంత సన్నగా ఉండే రసాయనాలు, పొగ, ధూళి… వంటివన్నీ చాలానే ఉంటాయి. అవన్నీ వెంట్రుకమందం కన్నా ముప్ఫై రెట్లు చిన్నగా ఉంటాయి. కానీ ఇవి మెదడు నిర్మాణంమీద ప్రభావాన్ని కనబరచడం ద్వారా డిమెన్షియా, ఆల్జీమర్స్‌ వ్యాధుల్ని కలిగిస్తున్నాయని చెబుతున్నారు యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా నిపుణులు. మిగిలినవాళ్లతో పోలిస్తే 70 నుంచి 80 సంవత్సరాల్లోపు మహిళల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందట. వరసగా ఓ ఐదు సంవత్సరాలపాటు వాయు కాలుష్యంతో నిండిన ప్రదేశంలో జీవించడం వల్ల అందులోని టాక్సిన్లు మెదడు నిర్మాణాన్ని మార్చుతున్నాయనీ దాంతో వాళ్లలో మతిమరుపు సమస్య ఎక్కువగా ఉంటుందనీ పేర్కొంటున్నారు. ఇందుకోసం డిమెన్షియా లేని కొందరు మహిళల్ని ఎంపికచేసి వాళ్ల మెదడు నిర్మాణాన్ని ఎమ్మారై స్కాన్‌ ద్వారా పరిశీలించారట. ఐదేళ్ల తరవాత మళ్లీ ఎమ్మారై స్కాన్‌ తీశారట. ఆపై వాయు కాలుష్యం ఉన్న ప్రదేశాల్లో ఉన్నవాళ్లనీ లేనివాళ్లనీ వేరుచేసి వాళ్ల జ్ఞాపకశక్తి శాతాన్నీ లెక్కించారట. అందులో కాలుష్యం ఉన్న ప్రదేశాల్లో నివసించేవారి మెదడు నిర్మాణంలో తేడా స్పష్టంగా కనిపించిందట.