Business

టాటా సన్స్ సరికొత్త రికార్డు-వాణిజ్యం

Business News - TATA Sons Creates New Record

* గత కేలండర్‌ ఏడాది(2020)లో దేశీయంగా లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రీత్యా అతిపెద్ద ప్రమోటర్‌గా టాటా సన్స్‌ ఆవిర్భవించింది. తద్వారా పలు పీఎస్‌యూలలో మెజారిటీ వాటాలు కలిగిన కేంద్ర ప్రభుత్వాన్ని అధిగమించింది. 2020 డిసెంబర్‌ చివరికల్లా టాటా సన్స్‌ గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ 9.28 లక్షల కోట్లను తాకింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలోని పీఎస్‌యూల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) రూ. 9.24 లక్షల కోట్లకు పరిమితమైంది. ఏడాది కాలంలో టాటా గ్రూప్‌ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ 34 శాతానికిపైగా బలపడటం విశేషంకాగా. పీఎస్‌యూల విలువ దాదాపు 20 శాతం క్షీణించడం గమనార్హం! వెరసి రెండు దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం నిలుపుకుంటూ వస్తున్న టాప్‌ ర్యాంకును టాటా సన్స్‌ చేజిక్కించుకున్నట్లు ఆంగ్ల పత్రిక బిజినెస్‌ స్టాండర్ట్‌ నివేదిక పేర్కొంది.

* దేశీయ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మహీంద్రా అండ్‌ మహీంద్రా, టీసీఎస్, ఎస్‌బీఐ షేర్లు ప్రధానంగా రాణించడంతో కొత్త ఏడాది తొలి రోజును సూచీలు లాభాలతో ముగించాయి. లోహ మెటల్‌, ఫార్మా, రియల్టీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సూచీలు ఇంట్రాడే గరిష్ఠాలను కోల్పోయాయి. నిఫ్టీ 14 వేల పాయింట్ల పైన స్థిరపడింది.

* భారత్‌లో ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రాతో ఖరారు కావాల్సిన జాయింట్‌ వెంచర్‌(జేవీ) ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికాకు చెందిన వాహన ఉత్పత్తి సంస్థ ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ ప్రకటించింది. ప్రణాళిక ప్రకారం.. ఈ ఒప్పందం గురువారమే ఖరారు కావాల్సి ఉంది. కానీ, కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ విపణిలో తలెత్తిన ప్రతికూల ప్రభావం వల్ల ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నామని ఇరు సంస్థలు ప్రకటించాయి. మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల్ని అధిగమించేందుకు తమ పెట్టుబడుల ప్రాధాన్యతల్ని ఫునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఇరు సంస్థలు అభిప్రాయపడ్డాయి.

* డిసెంబరు నెలలో వస్తు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు రికార్డు స్థాయికి చేరాయి. ఎన్నడూ లేనివిధంగా గత నెలలో రూ.1,15,174 కోట్లు వసూలయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత నెలవారీ వసూళ్లలో ఇదే అత్యధికం కావడం విశేషం. 2019, ఏప్రిల్‌లో వసూలైన రూ.1,13,866 కోట్లే ఇప్పటి వరకు అత్యధికంగా ఉండేవి. 2019, డిసెంబరుతో పోలిస్తే ఈసారి ఏకంగా 12శాతం పెరిగాయి. నవంబరులో రూ.1,04,963 కోట్లు వసూలైన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం జీఎస్టీ వసూళ్లు వరుసగా మూడో నెల రూ.లక్ష కోట్లు దాటాయి. కరోనా మహమ్మారి సంక్షోభం నుంచి భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనడానికి ఇది బలమైన సంకేతం అని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే జీఎస్టీ వ్యవస్థలో ఉన్న లోపాల్ని సవరించడంతో అవకతవకలకు ఆస్కారం తగ్గిందని.. అది కూడా వసూళ్ల పెరుగుదలకు ఓ కారణమని వెల్లడించింది.

* కరోనా మహమ్మారి వేళ కొత్త సంవత్సరం వేడుకలు కాస్త కళతప్పాయి. అవుట్‌డోర్‌ పార్టీలు.. డీజేల మోతలు తగ్గాయి. వైరస్‌ భయం.. ప్రభుత్వ ఆంక్షల నడుమ ఈ ఏడాది చాలా మంది ఇళ్లకే పరిమితమై న్యూఇయర్‌ను ఆహ్వానించారు. అయితే ఈ మార్పు ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌లకు బాగా కలిసొచ్చినట్లుంది. గురువారం సాయంత్రం నుంచే ఫుడ్‌ ఆర్డర్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ప్రముఖ యాప్‌ జొమాటోకు నిన్న రాత్రి ఏకంగా నిమిషానికి 4100 ఆర్డర్లు వచ్చాయట. ఈ మేరకు కంపెనీ సీఈవో దీపీందర్‌ గోయల్‌ ట్విటర్‌లో సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు.

* ప్రభుత్వానికి సకాలంలో పన్ను చెల్లించడం ప్రతి పన్ను చెల్లింపుదారుడి విధి. ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను దాఖలు చేయడంలో ఆలస్యం చేసి జరిమానాలు ప‌డ‌కుండా క్రమశిక్షణ కలిగి ఉండటం మంచిది. కోవిడ్ -19 లాక్‌డౌన్‌ నేపథ్యంలో మ‌దింపు సంవ‌త్స‌రం ఆY 2020 కోసం ఆలస్యమైన లేదా సవరించిన ఐటీఆర్‌ని దాఖలు చేయడానికి చివరి తేదీ ఇప్పటికే ఈ సంవత్సరం చాలాసార్లు పొడిగించబడింది. పన్ను చెల్లింపుదారు కోసం ఆదాయపు పన్ను విభాగం ఆY 2020-21 (FY 2019-20) సంబంధించిన రిటర్న్స్ గ‌డువును జులై 31 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మరో సారి, రిటర్న్ ఫైలింగ్ చివరి తేదీని 2020 డిసెంబర్ 31 నుంచి 2021 జనవరి 10 కి మార్చారు. ఇది ఆడిట్ అవసరం లేకుండా ఐటీఆర్-1 లేదా 4 ద్వారా రిటర్న్స్ దాఖలు చేసే వారికి వర్తిస్తుంది. అయితే ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఆదాయాన్ని దాఖలు చేయడానికి చివరి తేదీ వరకు వేచి ఉండటం మంచి విష‌యం కాదు.