Devotional

చిత్తూరు జిల్లాలో మరో సంచలన హత్య

చిత్తూరు జిల్లాలో మరో సంచలన హత్య

చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని గుండ్లపల్లె సమీపంలో ఉన్న శ్రీ రామతీర్థ సేవాశ్రమ నిర్వాహకుడు అచ్యుతానందగిరి స్వామి (65) మంగళవారం రాత్రి గుర్తుతెలియని ఆగంతుకుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. చిత్తూరు పశ్చిమ సీఐ లక్ష్మీకాంతరెడ్డి, ఐరాల ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి కథనం మేరకు… గుండ్లపల్లెవద్ద 50 సంవత్సరాలుగా శ్రీరామతీర్థ సేవాశ్రమం ఉంది. అప్పట్లో ఈ ఆశ్రమానికి శాంతానందస్వామి నిర్వాహకుడిగా ఉన్నారు. 30 ఏళ్ల క్రితం అరగొండ పైమాఘం గ్రామానికి చెందిన పూర్ణచంద్రారెడ్డి అలియాస్‌ అచ్యుతానందగిరి స్వామి.. శాంతానందస్వామి వద్ద శిష్యుడిగా చేరారు. ఆయన మరణానంతరం అచ్యుతానందగిరి ఆశ్రమ నిర్వాహకుడి బాధ్యతలు చేపట్టారు. ఆయన వద్ద పాకాల మండలానికి చెందిన ఓ వృద్ధురాలు (60) 13 ఏళ్లుగా శిష్యురాలిగా ఉంటున్నారు. కొద్దికాలంగా వీరిద్దరే ఆశ్రమంలో నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి ఇరువురు భోజనం ముగించుకుని వారి గదుల్లో నిద్రించేందుకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత స్వామీజీ గది నుంచి శబ్దం రావడంతో వృద్ధురాలు అక్కడకు వెళ్లి చూడగా అప్పటికే స్వామీజీ కాళ్లు, చేతులు కొట్టుకుంటూ కనిపించారు. చీకట్లో ఏమి జరిగిందో అర్థంకాక పరిసరాల్లో ఆమె గాలించారు. అప్పటికే అక్కడున్న ఓ ఆగంతకుడు ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో.. పక్కనే పడిపోయి ఉన్న స్వామిజీ గొంతు నులిమి చంపేశాడు. దీన్ని చూసిన వృద్ధురాలు భయపడి పక్కనున్న మామిడి తోటలోకి వెళ్లి దాక్కుని ఉదయం వరకు రాలేదు. ఆపై ఆశ్రమానికి చేరుకుని స్వామీజీ విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి విషయాన్ని పేయన్నగారిపల్లెకు చెందిన రెడ్డెప్పరెడ్డికి (ఓ భక్తుడు) విషయం చేరవేసింది. దీంతో పరిసర గ్రామస్థులు ఆశ్రమానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీమ్‌ వేలిముద్రలు సేకరించింది. జాగిలాలు ఘటనా స్థలం నుంచి పీలేరు వైపు వెళ్లాయని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించామని ఎస్సై చెప్పారు. రెడ్డెప్పరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అచ్యుతానందగిరి స్వామి పార్థివ దేహానికి గురువారం అంత్యక్రియలు నిర్వహిస్తామని భక్తులు వెల్లడించారు. స్వామిజీ హత్య జరిగిన స్థలం నుంచి కూతవేటు దూరంలో స్థానికులు ఓ పర్సును గుర్తించి పోలీసులకు అందించారు. అందులో ఏటీఎం కార్డు, కొన్ని ఫొటోలు, ఫోన్‌ నంబర్లు ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.