Devotional

హజ్ యాత్రే ఓ ప్రార్థన!

హజ్ యాత్రే ఓ ప్రార్థన!

ఆ ప్రయాణమే ఓ ప్రార్థన
హజ్‌… ఇస్లాం మతానికి అయిదు మూల స్తంభాల్లో ఆఖరుది.
ప్రతి ముస్లిం తన జీవితంలో ఒకసారైనా హజ్‌ యాత్ర చేయాలన్నది నిర్దేశం.
హజ్‌ యాత్రలో సందర్శించే పవిత్ర ప్రదేశాలు అనేకం… ప్రతి దానికీ ఒక విశిష్టత ఉంది.
వాటి గురించి విశేషాలు….
**మక్కా పుణ్య క్షేత్రానికి చేసే యాత్రను ‘హజ్‌ యాత్ర’గా వ్యవహరిస్తారు. ఇస్లాం కేలండర్‌లో పన్నెండవ నెల అయిన జిల్‌హజా నెలలో ముస్లింలు హజ్‌ యాత్ర చేపడతారు. నలభై రోజుల ఆ పవిత్ర యాత్రలో ఎన్నో నియమ నిష్ఠలు పాటించాల్సి ఉంటుంది. మక్కాలో ముప్ఫై రోజుల పాటు బసచేసి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం పుణ్యప్రదమని భావిస్తారు. జిల్‌ హజా మాసంలో ఎనిమిదవ రోజు నుంచీ పన్నెండవ రోజు వరకూ- అయిదు రోజులు అత్యంత పవిత్రమైనవి. ఈ ఏడాది ఆగస్టు తొమ్మిది నుంచి పధ్నాలుగవ తేదీ మధ్యలో ప్రధాన యాత్రా దినాలు ఉంటాయి.
***ఈ యాత్రలో ముఖ్యమైన సందర్శనీయ స్థలాలు:
*మొదటి ప్రార్థనా మందిరం
కాబా… సౌదీ అరేబియాలోని మక్కా నగరంలోని మసీదు. భూమి మీద నిర్మితమైన మొదటి ప్రార్థనా మందిరంగా దీన్ని పవిత్ర ఖుర్‌ఆన్‌ గ్రంథం అభివర్ణిస్తోంది. అంతే కాదు, కాబా ప్రపంచంలోనే అతి పెద్ద మసీదు. ఇది జిద్దా విమానాశ్రయానికి సుమారు వంద కిలోమీటర్ల లోపు దూరంలో ఉంది. సాహిత్యపరంగా ‘కాబా’ అంటే చతురస్రాకారంలో ఉన్న గృహం అని అర్థం. దీన్ని ‘మస్జిదుల్‌ హరామ్‌’, ‘తైతుల్‌ అతీఖ్‌’ అని కూడా అంటారు. ‘మస్జిద్‌ అల్‌’ అంటే అత్యంత గౌరవప్రదమైన గృహం, ‘బైతుల్‌ అతీఖ్‌’ అంటే అత్యంత ప్రాచీనమైన, స్వతంత్రమైన గృహం అని అర్థం. హజ్‌, ఉమ్రా (మక్కా తీర్థయాత్ర)లకు కాబా కేంద్ర బిందువు. ముస్లింలు నమాజ్‌ (ప్రార్థన)ను కాబా ఉన్న దిక్కువైపు తిరిగి చేస్తారు. దీన్ని ‘ఖిబ్లా’ అని అంటారు. అల్లాహ్‌ ఆజ్ఞప్రకారం దేవదూతలు దీన్ని మొదట నిర్మించారని చెబుతారు. ఆ తరువాత ప్రవక్త ఇబ్రహీం, ఇస్మాయిల్‌ అలైహిస్సలామ్‌ పునర్నిర్మించారు. ప్రస్తుతం కాబా వైశాల్యం 3,56,800 చదరపు మీటర్లు. దీని విస్తరణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. హజ్‌ సమయంలో దీని లోపలి-వెలుపలి భాగంలో దాదాపు డెబ్భై లక్షల మంది నమాజ్‌ చేసే సౌకర్యం ఉంది. కాబా గృహాన్ని బూడిద, నీలం రంగు రాళ్ళతో కట్టారు. దీని తూర్పు వైపున అస్వత్‌ (నల్లటిరాయి) తాపడం చేసి ఉంటుంది. దక్షిణం వైపు ప్రదేశాన్ని ‘రూక్నె యమాని’ అంటారు. అది యమన్‌ దేశం దిశగా ఉండడమే దీనికి కారణం.
