Business

ఆలీబాబాకు గడ్డుకాలం-వాణిజ్యం

Chinese Govt Crushing Alibaba - Telugu Business News

* అలీబాబా గ్రూప్‌పై చైనా ప్రభుత్వానికి చెందిన నియంత్రణ సంస్థలు కన్నెర్ర చేయడంతో ఆ ప్రభావం ఆ సంస్థకు చెందిన వ్యాపారాలపై పడింది.దీంతో అలీబాబా సంస్థ తన వ్యాపారాలను తగ్గించుకొనేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. 2013లో కొనుగోలు చేసిన షియామి మ్యూజిక్‌ యాప్‌ను మూసివేయాలని నిర్ణయించింది. చైనా వినోదరంగంలో కీలక వాటాను కైవశం చేసుకోవాలని అలీబాబా ఈ యాప్‌ను కొనుగోలు చేసింది. అలీబాబా యాప్‌ ఏకఛత్రాధిపత్యం కోసం ప్రయత్నిస్తోందంటూ కొన్ని రోజుల క్రితం నియంత్రణ సంస్థలు బెదిరించాయి. దీంతో వచ్చే నెల నుంచి మ్యూజిక్‌ యాప్‌ను మూసివేయాలని షియామి వర్గాలు నిర్ణయించాయి.
‘‘కార్యకలాపాల్లో సర్దుబాట్ల కోసం షియామి మ్యూజిక్‌ యాప్‌ను ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మూసివేయాలని నిర్ణయించుకొన్నాము’’ అని అలీబాబా మ్యూజిక్‌ తమ విబో ఖాతాలో పేర్కొంది. వాస్తవానికి ఈ యాప్‌ అలీబాబా అనుకొన్న స్థాయిలో గొప్ప విజయం సాధించలేదు. చైనా మ్యూజిక్‌ రంగంలో కేవలం 2శాతం వాటాను మాత్రమే దక్కించుకొంది. ఇప్పటికే కుగౌ, క్యూక్యూ మ్యూజిక్‌, నెట్‌ఈజ్‌ క్లౌడ్‌ మ్యూజిక్‌ వంటివి ముందున్నాయి. షియామి మ్యూజిక్‌ వంటివి సంస్థలకు యాంట్‌గ్రూప్‌ మాతృసంస్థగా ఉంది. వీటిని ఒకే ఛత్రం కిందకు తీసుకురావడం అలీబాబాకు కష్టంగా మారింది. యాంట్‌గ్రూప్‌కు బ్యాంక్‌ వంటి నిబంధనలు వర్తించడంతో.. దానిలో కలిసే సంస్థలకు కూడా అటువంటి నిబంధనలే వర్తించే పరిస్థితి ఉంది.

* ప్రముఖ పాడ్‌కాస్ట్‌ యాప్‌ బ్రేకర్‌ ట్విటర్‌ చేతికి వెళ్లనుంది. త్వరలోనే దీనిని ట్విటర్‌ కొనుగోలు చేయనుంది. వచ్చే వారం నుంచి అది అందుబాటులో ఉండదు. ఈ విషయాన్ని బ్రేకర్‌ సీఈవో ఎరిక్‌ బెర్లి తన అధికారిక బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘మన వినియోగదారులకు విషాదకరమైన వార్త. శుక్రవారం నుంచి బ్రేకర్‌ను మూసివేస్తున్నాం. భవిష్యత్తులో తీసుకురానున్న వాటిపై దృష్టిపెట్టేందుకు ఇది సహకరిస్తుందని భావిస్తున్నాం. బ్రేకర్‌లో ఆడియో కమ్యూనికేషన్‌పై చాలా శ్రద్ధపెట్టాం. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తమ భావాలను తెలిపేందుకు ట్విటర్‌ అందించిన వేదికను చూసి స్ఫూర్తి పొందాం’’అని పేర్కొన్నారు. ఎరిక్‌ బెర్లి బృందం ట్విటర్‌లో చేరింది.

* తమ కంపెనీ సెల్‌ టవర్లను ధ్వంసం చేసిన ‘స్వార్థ ప్రయోజన శక్తుల’పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ లిమిటెడ్‌ వేసిన పిటిషన్‌ను పంజాబ్‌, హరియాణా హైకోర్టు నేడు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలంటూ పంజాబ్‌ ప్రభుత్వం, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.

* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) చెక్కుల ద్వారా లావాదేవీల‌కు మ‌రింత భ‌ద్ర‌త‌ కోసం ‘పాజిటివ్ పే సిస్టమ్’ ను రూపొందించింది. కొత్త నియమం ప్రకారం రూ.50,000 కంటే ఎక్కువ చెల్లింపులకు కీలక వివరాల పున-నిర్ధారణ అవసరం. ఈ కొత్త చెక్ చెల్లింపు నియమం 1 జనవరి 2021 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో ఖాతా సంఖ్య‌ , చెక్ సంఖ్య‌, చెక్ మొత్తం, చెక్ చెల్లింపులకు సంబంధించి చెక్ తేదీ, చెల్లిస్తున్న వారి పేరు వంటి వివరాల‌ను తెల‌పాల్సి ఉంటుందని ఎస్‌బీఐ పేర్కొంది.

* దేశీయ మార్కెట్లు మరో అరుదైన రికార్డు అందుకున్నాయి. వరుసగా పదో రోజూ సూచీలు లాభాల్లో దూసుకెళ్లాయి. సోమవారం సెన్సెక్స్‌ 48వేల మార్కును దాటగా, ఈరోజు మరింత ముందుకు వెళ్లింది. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 261 పాయింట్లు లాభపడి 48,437 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. నిఫ్టీ కూడా 66 పాయింట్ల లాభంతో 14,199 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.73.17 నమోదైంది.

* ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ టీకాను అన్ని దేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఉందని ఆ సంస్థ సీఈవో అదార్‌ పూనావాలా వెల్లడించారు. కొవిషీల్డ్‌ ఎగుమతికి భారత్‌ అనుమతినివ్వలేదని సోమవారం వార్తలు వచ్చిన నేపథ్యంలో పూనావాలా ట్విటర్‌ వేదికగా స్పష్టతనిచ్చారు.

* ఆదాయపు పన్ను శాఖ 2021 సంవత్సరానికి కొత్త ఇ-క్యాలెండర్‌ను విడుద‌ల‌ చేసింది. ఇది పన్నుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన గడువుల జాబితాను కలిగి ఉంది. ‘నిజాయితీపరులను గౌరవించేవిధంగా ఈ క్యాలెండర్‌గా రూపకల్పన చేశారు. పన్ను వ్యవస్థ ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేని, ఫేస్‌లెస్, కాగిత రహితంగా మారింద‌ని ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఆదాయ‌ప‌న్ను విభాగం తెలిపింది.

* ఈ ఆర్థిక సంవత్సరం తొమ్మిదో ద‌శ‌ సార్వభౌమ బంగారు బాండ్ల ఇష్యూ ఈ రోజు ముగుస్తుంది. ఈసారి 2020-21-సిరీస్ ఈX ఇష్యూ ధర గ్రాము బంగారానికి రూ. 5000 గా నిర్ణయించిన సంగ‌తి తెలిసిందే. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే పెట్టుబడిదారులకు గ్రాముకు రూ. 50 తగ్గింపు లభిస్తుంది. అప్పుడు గ్రాము బంగారానికి, రూ.4,950 అవుతుంది.