*రూ. 30 కోట్ల రూపాయల వస్త్రం
కాబా నాలుగు గోడలు కిస్వాహ్‌ (తెర)తో కప్పి ఉంటాయి. ఏడాదికి ఒకసారి, హజ్‌ సమయంలో ఆ వస్త్రాన్ని మారుస్తారు. ఆ నల్లని వస్త్రంపై అంతిమ పవిత్ర దివ్య ఖుర్‌ఆన్‌లోని ప్రవచనాలను ఎంబ్రాయిడరీ ప్రక్రియలో అల్లుతారు. అవి మెరుస్తూ అత్యద్భుతంగా కనిపిస్తాయి. సుమారు 47 అడుగుల ఎత్తు, 130 అడుగుల వెడల్పు ఉండే కిస్వాహ్‌కు శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ వస్త్రం తయారీకి కొన్నేళ్ళ కిందట 17 మిలియన్ల సౌదీ రియాల్స్‌ ఖర్చయ్యేది. మన కరెన్సీలో చెప్పాలంటే అది దాదాపు రూ. 23 కోట్లు. అయితే ఇప్పుడు బంగారం, వెండి, పట్టు దారాల ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టి రూ. 30 కోట్ల వరకూ ఖర్చు అవుతోంది.
*నల్లని రాయి
హజ్రుల్‌- అస్వద్‌ అనేవి రెండు అరబ్బీ పదాలు. ‘హజ్ర్‌’ అంటే రాయి. ‘అస్వద్‌’ అంటే నల్లనిది. అంటే ‘నల్లని రాయి’ అని అర్థం. ఇది కాబా గృహం దక్షిణ-తూర్పు దిశల (ఈశాన్య) గోడలో అమర్చి ఉంది. మూడు పెద్దవి, మరెన్నో చిన్న రాతి ముక్కలతో, గుండ్రటి ఆకారంతో ఉంటుంది. దీని చుట్టూ వెండి చక్రం ఉంది. హజ్‌, ఉమ్రా యాత్రికులు కాబా గృహ ప్రదక్షిణ సమయంలో ప్రతిసారీ ఈ రాతిని ముద్దు పెట్టుకోవాలి. లేదా దానివైపు చెయ్యి ఎత్తాలి. కాబా ప్రదక్షిణ హజ్రె అస్వద్‌ నుంచి మొదలవుతుంది. హజ్రె అస్వద్‌ స్వర్గం నుంచి అవతరించిందని విశ్వాసం.
*తవాఫ్‌
‘తవాఫ్‌’ అంటే చుట్టూ తిరగడం, ప్రదక్షిణ చేయడం. బైతుల్లాహ్‌ (కాబా) చుట్టూ తిరగడాన్ని, ప్రదక్షిణ చేయడాన్ని ‘తవాఫ్‌’ అంటారు.
*ఆ బావి ఎండి పొదు
‘జమ్‌ జమ్‌’ బావి ఎంతో ప్రత్యేకమైనది. అరవై ఆరు అడుగుల లోతున ఉండే ఈ ‘జమ్‌ జమ్‌’ బావి నాలుగువేల సంవత్సరాలనుంచి ఎండిపోలేదనీ, నీటి రుచి మారలేదనీ చెబుతారు. ఇరవై నాలుగు గంటలూ మోటార్లు ఈ బావి నుంచి సెకనుకు ఎనిమిది వేల లీటర్ల చొప్పున నీటిని తోడుతూ ఉంటాయి. కానీ పదకొండు నిముషాల్లో ఈ బావి మళ్ళీ నిండిపోతుంది. ‘సుబాహ్‌ నల్లాహ్‌ జమ్‌ జమ్‌’ బావి నీటిలో కాల్షియం, మెగ్నీషియం, లవణాలు, సహజమైన ఫ్లోరైడ్లు, క్రిమినాశక లక్షణాలు, ఔషధ గుణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
*కొండల మధ్య నడవాలి!
‘సఫా’, ‘మర్వా’ అనే రెండు చిన్న కొండలు మక్కాలోని మస్జిదె హరామ్‌లో ఉన్నాయి. ఇస్మాయిల్‌ అలైహిస్సలామ్‌ ఆకలితో ఏడుస్తూ ఉండగా, ఆయన తల్లి హజిరా నీటి కోసం ఈ కొండల మధ్య పరుగెట్టారు. ఆ పరుగునే ‘సయీ’ అంటారు. ‘సయీ’ అంటే అన్వేషించడం అని అర్థం. హజిరా ఈ కొండల మధ్య పరుగెడుతూ, నీటిని అన్వేషించారు కాబట్టి దీన్ని ‘సయీ’ అంటారు. హజ్‌, ఉమ్రాల సందర్భంగా ఈ కొండల మధ్య ఏడుసార్లు నడవడం విధి. ఈ కొండలు కాబాకు వంద మీటర్ల (సుమారు మూడువందల ముప్ఫై అడుగుల) దూరంలో ఉన్నాయి. సఫా, మర్వా కొండల మధ్య దూరం నాలుగువందల యాభై మీటర్లు (పధ్నాలుగువందల ఎనభై అడుగులు). వాటి మధ్య ఏడు సార్లు నడక దూరం 3.15 కిలోమీటర్లు. ఈ రెండు దారులూ మస్జిద్‌ ప్రాంగణానికి చేర్చి ఉన్నాయి.
*సైతాన్‌ పైకి కంకర రాళ్లు!
హజ్‌ యాత్ర చేసేవారు ఎనిమిదవదైన జిల్‌ హజ్‌ రోజున మీనా నగరానికి వెళ్ళి, జోహార్‌, అసర్‌, మగ్రిబ్‌, ఇషా నమాజులు, మరుసటి రోజు ఫజర్‌ నమాజు చేస్తారు. మక్కా నుంచి మీనాకు పది కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి అరాఫాత్‌ మైదానానికి వెళ్తారు. తొమ్మిదవ రోజును ‘వుఖూఫె అరఫా’ అంటారు. అంటే అరాఫాత్‌ మైదానంలో కూర్చొని, జోహార్‌, అసర్‌ నమాజులు, దువాలు చేస్తారు. మగ్రిబ్‌ సమయంలో అరఫాత్‌ మైదానం నుంచి ముజ్‌దలిఫా బయలుదేరుతారు. అక్కడ మగ్రిబ్‌, ఇషా నమాజులు చేస్తారు. ముజ్‌దలిఫాలో రాత్రి దువాలు ఆచరిస్తూ, బస చేస్తారు. డెబ్భై కంకర రాళ్ళను మైదానంలో ఏరుకొని, తమ వద్ద భద్రపరుచుకుంటారు. పదవరోజును ‘యౌమున్నహర్‌’ అంటారు. ఈ రోజున ముజ్‌దలిఫాలో ఫజర్‌ నమాజు చదివి, జమరతుల్‌ ఉఖ్‌బాపై (సైతానుపై) రాళ్ళు రువ్వుతారు. తరువాత ‘తవాఫ్‌’ చేస్తారు. ఖుర్బానీ (జంతువును జబహ్‌ చేయడం) ఇస్తారు. ‘హల్క్‌’ అంటే గుండు చేయించుకుంటారు.
*జమరాత్‌
రెండు నుంచి మూడు రోజులు అంటే పదకొండు, పన్నెండు, పదమూడు రోజుల్లో మధ్యాహ్నం నుంచి మూడు స్తూపాల దగ్గర రాళ్ళు రువ్వుతారు. దీన్ని ‘జమరాత్‌’ అంటారు. అయ్యామె తష్‌రీఖ్‌ పదవ రోజు నుంచి పదమూడవ రోజు వరకూ రాత్రి వేళల్లో మీనాలో నిద్రిస్తారు. దీన్ని ‘అయ్యామె తష్‌రీఖ్‌’ అంటారు.
*ఖుర్‌ఆన్‌ అవతరించిన హిరా గుహ
ఖుర్‌ఆన్‌ అవతరించిన హిరా గుహ మక్కా నుంచి మీనా ప్రాంతానికి వెళ్ళే దారి మధ్యలో, సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ఎత్తు మూడువేల అడుగులు. మహమ్మద్‌ ప్రవక్త పై ఖుర్‌ఆన్‌ అవతరణ ప్రక్రియ ఈ గుహలోనే ప్రారంభం అయింది. యాత్ర చివరిలో తవాఫె విదా (కాబా ప్రదక్షిణ)ను వీడ్కోలుగా చేసి మదీనాకు బయలుదేరుతారు.
**ప్రవక్త నగరి మదీనా
మదీనా మునవ్వరాను ‘మదీనా తుర్రసూల్‌’ (ప్రవక్త నగరి)గా కూడా వ్యవహరిస్తారు. ‘మదీనా తయ్యిబా’ అనేది మరో పేరు. అరేబియా ద్వీపకల్పంలో సముద్ర మట్టానికి 619 మీటర్ల ఎత్తున ఉన్న ఈ చారిత్రక నగరం ఎర్రసముద్రానికి తూర్పు దిక్కున ఉంది. వేసవికాలంలో ఉష్ణోగ్రత నలభై రెండు డిగ్రీలకు మించినప్పటికీ, చలికాలంలో మాత్రం బాగా పడిపోతుంది. ఒక్కోసారి పగటి పూటే సున్నా నుంచి ఆరు డిగ్రీల మధ్య ఎముకలు కొరికే చలి ఉంటుంది. రాత్రిపూట కుండల్లో నీరు సైతం గడ్డ కట్టుకుపోతుంది. మక్కా నగరానికి ఉత్తర దిశలో, దాదాపు 450 కి.మీ. దూరంలో ఉన్న మదీనా నగరం హిజాజ్‌ క్షేత్రంలో అంతర్భాగం. జనాభా పరంగా సౌదీ అరేబియాలో మూడవ అతి పెద్ద పట్టణం. పవిత్ర మక్కా తరువాత ముస్లిం జగతికి అతి ప్రియతమమైన, శుభవంతమైన నగరం ఇది. అల్లాహ్‌ అంతిమ సందేశహరుడు, విశ్వ కారుణ్య మూర్తి మహమ్మద్‌ ముస్తాఫా నడయాడిన నగరం. సత్సమాజ రూపకల్పనకు కారుణ్యమూర్తి శ్రీకారం చుట్టిన నగరం. దైవ ప్రసాదిత జీవన సంవిధానం ఆధారంగా శ్రేయోరాజ్య స్థాపనకు మానవ మహోపకారి నడుం బిగించిన నగరం. దైవదౌత్య పరంపర సమాప్తం అయిన నగరం. ఒక ప్రవక్తగా తన కర్తవ్యాన్ని మహనీయ మహమ్మద్‌ నెరవేర్చి, శాశ్వతంగా విశ్రమిస్తున్న నగరం. లక్ష మంది నమాజ్‌కు మస్జితే నబవీ మదీనా పట్టణం నడిబొడ్డున ఈ పవిత్ర మస్జిద్‌ ఉంది. అక్కడకు వెళ్ళినవారు అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. భక్తి పారవశ్యంలో ఓలలాడుతారు. ఈ మస్జిద్‌ ఎర్రని రాళ్ళతో నిర్మితమయింది. ఏకకాలంలో ఇక్కడ లక్షమంది నమాజ్‌ చేయ్యవచ్చు.
*ఆకు పచ్చని గుమ్మటం
హిజ్రీ శకం పదకొండవ సంవత్సరమైన రబీవుల్‌ అవ్వల్‌లో పన్నెండవ రోజైన సోమవారం నాడు మహా ప్రవక్త మహమ్మద్‌ తన సతీమణి హజ్రత్‌ ఆయిషా కుటీరంలో పరమపదించారు. ప్రవక్త మహాప్రస్థానం చేసిన స్థలంలోనే ఆయన పవిత్ర పార్థివ శరీరాన్ని ఖననం చేశారు. అది మస్జిద్‌ ఆవరణలోనే ఉంది. ఇక్కడ ఆకు పచ్చని గుమ్మటం సమున్నతంగా కనిపిస్తుంది. దాన్ని ‘గుంబదె ఖజ్రా’ అని పిలుస్తారు. మస్జితే నవబీ పక్కనే జన్నతుల్‌ ఖబీ (శ్మశాన వాటిక) ఉంది. అక్కడ ఎందరో మహా పురుషుల సమాధులు ఉన్నాయి. మదీనాకు దక్షిణాన మస్జిదె ఖుబా ఉంది. మస్జిదె ఖిబ్లాతైన్‌, మస్జిదె బిలాల్‌, మస్జిదె హజ్రత్‌ ఆలీ, మస్జిదె అబూబకర్‌, మస్జిదే గమామా… ఇంకా ఎన్నో ప్రసిద్ధ మసీదులు ఉన్నాయి.మదీనాలోని ఇస్లామిక్‌ యూనివర్సిటీ అతి పెద్ద విశ్వవిద్యాలయం. మదీనా నగరంలో ఖుర్‌ఆన్‌ ప్రింటింగ్‌ కాంప్లెక్స్‌ విస్తృతమైన సేవలు అందిస్తోంది. ఇక్కడ ప్రపంచంలోని యాభైకి పైగా భాషలలో ఖుర్‌ఆన్‌ అనువాదాలు ముద్రితమై, ఉచితంగా సరఫరా అవుతున్నాయి.